సిరిసిల్ల ఓటరు.. రూట్ సపరేట్..
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన ఫలితాలు
బిఆర్ఎస్ 27,కాంగ్రెస్ 6, బిజెపి 5,స్వతంత్రులు 1
సిరిసిల్ల మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేకం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్రమంతా ఒక గాలివీస్తుంటే.. సిరిసిల్లలో మాత్రం ప్రత్యేకమైన మార్పులే చోటు చేసుకుంటాయి. మొత్తానికి సిరిసిల్ల ఓటరు తన రూటే సపరేటని మరోసారి చెప్పినట్లు అయ్యిందని రాజకీయ పరిశీలకులు మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 స్థానాలు ఉండగా 27 స్థానాల్లో బి ఆర్ ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ప్రత్యేకత ఏమిటంటే గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 22 స్థానాల్లో విజయం సాధించగా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 27 స్థానాల్లో జయ కేతనం ఎగురవేయడం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహాత్మక ఎత్తుగడలే ఆ పార్టీకి ఊహించని విజయాన్ని అందించాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేవి ప్రజలను ప్రభావితం చేయకపోవడం ఆశ్చర్యమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల లో ప్రభావం చూపకపోవడంపై ఆ పార్టీ నాయకుల్లో ఉన్న అనైక్యతే కారణమా.? అన్న అంశంపై ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చినా (2 స్థానాల నుంచి 6 స్థానాలకు పెరిగింది). పట్టణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకోలేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గతంలో 2 స్థానాల నుంచి ప్రస్తుతం 6 స్థానాలకు చేరిన కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ పీఠాన్ని చేజార్చుకోవడం పై పట్టణంలో జోరుగా చర్చ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై ప్రజల్లో అనేక అనుమానాలు అపోహలు వెల్లివెత్తిన పరిస్థితి కనిపించింది. మునిసిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి.
కాకపోతే గతంలో 3 స్థానాల నుంచి ప్రస్తుతం 5 స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీ కొంత మేరకు ప్రజల్లో ప్రభావం చూపిందనే చెప్పవచ్చు. గతంలో కంటే ఈసారి స్వతంత్ర అభ్యర్థులు తీవ్రంగా ప్రభావం చూపుతారనుకున్నా అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 1 స్థానానికే పరిమితం కావడం గమనించవచ్చు. మొత్తానికి మునిసిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల ఓటరు ఇచ్చిన తీర్పు కేవలం సిరిసిల్ల మున్సిపాలిటీకి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలమనే చెప్పాలి. మొత్తానికి సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు పోటీలో ఉన్న అభ్యర్థులకు పాఠమనె చెప్పాలి



