Sunday, February 15, 2026
E-PAPER
Homeజాతీయంసర్‌ను ఆపేయండి

సర్‌ను ఆపేయండి

- Advertisement -

ప్రక్రియ అమలు తీరుపై ఆందోళన
ఓటు హక్కుకు ముప్పు
ఈసీకి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ లేఖ


న్యూఢిల్లీ : ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్‌కు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్‌ తీరు, చేపట్టిన సమయం, అనుసరిస్తున్న పద్ధతులు ఇవన్నీ కూడా ఇప్పటికే అమల్లో ఉన్న చట్టానికి, గతంలోని పద్ధతులకు, రాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్‌.. ఓటర్ల జాబితా సమగ్రతను దెబ్బ తీస్తూ, ఓటు వేసే ప్రాథమిక హక్కుకు ముప్పుగా మారిందని వివరించారు.

రాష్ట్రాలవారీ అనుభవాలు
అసోం : అసోంలో, అనుచితమైన ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు (ఈపీఐసీ), మొబైల్‌ నెంబర్లను ఉపయోగించి మూకుమ్మడిగా థర్డ్‌ పార్టీ అభ్యంతరాలను దాఖలుచేయడం ద్వారా ఫారమ్‌-7ను విస్తృతంగా దుర్వినియోగం చేసినట్టు వార్తలు వచ్చాయి. రాజకీయ నేతలు బెంగాలీ మాట్లాడే ముస్లిం ఓటర్లను వేధిస్తున్నట్టు, బీఎల్‌ఓలపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్టు మీడియా వార్తలు, ఫిర్యాదులు వచ్చాయి.
కేరళ : పొరపాటుగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన ఓటర్లు మళ్ళీ తాజాగా ఫారమ్‌ 6ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. వారి పాత ఫోటో గుర్తింపు కార్డులు చెల్లనివిగా ప్రకటించి వారి తప్పేమీ లేకపోయినా వారిని కొత్త ఓటర్లుగా పరిగణిస్తున్నారు. 2002 తర్వాత నమోదైన ఓటర్లకు నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు లేవనెత్తడానికి 2002కి ముందు నాటి ఈసీ ఓటర్ల జాబితాలోని తప్పులను ఉపయోగిస్తున్నారు.

తమిళనాడు : ప్రాథమిక జాబితా నుంచి 97లక్షలకు పైగా ఓటర్లను తొలగించారు. వీరిలో అనుచితమైన రీతిలో అధిక సంఖ్యలో ఓటర్లను మరణించిన వారుగా లేదా కనబడని వారుగా పేర్కొన్నారు. వివాహితులు, నివాసస్తులు, నిర్వాసితులు లెక్కకు మించి ప్రభావితులయ్యారు.
పశ్చిమ బెంగాల్‌ : సుప్రీంకోర్టు ముందు చేసిన వాదనలకు పూర్తి భిన్నంగా ‘తర్కబద్ధమైన అసమానతలు’ ఎత్తిచూపడానికి పరీక్షించని, పారదర్శకంగా లేని సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ను ఉపయోగించడం మూకుమ్మడిగా, ఆటోమేటెడ్‌ నోటీసుల ఉత్పత్తికి దారి తీస్తోంది. ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో దాదాపు 1.5కోట్ల మంది ఓటర్లు ప్రభావితులయ్యారు.

చట్టపరమైన ఆందోళనలు
ఓటరుగా నమోదు చేసుకోవడానికి పౌరసత్వం ఒక ముందస్తు షరతు అయినప్పటికీ దీని నిర్ణయం భారత ఎన్నికల కమిషన్‌ అధికార పరిధిలోకి రాదు. సర్‌ ముసుగులో పౌరసత్వాన్ని నిర్ణయించే ప్రక్రియను చేపట్టినట్టుగా కనిపిస్తోంది. అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిచ్చాయి. సమగ్ర సవరణ చేపట్టేటపుడు మొదటిసారి ఓటర్ల జాబితా రూపొందించడానికి వర్తించే నిబంధనలు అమలవుతాయని ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నిబంధనలు-1960లు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అటువంటి సవరణ బ్లాంక్‌ జాబితాపై చేయబడుతుంది. కానీ ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ అలాంటి బ్లాంక్‌ జాబితాతో ప్రారంభం కాలేదు. ప్రజలపై యుద్ధంగా మారుతున్న ఈ ప్రక్రియను ఈసీ ఆపేయాలని సీపీఐ(ఎం) కోరుతోందని ఆ లేఖలో ఎం.ఎ.బేబీ పేర్కొన్నారు.

అవాస్తవ కాల పరిమితి
ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా అవాస్తవికంగా కుదించబడిన కాల పరిమితిలో విస్తృతంగా, అనుచితమైన రీతిలో సవరణ ప్రక్రియ చేపట్టడంతో ఎన్నికల వాతావరణం అనివార్యంగా కలుషితమవు తోంది. పైగా పెద్ద ఎత్తున తప్పులు, మినహాయింపులకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అనేకమంది బీఎల్‌ఓలు ఒత్తిడిని భరించలేక తమ ప్రాణాలనే బలవంతంగా తీసుకోవడానికి దారి తీసింది.

సంప్రదింపుల కొరత
ఈ ప్రక్రియను ప్రారంభించ డానికి ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోలేదు. ఈ పార్టీలు మనదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో సమానమైన వాటా లేదా ప్రాధాన్యత కలిగినవి.

ఓటర్లపై భారం
అనర్హత కలిగిన ఓటర్లను గుర్తించి, తొలగించే బాధ్యత ప్రధానంగా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ), ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓ)పై వుంటుంది. కానీ, ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారి పై మళ్ళీ తమ అర్హతలను ధృవీకరిం చుకునే బాధ్యత లేదా భారాన్ని మోపారు.

అమలు అనుభవం
గతంలో బీహార్‌లో, ప్రస్తుతం అమలవుతున్న ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి అనేక అంశాలు తలెత్తాయి. ఎన్యూమరేషన్‌ ఫారాలు అందకపోవడం, ప్రత్యామ్నాయ పద్దతులు గురించి తెలియకపోవడం, అసహేతుకమైన పత్రాలు కావలసి రావడంతో పాటూ పాటూ డిజిటల్‌ పద్దతులకు అసలు అవకాశం లేకపోవడం లేదా పరిమిత అవకాశాలు ఉండడమనేది బహిష్కరణకు దారి తీసింది. వెనుకబడినవారు, మైనారిటీలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ప్రధానంగా ప్రభావితులయ్యారు. ఫారమ్‌ 7ను కొంతమంది వ్యక్తులు విస్తృతంగా దుర్వినియోగం చేశారు. ఎస్‌ఐఆర్‌ రూపకల్పన, అమలు ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను పోలి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -