అమెరికా పాత్ర ప్రత్యేకించి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర అంతకంతకూ ఒక ”బుల్డోజర్” తరహాలోకి మారిపోతున్నది. బుల్డోజర్లను ఏకపక్షంగా ప్రయోగించి బలహీనులూ, ఏ రక్షణలేని వారి హక్కులను ఎలా కాలరాస్తారో భారతదేశంలోని మనకు ఇప్పుడు బాగా తెలుసు. మెజారిటీతో విర్రవీగే వాతావరణంలో ఈ విధంగా నగ్నంగా దురాక్రమణకు పాల్పడటం సోషల్ మీడియా వరణంలోని భక్తగణాల నుంచి భారీ ప్రశంసలు తీసుకువస్తుంది. అయితే అంతర్జాతీయ రంగంలో అదే విధమైన ధోరణి వల్ల రాజకీయంగా తీవ్రనష్టం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. ఇది దేశ సార్వభౌమత్వానికి హానికరమైనది.
బయటి ప్రపంచంతో భారత దేశ సంబంధాల నిర్వహణ లో గత కొంత కాలంగా జరుగుతున్నది కచ్చితంగా ఇదే. పహల్గాం దాడి, పాకిస్తాన్‌పై తదనంతర సైనిక ఘర్షణ నాటి నుంచి ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. భారత, పాకిస్తాన్‌లుగా తాము లోతుగా పరిశీలించిన తర్వాతనే ఈ విరమణ జరిగిందన్న భారత దేశ ప్రకటనకు అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా చేసిన ప్రకటన పూర్తి విరుద్ధంగా తయారైంది. ఏమైనా ఇరు దేశాలు అధికారికంగా ఫలితం ప్రకటించే లోపుగానే ట్రంప్ హడావుడిగా చేసిన ప్రకటనతో ద్వైపాక్షిక సమస్యల్లో తృతీయ దేశాల జోక్యానికి చోటు ఇవ్వబోమన్న మన పవిత్రమైన వచనాలను పచ్చిగా వమ్ము చేసినట్టయింది. అయితే భారత పాలనా వ్యవస్థ ఇప్పటికీ అదే మాట అంటున్నది.
మరింతగా లొంగుబాటు
ఇప్పటికి కొంత కాలంగా భారత విదేశాంగ విధానం అమెరికా గొంతెమ్మ కోర్కెలకు బందీ అయిపోయిందని స్పష్టమవుతూ వస్తోంది. మోడీ సర్కారులో అది మరింత బాహాటంగా నడుస్తున్నది. వ్యవసాయం, నియంత్రణలు, డిజిటల్ విధానం, భద్రతా పొత్తులపై భారత అమెరికా వాణిజ్య ఒప్పందం ఇందుకు గట్టి సాక్ష్యం. అమెరికా విడుదల చేసిన అధికారిక ప్రకటన దీన్ని మరింతగా నిరూపించింది. ‘రష్యన్ ఫెడరేషన్ నుంచి అమెరికాకు ఎదురవుతున్న ముప్పును తట్టుకోవడం కోసం సుంకాలను సవరిస్తూ అధ్యక్షుడు చేపడుతున్న చర్యలపై అధికారిక ఉత్తర్వులు’ అనే పేరుతో 2026 ఫిబ్రవరి ఆరున అది విడుదలైంది.
భారత అమెరికా వాణిజ్య ఒప్పందం పరిధిని అధికారికంగా అమెరికా భారత ప్రభుత్వాలు 2026 ఫిబ్రవరి 7న తెల్లవారు జామున విడుదల చేశాయి. అంతర్జాతీయ రంగంలో భారతదేశం ఎదుర్కొంటున్న మధ్య కాలిక, తక్షణ నేపథ్యాలు ఈ పత్రాలకూ సంబంధం లేదనేే భ్రమ కలగడానికి ఇది కారణం కావచ్చు. తన వాణిజ్య వ్యవసాయ రంగాల కోసం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ చర్చలలో భారత దేశం టారిఫ్ రాజుగా చిత్రించబడింది. అయితే టారిఫ్‌లతో సహా అంతర్జాతీయ వ్యవసాయ రక్షణ విధానాలను మొత్తంగా పరిగణించేట్టయితే అత్యధికమైన అభేద్యమైన టారిఫ్ సబ్సిడీ గోడలు కట్టింది, అన్యాయమైన టారిఫ్ యేతర అడ్డంకులు సృష్టించిందీ అత్యధికంగా ధనిక దేశాలే.
జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం వాటా గణనీయంగా తగ్గిపోతున్నది. అదే సమయంలో వ్యవసాయంపై ఆధారపడిన జనాభా శాతం చెప్పుకోదగినంతగా ఏమీ తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో ఏ అంతర్జాతీయ ఒప్పందాన్నయినా కేవలం షరతులలో ఒక అంశంగా చూడకూడదు. కోట్లాది మంది చిన్న మధ్యతరహా రైతుల జీవనోపాధి సమస్యగా దాన్ని చూడవలసి వుంటుంది. వారు చిరు ఉత్పత్తిలో పాల్గొంటుంటారు. అయితే సబ్సిడీలు, ఆహార భద్రత అనివార్య అవసరాల కోసం భారతీయ రైతులను కాపాడేందుకు తీసుకునే ఎలాంటి చిన్న చర్యనైనా సరే వాణిజ్యపరంగా చిత్రించడం, టారిఫ్ టారిఫేతర అడ్డంకిగా ప్రతికూల ముద్ర వేయడం జరుగుతున్నది.
నిజమేమిటి?
కానీ, వాస్తవం పూర్తిగా భిన్నంగా వుంది. సగటున 39శాతం వున్న భారతదేశ వ్యవసాయ టారిఫ్‌లనే అత్యధికమైనవిగా, దారుణంగా చిత్రించేట్టయితే అప్పుడు సంపన్న దేశాలు నిస్సందేహంగా రక్షణ విధానాలలో మరింత పెద్ద మొనగాళ్లుగా చెప్పాల్సి వుంటుంది. తృణధాన్యాలు, పాడి ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 188 శాతం పైన టారిఫ్‌లు విధిస్తుంది. భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా సృష్టించిన ఇలాంటి టారిఫ్ టెర్రర్‌పై దుష్ప్రచారానికి తోడు దానికి 4500 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులు కలిగివుందనే ఫిర్యాదు లేవనెత్తింది. ఆ పేరుతో భరించలేని స్థాయిలో 25 శాతం టారిఫ్‌లను విధించింది. రష్యా నుంచి చమురు సహజ వాయువు తీసుకుంటున్నందుకు వేసిన శిక్ష అంటూ తర్వాత మరో 25 శాతం అదనపు టారిఫ్ విధించి యాభై శాతానికి చేర్చింది.
ఇక్కడ వాస్తవాలు స్పష్టంగానే వున్నాయి. అమెరికా సరుకులపై భారత దేశం విధించే టారిఫ్ జీరో నుంచి మూడు శాతం వుంటే భారతీయ సరుకులపై అమెరికా విధించే టారిఫ్ గతంలో ప్రతిపాదించిన యాభై శాతం గాక పద్దెనిమిది శాతానికి పెంచబడింది. ట్రీ నట్స్ (జీడిపప్పు, బాదంపప్పు తదితరాలు), పశుగ్రాసం, ఎర్రజొన్నలు, తాజా-ప్రాసెస్ చేసిన పండ్ల వంటి వాటిపై భారత అమెరికా ఒప్పందం ఆ దేశ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ సమకూర్చి పెడుతుందనేది తెలుస్తూనే వుంది. అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ ట్రంప్‌నకు ధన్యవాదాలతో మాట్లాడిన దానిలో ఇదే నొక్కిచెప్పారు. ”మరోసారి మన అమెరికా రైతులకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు.
దీంతో మనం భారత దేశపు విస్తార మార్కెట్లకు మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయవచ్చు. వాటి రేట్లు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లోకి నగదు ప్రవహించడం జరుగుతుంది. 2024లో ఇండియాతో అమెరికా వ్యవసాయ వాణిజ్య లోటు 1300 కోట్ల డాలర్లుంది. పెరిగే ఇండియా జనాభా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యమైన మార్కెట్‌గా వుంటుంది. పైన చెప్పిన వాణిజ్య లోటును తగ్గించేందుకు కూడా ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయంపై కుదుర్చుకునే డజన్ల కొద్ది ఒప్పందాలలో అగ్రభాగాన అమెరికా సాధించిన తొలి విజయం ఇది.” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దానికి సంబంధించిన భారీ సబ్సిడీల గురించి ఇక అసలే చెప్పనవసరం లేదు.
ముందస్తుగానే ఆమోదం
వాస్తవానికి రోలిన్స్ కన్నా ముందే ట్రంప్ ఫిబ్రవరి 2న మోడీతో జరిపిన ఫోన్ సంభాషణ సారాంశాన్ని ట్వీట్ చేశారు. దీన్ని ప్రధాని ఆమోదించారన్న సంకేతం ఇచ్చారు. అయిదు రోజుల పాటు పార్లమెంటు జరుగు తున్నా భారత పాలనా వ్యవస్థ గుంభనంగా వుండిపోయింది. దీనిపై ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం ఎలాంటి ఖండన విడుదల చేయలేదన్నది వేరే విషయం. అలా జరగలేదు సరికదా అమెరికా చెప్పుకున్న గొప్పలన్నీ వాణిజ్య ఒప్పందం రూపురేఖలపై వెలువడిన అధికారిక ప్రకటనలోనూ, అధికారిక ఉత్తర్వుల ప్రకటనలోనూ అవే పొందుపర్చబడ్డాయి. ఈ ఒప్పందంలో పేర్కొన్న అంశాలుగాక వచ్చే ఐదేళ్లలో 50వేల కోట్ల డాలర్ల విలువైన చమురు, ఇతర ఉత్పత్తులు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి భారతదేశం హామీనిచ్చింది. ఇది కచ్చితంగా మన స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగించే తిరుగులేని సాక్ష్యం.
రష్యా నుంచి చవకగా కొనుగోలు చేస్తున్న చమురు సరఫరాలను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా పావులు కదుపుతున్నా కూడా మోడీ ఆ దేశం నుంచి మరింత అధిక రేటుతో చమురు తీసుకోవడానికి సమ్మతి తెలిపారు. వెనిజులా నుంచి కూడా మోడీ చమురు కొనుగోలు చేస్తారని ట్రంప్ ఆశిస్తున్నారు. అమెరికా నుంచి కొనుగోలుకు హామీ ఇచ్చిన వాటిలో వైమానిక ఉత్పత్తులు, రక్షణ ఉత్పత్తులు కూడా వున్నాయి. అమెరికా నుంచి పదివేల కోట్ల డాలర్ల దిగుమతులు చేసుకోవడం వల్ల ఇప్పుడు 4500 కోట్ల మిగులుతో వున్న భారతదేశ వాణిజ్యం ఒక్క దెబ్బతో వెనక్కుపోతుంది. అంతేగాక అమెరికా అధ్యక్షుని చర్యలతో ఈ ఒప్పందాన్ని ఏ విధంగానైనా ఉల్లంఘించకుండా చూసేందుకు నిర్దిష్టమైన ఒక పర్యవేక్షణా యంత్రాంగం కూడా ఏర్పాటవుతుంది. భారతదేశం అలా చేయడంలో విఫలమైతే వెంటనే అన్నిటిపైనా టారిఫ్‌లను పెంచేయడం జరుగుతుంది.
సిగ్గుచేటు!
ఈ వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకుని మహత్తర విజయం సాధించినందుకుగాను మోడీకి దండలు వేసి మెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వం, బీజేపీ తమను తామే అభినందించుకునే ప్రహసనానికి పాల్పడటం సిగ్గు చేటైన వ్యవహారం. ఏమైనా ఇరుపక్షాలు ఆమోదించిన పత్రాల పాఠాలను, దాంతోపాటు అధ్యక్షుడి అధికారిక ఉత్తర్వులను లోతుగా అధ్యయనం చేసేట్టయితే ఇది పూర్తి లొంగుబాటుగా స్పష్టమవుతుంది. భారత అమెరికా సంబంధాలలో సమాన ప్రాతిపదిక ఏ మూలనా లేదని, అమెరికా వ్యూహాత్మక క్రీడకు మన దేశం తోకగా మారిపోయే ప్రక్రియ మరింతగా జరిగిందని తెలుస్తుంది.
(ఫిబ్రవరి 11 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
అమెరికా ఆధిపత్య వ్యూహాలకు లొంగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



