ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్దం..
కొత్తపల్లి శివ కుమార్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిస్ట్, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య లు పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారల చేతుల్లో కీలుబొమ్మగా మారి కార్మిక, కర్షక ,విద్యార్థి, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో కార్మిక వర్గం తమ హక్కుల రక్షణ కోసం దశాబ్దాల క్రితం తమ రక్తం చిందించి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి వేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదన్నారు. ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ,రాష్ట్ర ,ఉమ్మడి జాబితాలోని కార్మిక, వ్యవసాయ, విద్య,ఇన్సూరెన్స్ రంగాలలోని చట్టాలను నియంతృత్వంగా, దౌర్జన్యపూరితంగా తన చేతుల్లోకి తీసుకొని మార్చి వేస్తూ,భారత ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలను విడనాడి దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా, వివిధ రాష్ట్ర అసెంబ్లీ ల్లో తీర్మానం లేకుండా 2025 లో పార్లమెంట్లో ఏకపక్షంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన సవరణ చట్టం ,విబిజి రాంజీ స్కీమ్ లను నిలిపివేసి, పాత చట్టాలను పునరుద్ధరించి కార్మిక వర్గానికి, రైతులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో స్వామీనాథ్ సిఫారసులను అమలు చేయలని అన్నారు. అమెరికాలో పండించిన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, పాలు తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా సున్నాకు తగ్గించడం ద్వారా భారత రైతులను మార్కెట్ నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా ప్రభుత్వం అక్కడి రైతులకు భారీ సబ్సిడీలు ఇస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుంటే, మన దేశంలో మాత్రం రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, మోదీ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం లేదు అన్నారు.దేశంలో దాదాపు 20 కోట్ల రైతు కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. రోజుకు సగటున 31 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో అమెరికాతో ఒప్పందం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది అన్నారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వ్యవసాయ,వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.లేని యెడల కార్మిక, కర్షకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, టియుసిఐ జిల్లా కోశాధికారి ఐతరాజు వెంకన్న, జిల్లా నాయకులు చిత్తలూరి లింగయ్య, రాంజీ ,పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక సహయ కార్యదర్శి సంతోషిమాత కోశాధికారి జయమ్మ జిల్లా నాయకులు ఐతరాజు పద్మ, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జలంధర్, అనసూయ, రహమతి, రాజు తదితరులు పాల్గొన్నారు.



