యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ‘ హస్తం ‘ హవా
తొలిసారి వికసించిన ‘ కమలం ‘
ఒక్క స్థానానికే పరిమితమై వాడిపోయిన ‘ గులాబీ ‘
ప్రభావం చూపని స్వతంత్ర అభ్యర్థులు
చైర్మన్ గా గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఎన్నిక లాంఛనమే!
నవతెలంగాణ – ఆలేరు యాదగిరిగుట్ట
తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే జరిగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పకడ్బందీ వ్యూహం ఫలించింది. పోలింగ్ కు ముందే 10వ వార్డును ఏకగ్రీవం చేసి, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆయన రాజకీయంగా బలహీన పరిచిన విషయం తెలిసిందే. ఇక, మొత్తం 11 వార్డులకు ఎన్నికలు జరగా, శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ : 8+1 (పొత్తులో భాగంగా సీపీఐ గెలుపొందింది). బీజేపీ : 2 స్థానాల్లో గెలిచి బోణీ కొట్టింది. మొన్నటి వరకు మున్సిపల్ లో అధికారం కొనసాగించిన బీఆర్ఎస్ కేవలం ఒకటే స్థానానికి పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ ముందుగానే ప్రకటించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కనిపించలేదు.
క్లీన్ స్వీప్ దిశగా ‘ బీర్ల ‘ వ్యూహం
తాను నివాసం ఉంటున్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాల్లో గెలవడం కాదు. మొత్తం 12 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల అయిలయ్య ‘ చతుర్ముఖ వ్యూహం ‘ పన్నారు. పనితనం.. సామాజికవర్గం.. ఆర్థిక నేపథ్యం వంటి అంశాల దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా అంతర్గత సర్వేను చేయించారు. అందులో భాగంగానే స్థానికంగా గౌరవ ప్రదమైన ఓటు బ్యాంకు కలిగిన CPI పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. సమస్యలు పునరావృతం కాకుండా.. ముందుగానే అభ్యర్థులను సమన్వయం చేసి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విప్ అయిలయ్య గడప గడప ప్రచారం కలిసొచ్చింది. అంతే కాదు, 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ పరిణామం ‘ కారు ‘ పార్టీని కుదిపేసి.. ఆదిలోనే బలహీనపరిచింది.
అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ బలహీనం
గుట్ట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కూడా చుక్కెదురైంది. 11 స్థానాల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం వరించింది
గుట్టలో వికసించిన ‘ కమలం ‘
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో తొలిసారిగా కమలం వికసించింది. రెండు స్థానాల్లో గెలిచింది..
ప్రభావం చూపని ‘ స్వతంత్ర అభ్యర్థుల
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారు.. గుట్ట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి అప్పటి అధికార ‘ కారు ‘ పార్టీకి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించిన తరుణంలో మున్సిపల్ తీర్పు స్థానిక గులాబీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అధిస్థానం కూడా సీరియస్ అయింది. ఈ పరిణామాల నేపధ్యంలో అధికార బలం వినియోగించి.. ఎక్స్ ఆఫీషియో మెంబర్ల ఓట్లతో బి ఆర్ ఎస్ చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. దీంతో కౌన్సిలర్ వాణి భరత్ గౌడ్ కు అవకాశం ‘ చేయి ‘ జారింది.
‘పోయిన చోటే.. వెత్తుకోవాలన్న ‘ అన్నచందంగా ఇప్పుడు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా వాణి భరత్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
ఆలేరులోనూ విజయ దుందుభి
ఇటు యాదగిరిగుట్ట, అటు ఆలేరు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను ఎక్స్ అఫీషియ ఓట్లను వాడకుండా కైవసం చేసుకుంటానని ఎన్నికల ముందు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శపధం చేసి మరి పంతం నెరవేర్చుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్ట మున్సిపాలిటీ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చర్చ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకురావాలని ప్రభుత్వ విప్ కు ఆదేశించారు. దీంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్ పెట్టాను కైవసం చేసుకున్నారు. పక్కనే గల జిల్లా కేంద్రం జనగామలో కూడా విప్ బీర్ల అయిలయ్య ప్రచారం నిర్వహించిన వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.



