– నేడు భారత్ × పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు
– రాత్రి 7.00గం||ల నుంచి
– పొంచివున్న వర్షం ముప్పు
కొలంబో: టి20 ప్రపంచకప్‌లో సమవుజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-ఎ ఈ రెండుజట్లు ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు టాప్ బెర్త్ ఖాయం కానుండగా… ఇప్పటికే ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మరోవైపు ఇక్కడి వాతావరణ శాఖ శనివారం ఒక ప్రకటనలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశమున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇదే జరిగితే సంజూ శాంసన్‌పై వేటు పడటం ఖాయం. గత మ్యాచ్‌లో సంజూకు అవకాశం లభించినప్పటికి సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశముండడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నమీబియాతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై వేటుపడనుంది. పాక్‌పై కుల్దీప్ యాదవ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 3 టి20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ నెదర్లాండ్స్, అమెరికా జట్లను ఓడించింది. అయితే, ఈ మ్యాచ్ నిర్వహణపై గతంలో అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఐసిసితో సుదీర్ఘ చర్చలు జరిపిన చివరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించకుంది. సూపర్-8కు అర్హత సాధించే క్రమంలో ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకం.
పాకిస్తాన్ కెప్టెన్ అఘా సల్మాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. షేక్‌హ్యాండ్ వివాదంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… భారత్‌తో కరచాలనం చేసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, కానీ ఏం జరుగుతుందో చూద్దామని బదులిచ్చారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆదివారం జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనబడుతోంది. తమజట్టు ఉత్తమమైన జట్టుతోనే తాము తలపడాలని అనుకుంటున్నట్లు సల్మాన్ తెలిపారు. బౌలర్ ఉస్మాన్ తారీఖ్ యాక్షన్ వివాదం గురించి స్పందిస్తూ… ఉస్మాన్‌కు ఐసిసి రెండుసార్లు క్లియరెన్స్ ఇచ్చిందని, ఎందుకు అంతగా అతని యాక్షన్ గురించి చర్చిస్తున్నారో అర్థంకావడం లేదని, అతనేమీ దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు. అతను మా ట్రంప్‌కార్డ్ అవుతారన్నారు. ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం.. షేక్‌హ్యాండ్ ఉంటుందా? అనే ప్రశ్నకు ‘ఇంకా 24 గంటలు సమయం ఉందిగా’ అని బదులిచ్చాడు. ఐసిసి ప్రపంచకప్‌లలో ఇండియాపై పాకిస్తాన్‌కు మంచి రికార్డు లేదు. టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఇప్పటివరకు 8సార్లు తలపడగా.. భారత్ 7సార్లు, పాకిస్తాన్ ఒకసారి మాత్రమే విజయం సాధించాయి.
పొంచివున్న వర్షం ముప్పు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు ఇక్కడి వాతావరణ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. హిందూ మహాసముద్రం, ఆగేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో 15న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని అందులో తెలిపింది. దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో కొలంబోలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని పేర్కొంది.
జట్లు(అంచనా)
భారత్: సూర్యకుమార్(కెప్టెన్), అభిషేక్ శర్మ/సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దూబే, రింకు సింగ్, బుమ్రా, ఆర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్: అఘా సల్మాన్(కెప్టెన్), ఫర్హాన్, సైమ్ ఆయుబ్, బాబర్ అజమ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, షాహిన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.



