– క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటన
– తంగళ్ళపల్లి నుండి గుండారెడ్డిపల్లి గ్రామం వెళ్ళే రోడ్డు మూసివేత
నవతెలంగాణ-కోహెడ : సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల పరిధిలో ఉన్న సింగరాయ గుట్టల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
పులి పాదముద్రలు గుర్తించిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. అలాగే పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్న మార్గాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి పరిస్థితులపై అటవీశాఖ సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి మాట్లాడుతూ పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దానిని పట్టుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా కూరెళ్ల, శనిగరం, గుండారెడ్డిపల్లి, తంగళ్ళపల్లి గ్రామ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు లేదా ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లకూడదని, కనీసం ఐదు నుంచి ఆరు మంది గుంపులుగా మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పులి సంచారం ఉన్నందున అటవీ ప్రాంతంలోకి వెళ్లడం ప్రమాదకరమని, ప్రజలు అడవిలోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే తంగళ్ళపల్లి నుండి గుండారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం పులిని సురక్షితంగా పట్టుకునే దిశగా చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. వారి వెంట ఎస్సై అభిలాష్, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
సింగరాయ గుట్టల పరిసరాల్లో పులి సంచారం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



