Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉమ్మడి కరీంనగర్‌ కాంగ్రెస్‌దే

ఉమ్మడి కరీంనగర్‌ కాంగ్రెస్‌దే

- Advertisement -

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుపు
మక్కాన్‌ సింగ్‌ సారథ్యంలో రామగుండం మేయర్‌ కైవసం
సిరిసిల్లలో పట్టునిలుపుకున్న బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌
మూడు చోట్ల హంగ్‌..

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. మెజార్టీ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తన పట్టును కోల్పోయింది. మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ‘క్లీన్‌ స్వీప్‌’ చేయగా.. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మాత్రం బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. వేములవాడ, జమ్మికుంట, రాయికల్‌ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ‘హంగ్‌’ ఏర్పడి, క్యాంపు రాజకీయాలకు తెరలేచింది.

మంత్రుల ఇలాకాలో తిరుగులేని ఆధిపత్యం
కీలక మంత్రులు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నాయకత్వంలో తన నియోజకవర్గంలోని ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 15 వార్డులకు గాను అన్ని స్థానాలను (క్లీన్‌ స్వీప్‌) గెలుచుకుంది. కొప్పుల ఈశ్వర్‌ సొంత గడ్డపై బీఆర్‌ఎస్‌ నామరూపా ల్లేకుండా పోయింది. మంథని నుంచి రాష్ట్ర ఐటీశాఖ మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని మున్సిపాలిటీలో తన పట్టును నిరూపించుకున్నారు. ఇక్కడ 13 వార్డులలో కాంగ్రెస్‌ 11 స్థానాలను కైవసం చేసుకుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ సారథ్యంలో తన కార్పొరేషన్‌ పరిధిలో కాంగ్రెస్‌ 60 డివిజన్లలో 38 చోట్ల విజయం సాధించి మేయర్‌ పీఠాన్ని ఖాయం చేసుకుంది.

కరీంనగర్‌లో కమలం.. సిరిసిల్లలో గులాబీ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీ 1018 ఓట్లతో భారీ ఆధిక్యాన్ని కనబరిచింది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ 12, బీఆర్‌ఎస్‌ 8, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలిచారు. బీఆర్‌ఎస్‌ కంచుకోటగా భావించే కరీంనగర్‌లో ఆ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం.

జగిత్యాలలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌!
జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వర్గపోరు చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే సంజరు కుమార్‌ మద్దతుదారులు 21 మంది గెలవగా, సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి బలపరిచిన స్వతంత్రులు 17 మంది విజయం సాధించారు. ఫలితంగా మున్సిపల్‌ పీఠం కాంగ్రెస్‌ దే అయినప్పటికీ, చైర్మెన్‌ ఎంపిక అధిష్టానానికి సవాల్‌గా మారనుంది.

హంగ్‌ మున్సిపాలిటీల్లో ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ కోసం ఉత్కంఠ!
మూడు మున్సిపాలిటీల్లో ఫలితాలు అనిశ్చితిని సృష్టించాయి. ఇక్కడ స్వతంత్రులు కింగ్‌ మేకర్లుగా మారారు. వేములవాడలో మొత్తం 28 వార్డులలో కాంగ్రెస్‌ 13 సాధించగా, మ్యాజిక్‌ ఫిగర్‌ (15)కు రెండు సీట్ల దూరంలో నిలిచింది. ఇక్కడ బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 5 స్థానాలు పొందాయి. జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 10, బీజేపీ 4 స్థానాలు సాధించాయి. ఫలితంగా ఏ పార్టీకి అధికారం దక్కలేదు. రాయికల్‌ మున్సిపాలిటీలో బీజేపీ 5 స్థానాలతో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తలో 3 స్థానాలకు పరిమితమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -