Saturday, February 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నే కవాతు తొక్కాలిప్పుడు…

ప్రశ్నే కవాతు తొక్కాలిప్పుడు…

- Advertisement -

ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కూలిపోదు. అది కూలుతున్నదని కూడా మొదట ఎవరికీ తెలియదు. ఓ ప్రశ్న అడగకుండా వదిలేసిన రోజు, ఓ అన్యాయాన్ని ”మనకెందుకులే” అని దాటవేసిన క్షణం, ఓ అబద్ధాన్ని ”అదే నిజమేమో” అని అంగీకరించిన వేళ.. అక్కడే ప్రజాస్వామ్యం తన మొదటి శ్వాసను కోల్పోతుంది. అలాగే ఫాసిజం ఒక్కరోజులో పుట్టదు. అది తుపాకుల శబ్దంతోనో, రాజ్యాంగాన్ని బహిరంగంగా రద్దు చేయడంతోనో మొదలవదు. అది చిన్నచిన్న మౌనాల మీద, ప్రశ్నించని విధేయత మీద, ”మనకెందుకులే” అనే ఉదాసీనత మీద నిర్మించబడుతుంది.

నేడు భారత ప్రజాస్వామ్యం ఇదే ప్రమాదకర దశలో నిలబడి ఉంది. తుపాకులు కనిపించడం లేదు. ఎన్నికలు నిలిచిపోలేదు. రాజ్యాంగమూ రద్దుకాలేదు. కానీ, రాజ్యాంగ నియమాలు ఉల్లంఘనలకు గురవుతున్నాయి. ఎన్నికలు మినహా ప్రజల రాజకీయ జోక్యం క్రమంగా అణచివేయబడుతోంది. మన ప్రజాస్వామ్యం నిశ్శబ్దంగా ఖాళీ అవుతోంది. ఈ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలంటే.. బలప్రయోగం కంటే ప్రమాదకరమైన సమ్మతి రాజకీయాల స్వభావాన్ని తెలుసుకోవాలి. ఇందుకు ఆంటోనియో గ్రామ్సీ చెప్పిన హెజిమొనీ(ఆధిపత్యం) సిద్ధాంతం మనకు అత్యంత కీలకమైన విశ్లేషణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది.

హెజిమొనీ : బలప్రయోగం కాదు, సమ్మతి రాజకీయాలు
”రాజ్యం కేవలం పోలీసు, జైలు, సైన్యం వల్ల మాత్రమే కాదు, అది ప్రజల సమ్మతి వల్ల నిలబడుతుంది” అంటాడు గ్రామ్సీ. ఆయన ఆలోచనల ప్రకారం, ఆధునిక రాజ్యం తన ఆధిపత్యాన్ని కేవలం బలప్రయోగం (coercion) ద్వారా మాత్రమే నిలబెట్టుకోదు. దానికి ప్రజల సమ్మతి(consent)ని సాధించడం ద్వారా నిలుబెట్టుకుంటుంది. దీనినే హెజిమొనీగా నిర్వచించాడు గ్రామ్సీ. రాజకీయ ఆధిపత్యం అనేది అధికారాన్ని బలప్రయోగం ద్వారా నిలబెట్టే నిర్మాణం అయితే, సాంస్కృతిక ఆధిపత్యం ఆ అధికారానికి ప్రజల ఆలోచనల్లో సమ్మతిని నిర్మించి సహజంగా మార్చే ప్రక్రియ. ఒకటి బయటకి కనిపిస్తే, మరొకటి మనలోపల పనిచేస్తుంది.

అంటే ప్రజలను బలవంతంగా లొంగదీసుకోవడం కాదు, వాళ్లకు లొంగిపోయామని కూడా తెలియనివ్వకుండా వారి ఆలోచనలను ఆక్రమించడం. మన ఆలోచనలను మనకు తెలియకుండానే గుప్పిట్లో పెట్టుకోవడం. ‘ఇదే సహజం’, ‘ఇదే మార్గం’, ‘ఇదే మనకు మంచిది’ అని నమ్మేలా చేయడం. ఈ నమ్మకాలు ఒక్కరోజులో ఏర్పడవు. చదువు, మీడియా, మతం, సంస్కృతి, కుటుంబం లాంటి మార్గాల ద్వారా నెమ్మదిగా మనలోకి వస్తాయి. ఆ నమ్మకాలపై ఆధారపడి ప్రజలు దేన్నీ ప్రశ్నించకుండా అంగీకరించిన క్షణమే పాలనకు బలమూ భయమూ అవసరం ఉండదు. ప్రజల సమ్మతే పాలకుల అధికారానికి బలంగా మారుతుంది. ఈ సమ్మతి ఆధారంగా నిలబడే ఆధిపత్యాన్నే హెజిమొనీ అంటాడు గ్రామ్సీ. నేటి భారత రాజకీయ వ్యవస్థ ఇదే ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.

హెజిమొనీకి మానవ ముఖం ‘ఆదర్శ పౌరుడు’
ఈ హెజిమొనీ రాజకీయాలకు కావాల్సింది ప్రజల విధేయత. అది కూడా స్వచ్ఛంద విధేయత. అందుకే అవి ఇపుడు ఒక కొత్త ”ఆదర్శపౌరుడి”ని నిర్మిస్తున్నాయి. అతడు ప్రశ్నించడు. నిరసించడు. సందేహించడు. అతనికి మీడియా చెప్పిందే నిజం. ప్రభుత్వం చెప్పిందే అభివృద్ధి. పాలకుడు చెప్పిందే సందేశం. ఈ పౌరుడికి ఓటు వేయడం తెలుసు. కానీ, ప్రశ్న అడగడం తెలియదు. దీన్ని ప్రజాస్వామ్యం అనగలమా? ఇది ఎన్నికలతో అలంకరించుకున్న విధేయతా రాజ్యం. గ్రామ్సీ మాటల్లో చెప్పాలంటే, ఇది ప్రజల ఇంగితజ్ఞానం(common sense)గా మారిన పాలకవర్గ భావజాలం.

ఆధిపత్యానికి మూడు స్తంభాలు : భయం – భావోద్వేగం – మౌనం
ప్రస్తుత పాలక వ్యవస్థ తన రాజకీయ ఆధిపత్యాన్ని (హెజిమొనీని) కేవలం ఎన్నికల విజయం ద్వారా కాదు, సమాజపు ఆలోచనల(భావజాలం)ను నియంత్రించే మూడు కీలక స్తంభాలపై నిర్మిస్తోంది. అవే భయం, భావోద్వేగం, మౌనం.

భయం : చట్టబద్ధ బలప్రయోగం
భయం ఎప్పుడూ లాఠీతో, తుపాకీతోనే పుడుతుందనుకోవడం పొరపాటు. నేటి పాలక వ్యవస్థ భయాన్ని చట్టాల ద్వారా సృష్టిస్తోంది. యూఏపీఏ, దేశద్రోహ చట్టాలు, నిర్బంధ నిబంధనలు.. ఇలా అనేకం. ఇవి నేరాలను అరికట్టే సాధనాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. కానీ, వాస్తవంలో ఇవి రాజకీయ నియంత్రణా పరికరాలు. నిరసన అంటే కేసు. ప్రశ్న అంటే విచారణ. భిన్నాభిప్రాయం అంటే దేశద్రోహ ముద్ర. ఈ సంకేతం స్పష్టంగా, గట్టిగా సమాజంలోకి వెళ్లిపోతోంది.

ముఖ్యంగా విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఈ భయానికి తొలి లక్ష్యాలు. శిక్ష పడుతుందా లేదా అన్నది కాదు, అరెస్టు ప్రక్రియే శిక్షగా మారుతోంది. ఏ విచారణ లేకుండా ఏండ్ల తరబడి జైళ్లలో ఉండే పరిస్థితి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. గ్రామ్సీ చెప్పినట్టు, ఇది బలప్రయోగం భాగం. కానీ, ఇక్కడ బలప్రయోగం బహిరంగంగా కనిపించదు. చట్టం ముసుగు లో, ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్యలో జరుగుతోంది. ప్రజలను భయపెట్టడం ద్వారా లొంగదీసుకుంటుంది. ఈ భయం వ్యక్తిని మాత్రమే కాదు, సామూహిక రాజకీయ చైతన్యాన్నే అణిచేస్తుంది.

భావోద్వేగం : సమ్మతిని తయారుచేసే రాజకీయ వ్యూహం
భయం ప్రజలను నిశ్శబ్దం చేస్తే, భావోద్వేగం వారిని రెచ్చగొట్టి తప్పుదారి పట్టిస్తుంది. జాతి, మతం, దేశభక్తి, శత్రువు.. ఇవి నేటి భావోద్వేగ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. ఆకలి గురించి మాట్లాడితే ”దేశం ప్రమాదంలో ఉంది” అంటారు. ఉపాధి అడిగితే ”శత్రువులు లోపలే ఉన్నారు” అంటారు. అసమానతలు చూపిస్తే ”సాంస్కృతిక గౌరవానికి అవమానం” అంటారు. ఈ భావోద్వేగ రాజకీయంలో వాస్తవ సమస్యలు కనిపించకుండా మరుగునపడతాయి. ప్రజల ఆగ్రహం పైకి రావాల్సిన చోట, దాన్ని పక్కదారి పట్టించి ఎవరినో ద్వేషించేట్లు చేస్తారు.

ఉపాధి, ఆకలి, అసమానతలపై చర్చ జరగకూడదంటే ఎప్పుడూ ఒక శత్రువు అవసరం. ఆ శత్రువు ఒక దేశం కావొచ్చు, ఒక మతం కావొచ్చు, కులం కావొచ్చు, జాతి కావొచ్చు.. ఇలా ఒక శత్రువును బూచీగా చూపి తమ ఆధిపత్యానికి సమ్మతిని తయారు చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక రాజకీయ వ్యూహం. గ్రామ్సీ దీన్ని సాంస్కృతిక హెజిమొనీగా వివరించాడు. పాలక వర్గం తన ప్రయోజనాలనే ”ప్రజల ప్రయోజనాలు”గా, ”సామూహిక గౌరవం”గా ప్రజల మనసుల్లో నాటగలిగినప్పుడు, ప్రజలు ప్రశ్నించరు, సమ్మతిస్తారు. అప్పుడు బలప్రయోగం అవసరం లేదు, భావోద్వేగమే పాలన చేస్తుంది.

మౌనం : అధికారానికి సేవ చేసే మీడియా
మూడవది మౌనం. ఇది అధికారాన్ని ప్రశ్నించకుండా కాపాడే గోడ. ఈ గోడను నిర్మించడంలో మీడియాది కీలకపాత్ర. అది కేవలం సమాచార వాహకం కాదు, అధికారానికి సమ్మతిని సృష్టించే సాధనం. ఆధిపత్య భావజాలాన్ని సహజం, సాధారణం, అనివార్యం అన్నట్టుగా ప్రతిష్టిస్తుంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా, ఇప్పుడు అధికారానికి ప్రతినిధిగా మారింది. ప్రజలపై అణచివేత చర్యలైన లాఠీచార్జీలను ”సాధారణ ఘటనలు”గా, అరెస్టులను ”చట్టపరమైనవి”గా, హక్కుల ఉల్లంఘనలను ”జాతీయ అవసరాలు”గా వ్యాప్తిచేస్తుంది.

ఏది వార్త, ఏది చర్చకు అర్హం, ఏది మరిచిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలి.. ఇవన్నీ అదే ఎంపికచేస్తుంది. నేడు మీడియాను నడిపిస్తున్నది ఈ ఎంపికే. ఇది పౌరసమాజాన్ని మౌనంగా మార్చేస్తుంది. ఆధిపత్య భావజాలం పట్ల మీడియా మౌనం అజ్ఞానం కాదు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ఇది ప్రజలకు చూపించని విషయాలు, వినిపించని కథలు, తెలియనివ్వని బాధలు.. ఇవన్నీ పాలక వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తాయి. మౌనం ఇక్కడ ఒక రాజకీయ ఆయుధం. అది ప్రజల ఆగ్రహాన్ని దారి తప్పిస్తుంది. భయాన్ని సాధారణంగా మారుస్తుంది. భావోద్వేగ రాజకీయాన్ని ప్రశ్నించకుండా నిలబెడుతుంది.

ప్రశ్నే ప్రజాస్వామ్యానికి శ్వాస
భయం, భావోద్వేగం, మౌనం.. ఇవి విడివిడిగా కనిపించినా, ఒకే రాజకీయ నిర్మాణంలోని మూడు భాగాలు. ఇవి ప్రజలను పాలకులకు విధేయులుగా మారుస్తాయి. ఆధిపత్యాన్ని, దోపిడీని ప్రశ్నించకుండా ఉండాలంటే పౌరులు విధేయులుగా మారాలి. అందుకే విధేయతను, సమ్మతిని దేశభక్తిగా కీర్తిస్తున్నారు. ప్రశ్నను, అసమ్మతిని దేశద్రోహంగా చిత్రిస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్యానికి అసమ్మతే రక్షణ దుర్గం. అసమ్మతి వ్యక్తం చేసే అవకాశమే లేకపోతే ప్రజాస్వామ్యం ఒక జ్ఞాపకంగా, రాజ్యాంగం ఒక పుస్తకంగా, స్వేచ్ఛ ఒక ఊహగా మిగిలిపోతాయి. కానీ, ఈ పాలక వ్యవస్థ అసమ్మతిని శత్రువుగా చూస్తోంది. నిరసనను దేశద్రోహంగా, భిన్నాభిప్రాయాన్ని జాతి వ్యతిరేకతగా ముద్ర వేస్తోంది. ఇది ప్రమాదకరమైన దశ. ప్రజాస్వామ్యం లోపల నుంచే కూలిపోతున్న సంకేతం.

హెజిమొనీని ఎదుర్కోవడం ఎలా?
ఈ హెజిమొనీని కూల్చాలంటే కేవలం ఎన్నికల పోరాటం సరిపోదు. ప్రత్యామ్నాయ ఆలోచనల నిర్మాణం, ప్రజల చైతన్య పునరుద్ధానం, మౌనాన్ని ఛేదించే నిజాయితీగల వాణి అవసరం. భయానికి బదులుగా ధైర్యం, భావోద్వేగానికి బదులుగా విమర్శాత్మక ఆలోచన, మౌనానికి బదులుగా ప్రశ్న.. ఇవే ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టే అసలు స్తంభాలు. దీనినే గ్రామ్సీ కౌంటర్‌ హెజిమొనీగా ప్రకటించాడు. కౌంటర్‌ హెజిమొనీ అంటే పాలకవర్గాల భావజాలానికి ఎదురు నిలిచే ప్రత్యామ్నాయ రాజకీయ సాంస్కృతిక చైతన్యం. ప్రజాస్వామ్యానికి ఇప్పుడు కావలసింది విధేయ పౌరుడు కాదు, బాధ్యతాయుతమైన ప్రశ్నించే పౌరుడు. ఆ పౌరుడికి.. చట్టం న్యాయానికి వ్యతిరేకంగా నిలబడితే, చట్టాన్ని కాదు, న్యాయాన్ని ఎంచుకునే ధైర్యం కావాలి. ప్రభుత్వమే దేశంగా మారినప్పుడు, దేశాన్ని ప్రభుత్వంతో వేరు చేసి చూడగల రాజకీయ చైతన్యం కావాలి.

సమాజం మౌనంగా ఉన్నప్పుడు, ప్రజల గొంతుకై నినదించే గొంతుక కావాలి. కౌంటర్‌-హెజిమొనీ అంటే అది ఆలోచనల పోరాటం. ప్రజల ఇంగితాన్ని తిరిగి ప్రజాస్వామ్య దిశగా మలిచే దీర్ఘకాలిక రాజకీయ ప్రక్రియ. ప్రజాస్వామ్యాన్ని చంపడానికి ఎప్పుడూ నియంతలే అవసరం లేదు. విధేయ పౌరులు చాలు. భయంతో మౌనంగా మారిన పౌరుడు, భావోద్వేగాలతో మత్తులో మునిగిన పౌరుడు, మీడియా చెప్పిందే నిజమని నమ్మిన పౌరుడు… ఈ ముగ్గురి కలయికే ప్రజాస్వామ్యాన్ని మింగే నియంతృత్వానికి ఆహారం. అందుకే గ్రామ్సీ చెబుతాడు… ఎన్నికలు కాదు, ఆలోచనలే అసలు పోరాట క్షేత్రాలు అని. కౌంటర్‌-హెజిమొనీ అంటే కేవలం నిరసన కాదు, అది మౌనాన్ని చీల్చే ప్రశ్న, భయాన్ని ఎదుర్కొనే ధైర్యం, అబద్ధాన్ని తిరస్కరించే చైతన్యం. ఇప్పడు దేశానికి కావలసింది ”ఆదర్శ పౌరుడు” కాదు, ఆలోచించే పౌరుడు. ప్రశ్నే కవాతు తొక్కాలిప్పుడు.

రమేష్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -