– బాధితుడికి న్యాయం
నవతెలంగాణ – కామారెడ్డి
కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ( ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. నేరం చేసిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని కామారెడ్డి పోలీసులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఫిర్యాదిదారుడు కేతావత్ పరుశురాం, అయ్యపల్లి తండా వాసి, ప్రస్తుతం పిప్పిరియగడి తండాలో నివసిస్తున్నాడు. అసన్‌పల్లి శివారులో 1 ఎకరం 20 గుంటల భూమిని కురుమ భూమయ్య వద్ద కొనుగోలు చేసి కొంత మొత్తాన్ని చెల్లించి, మిగిలిన డబ్బును పట్టా అనంతరం చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
ఈ విషయమై 16-07-2021న తండా పెద్దమనిషి పిలుపుతో అక్కడికి వెళ్లిన పరుశురాంపై భూమయ్య అల్లుడు బోయిన ప్రవీణ్ కుమార్‌తో పాటు మొతుకుల సంగమేశ్వర్ గౌడ్, కురుమ భద్రయ్యలు కలిసి కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, స్థానికులను విచారించి సాక్ష్యాధారాలు సేకరించారు. నిందితులైన మొతుకుల సంగమేశ్వర్ గౌడ్, బోయిన ప్రవీణ్, కురుమ భద్రయ్యలను అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
విచారణలో నేరం రుజువవడంతో కోర్టు శిక్ష విధించింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన నిజాంసాగర్ పోలీసులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ ఆర్. దయాకర్ గౌడ్‌తో పాటు అప్పటి నిజాంసాగర్ ఎస్‌హెచ్‌ఓ సయ్యద్ అహ్మద్, డీఎస్పీ వి. జైపాల్ రెడ్డి, ప్రస్తుత బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి, నిజాంసాగర్ ఎస్‌హెచ్‌ఓ శివకుమార్, కోర్టు లైజనింగ్ అధికారులు ఏఎస్‌ఐ రాజేశ్వర్, శ్రీనివాస్, సీడీఓ వసీంలను ఎస్పీ అభినందించారు.



