భారతీయ సినిమా చరిత్రలో అత్యంత సుప్రసిద్ధ నృత్య తారలలో బహుశా కూకూనే మొదటగా పేర్కొనాలి. ఆమెకు ముందు చాలా మంది నృత్యకారిణులు ఉన్నారు, వారిలో అజూరీ అనే నృత్యకారిణి కూడా ఉంది, ఆమెను కూకూ ఆదర్శంగా తీసుకుందని చెబుతారు. కానీ చేసిన సినిమాల సంఖ్యాపరంగా, వాటి ప్రభావం పరంగా చూస్తే హిందీ సినిమా నృత్య తారలలో కూకూనే మొదటిది అని చెప్పాలి. 1950ల, 60ల మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో ‘క్యాబరే’ ఒక అనివార్యం కావడానికి ఆమెనే కారణం. అది 1944. అప్పటికే టాకీ సినిమాలు వచ్చి 15 ఏండ్లు గడిచినవి.
దేవికా రాణి, శోభనా సమర్థ్ వంటి నాయికలు తమ ఉనికిని చాటుకున్నారు. కానీ ఆ రోజుల్లో అగ్ర కులాలవారు, ధనవంతులైన కుటుంబాల ఆడవారు హీరోయిన్లుగా నటించేవారు కాదు. ఇక నడుమును వయ్యారంగా కదిలించి, శరీరాన్ని ప్రదర్శించాల్సిన పాత్రల గురించి చెప్పనవసరం లేదు. ఎంత హుందాగా ఉన్నప్పటికీ ఆ రోజుల్లో శరీరాన్ని ప్రదర్శించడం అంటే భుజాలు, బహుశా కొద్దిగా కాళ్ళు చూపించడం మాత్రమే. అలాంటి సమయంలో అందమైన ముఖంతో, మంత్రముగ్ధులను చేసేలా నాట్యం చేసే కళ్ళతో ఒక ఆంగ్లో-ఇండియన్ అమ్మాయి ఏకకాలంలో రెండు సినిమాలలో కనిపించింది. అవి ‘పెహ్లీ నజర్’, ‘ముజ్రిమ్’.
కుక్కూను హిందీ సినిమాలో ”రబ్బర్ గర్ల్” అని పిలిచేవారు. ఆమె అద్భుతమైన శృంగార నృత్యం బాలీవుడ్ చిత్రాలలో క్యాబరే డాన్సింగ్‌ని తప్పనిసరి చేసింది. ఆమె శిష్యురాలు హెలెన్ శృంగార తారగా స్థిరపడేందుకు చాలా కాలం ముందే కుక్కూ ఆ రంగంలో ఏకచత్రాధిపత్యం సాగించింది. కుక్కూ 1928 ఫిబ్రవరి 04న బొంబాయిలోని ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించింది. భారతీయ సినిమా రంగానికి కుక్కూ క్యాబరే నత్యాన్ని పరిచయం చేసింది. క్యాబరే అనేది నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లలో జరిగే వినోదం. కక్కూ లయబద్ధమైన, శృంగార భరిత నృత్య ప్రదర్శనలతో చాలా కాలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పాట లేకపోయినా కేవలం మ్యూజిక్ తోనే మూడు నిమిషాల కుక్కూ డాన్స్ సినిమాల్లో తప్పనిసరిగా ఉండవలసిన పరిస్థితి బాలీవుడ్‌లో ఉండేది.
1946లో నానూబాయ్ వకీల్ కుక్కూ డాన్స్‌లోని గ్రేస్‌ను గుర్తించి తన ‘అరబ్ కా సితారా’లో మొదటిసారి అవకాశం ఇచ్చాడు. తొలి చిత్రంలోనే ఆమె నర్తనం ప్రేక్షకులను కట్టిపడేసింది. దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులు ఆమె నృత్య ప్రావీణ్యాన్ని మొదటిసారి చూడటంతోనే ఆమె సినిమా సక్సెస్‌లకు కారణం అవుతుందని, ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపిస్తుందని అంచనా వేశారు. ఆ వెంటనే అనోఖీ అదా, అందాజ్, షాయిర్, బర్సాత్ వంటి పెద్ద చిత్రాలలో అవకాశాలు వరుస కట్టినవి. 10 గ్రాముల బంగారం వంద రూపాయల లోపునే ఉన్న ఆ రోజుల్లో తెరపై నాలుగు నిమిషాలు కనిపించే పాటకు 6000 డిమాండ్ చేసే డాన్సింగ్ స్టార్‌గా ఆమె ఎదిగింది. ఇప్పటి కరెన్సీతో లెక్కిస్తే ఐదు కోట్లతో సమానం. తదుపరి ఐదేళ్లలోనే ఆమె మెహబూబ్ ఖాన్ ‘అనోఖీ అదా’ (1948), హెచ్. ఎస్. రావైల్ ‘పతంగా’ (1949), దేవేంద్ర గోయెల్ ‘ఆంఖే’ (1950)తో సహా సుమారు 50 చిత్రాలలో నటించింది.
ఆ కాలంలో కుక్కూను తన సినిమాలలో తీసుకోనిది నిర్మాత వి. శాంతారామ్ ఒక్కరే. ఆమె నటించిన చాలా సినిమాలలో, ఆమె పాత్ర కేవలం ఒక బార్ డాన్స్‌కి పరిమితంగా కనిపించినప్పటికీ ఆమె పాటలతోనే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించాయి. మెహబూబ్ ఖాన్ ‘అనోఖీ అదా’ చిత్రంలోని నత్యాలు ఆమెను ఆ కాలపు ప్రముఖ కేబరే డాన్సర్‌గా నిలబెట్టాయి. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, నర్గీస్ నటించిన ప్రేమకథా చిత్రం ‘అందాజ్’ లో ఆమెకు తన నటనను ప్రదర్శించే అవకాశం లభించింది. హెలెన్, వైజయంతిమాల వంటి నర్తకీ-నటీమణులు రంగప్రవేశం చేసి ఆమె స్థానాన్ని తీసుకునే వరకు కూక్కూ హిందీ చిత్రాలలో అగ్రశ్రేణి క్లబ్ డాన్సర్‌గా కొనసాగింది. ఆమె తన కెరీర్‌లో ‘ఆన్’, ‘మయూర్ పంఖ్’ రెండు రంగుల చిత్రాలలో మాత్రమే నటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1943లోనే ‘పృథ్వీ వల్లభ్’ చిత్రంలో ఆమె టీనేజ్ బాలికగా ఒక సందర్భంలో కనిపిస్తుంది. అంతేకాదు 1945లో నూర్జహాన్ నటించిన ‘జీనత్’లో ”దుల్హన్ బన్ జావో” పాటలో సహనటిగా కనిపిస్తుంది.
క్రమంగా కుక్కూ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోసాగింది. ఆమె అత్యంత ఖరీదైన జీవితం మొదలైంది. ఇంటిముందు నిర్మాతలు బారులు తీరారు. ఒక పాటకు ఆమె తీసుకునే 6000 చెల్లించలేని కొందరు నిర్మాతలు అసూయపడేవారు. కుక్కూ అందమైన భవంతులు, ఖరీదైన కార్లు, ఎంతో విలువైన నగలు సంపాదించుకున్నది. తన స్నేహితులకు ఫైవ్ స్టార్ హోటల్లో భోజనాలు చేయించేది. ‘జిద్ది’లో నటుడు ప్రాణ్‌కు బ్రేక్ పొందడానికి సహాయం చేసింది కుక్కూనే. ‘షబిస్తాన్, ‘ఆవారా’ వంటి చిత్రాలలో 13 ఏళ్ల హెలెన్‌ను కోరస్ డాన్సర్ గా కుక్కూ పరిచయం చేసింది. వీరిద్దరూ ‘చల్తీ కా నామ్ గాడి’, ‘యాహుది’, ‘హీరా మోతి’ వంటి చిత్రాలలో నత్య సన్నివేశాలలో కనిపించారు. ఆమె చివరిగా ‘సుహాగ్ రాత్’ (1968)లో నర్తించింది. తన 25 సంవత్సరాల అగ్రశ్రేణి డాన్సర్‌గా ఎదిగిన కుక్కూ ఒక స్టార్ హీరోయిన్‌కు మించిన విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమెకు మూడు కార్లు ఉండేవి. ఒకటి తనకు, రెండవది తన స్నేహితులకు, మూడవది తన కుక్కలను డ్రైవ్‌కి తీసుకెళ్లడానికి కేటాయించేది.
ఈ నేపథ్యంలో కుక్కూ నమూనా (1949), హమారీ బేటీ, అర్జూ, దిల్ రుబా, బావ్రే నయన్, ఆధీరాత్, ఆంఖే (1950), అఫ్సానా, హల్చల్, ఆవారా, సయ్యా (1951), ఆన్, అంబర్ (1952), చార్ చాంద్, ధున్, గౌహర్, హజార్ రాతే, రైల్ కా డిబ్బా, రంగీలా (1953), చోర్ బజార్, డాకు కి లడ్కీ, లఖీరే, మయూర్ పంఖ్, పెన్షనర్, ప్రిజన్ ఆఫ్ గోల్కొండ, షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్, వతన్, శీషే కి దీవార్ (1954), మిస్టర్ డ మిసెస్ 55, బారా దరి (1955), 26 జనవరి, కార్వాన్, కిస్మత్, సిపాహ్ సలార్ (1956), మేరా సలామ్, ఉస్తాద్ (1957), చల్తీ కా నామ్ గాడి, యహుది, చల్బాజ్, సామ్రాట్ చంద్రగుప్త్, అజీ బస్ శుక్రియా, ఖోటా పైసా, ఫాగూన్, సచ్చే కా బోల్ బాలా, సింద్బాద్ కాబేటా, ట్రాలీ డ్రైవర్ (1958), బస్ కండక్టర్, 40 డేస్ , హీరా మోతీ, మా కే అన్సూ (1959), బసంత్, ఢిల్లీ జంక్షన్, గాంబ్లర్, మహలోన్ కే ఖ్వాబ్, శ్రవణ్ కుమార్,మొహబ్బత్ కీ జీత్ (1960), వారెంట్ (1961), గరల్స్ హాస్టల్ (1962) ముఝే జీనే దో (1963), సుహాగ్ రాత్ (1968) వంటి వందకు పైగా సినిమాల్లో నత్యం చేసింది.
”పత్లి కమర్ హై, తీర్చి నజర్ హై (బర్సాత్)” వంటి పాటలతో బాలీవుడ్‌లో కేబరే డాన్స్‌కు ప్రాణం పోసిన నాట్యతార కుక్కూ ఓ పి పీ పియా ఓ పియా (నౌ జవాన్), ఏక్ దో తీన్ ఆజా మౌసం హై రంగీన్ (ఆవారా), గోరే గోరే (పతంగా), నీలే ఆస్మానే (మిస్టర్ డ మిసెస్ 55), లచక్ బచక్ (బావ్రే నయన్), తూ కహే అగర్ (అందాజ్), మేరీ జా మొహబ్బత్ కరో చుప్కే (సయ్యా) వంటి శృంగార గీతాలతో రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను చకచ్ఛకితం చేసింది. ఆమెకు పెళ్లి కాలేదంటారు. కానీ జరిగింది. ఒక మగ బిడ్డకి తల్లయింది. కొద్దిరోజులకే ఆ శిశువు, ఆ తర్వాత భర్త కూడా మరణించారు. దింతో ఒంటరిగానే ఉండేది. సరిగ్గా ఈ సమయంలోనే ఒక దర్శకుడు ఆమె జీవితంలోకి ప్రవేశించాడు.
ఆమె నమ్మి తన ఆస్తిని అంతా కూడా అతని కోసం ఖర్చు చేసింది. నిజానికి అతను ఆమెకు దగ్గరైంది ఆమె ఆస్తి కోసమే. ఉన్నదంతా కరిగిపోయిన తర్వాత ఒకానొక రోజు ఆదాయపు పన్ను వారు దాడి చేసి పన్ను చెల్లించలేదని ఆమె ఆస్తినంతా వేలం వేశారు. ఆమె లెక్కలు చూపలేకపోయింది. జీవితం చీకటైంది. ఆ సమయంలో ఆమె జీవితంలో ప్రేమ నాటకమాడిన దర్శకుడు, ఆమె మిత్రులు ముఖం చాటేశారు. అయినా ఆమె ఏనాడూ భయపడలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ముఖంలో చిరునవ్వును చెరగనీయలేదు. ఈ సమస్యలు ఉండగానే ఒకానొక రోజు ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. ఈ పరిస్థితిలో ఆమె చేతిలో చిల్లిగవ్వలేదు. మందులు కొనడం మాట అటుంచి పూట గడవడం కూడా కష్టమైంది.
ఒకనాడు ఖరీదైన హోటల్లో భోజనం చేసిన ఆమె ఒక్కొక్క మెతుకు కోసం అల్లాడింది. తను స్వయంగా కూరగాయల మార్కెట్‌కి వెళ్లి అక్కడ పారవేసిన కూరగాయల భాగాలను తెచ్చుకుని వండుకుని తినేది. చివరికి అనాధగా 1981 సెప్టెంబర్ 30న ఆమె కన్ను మూసింది. ఆమె పార్ధీవ దేహాన్ని స్మశానానికి తరలించడానికి చిల్లిగవ్వలేని స్థితి. చుట్టుపక్కల తెలిసిన వాళ్లంతా చందాలు వేసుకుని ఆ తంతు ముగించారు. తను నమ్మిన మనుషులు, తన ఆటపాటలతో కాసుల వర్షం కురిపించుకున్న దర్శక నిర్మాతలు కడసారి చూపుకు కూడా రాలేదు. సకల సౌకర్యాలు, మందీ మార్బలం వెరసి విలాసవంతమైన ఆమె జీవితం అంతా కూడా దగా మోసాలతో ఛిద్రమైంది. చివరగా – కుక్కూ జీవితం బాలీవుడ్‌లో వెండితెర మింగిన వెన్నెలగా ఒక నిట్టూర్పు గీతంలా ముగిసి ”నీలే ఆసుమానే” అంటూ గగన కుసుమమైపోయింది.
వ్యాసకర్త సినీ చరిత్రకారుడు
కుకూ వల్లనే నేను స్టార్ నయ్యా
”నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కుక్కూను కలిశాను. అప్పుడు నేను బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నాను. మేము ఆమె కుటుంబంతో స్నేహంగా మెలిలిగే వాళ్ళం. నేను ఆమె సోదరితో కలిసి కుకూతో స్టూడియోలకు వెళ్లేవాళ్ళం. ఏదో ఒక విధంగా నేను సినిమాల్లోకి రావాలని కుకూ కోరుకుంది. నేను అప్పుడు చాలా చిన్నదానిని.నాకు దాదాపు 12,13 సంవత్సరాలు వయసు. ఆమె నన్ను ప్రభావితం చేయలేదు కానీ నా తల్లిని ప్రభావితం చేసి ఆమె ద్వారా నన్ను సినిమా రంగంలో డాన్సర్ గా ప్రవేశపెట్టింది. నేను సినిమాల్లోకి రావాలని కలలు కనలేదు. కుక్కూ ప్రోత్సాహం వల్లనే నా సినిమా రంగ ప్రవేశం జరిగింది.” – హెలెన్
- హెచ్ రమేష్ బాబు, 7780736386



