ఇప్పటికే కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్‌సిగల్
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు చార్జిషీట్‌కు రెడీ అవుతున్న ఏసీబీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) విభాగం రాష్ట్ర ఏసీబీకి అనుమతినిస్తూ సమాచారాన్ని పంపింది. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణకు సంబంధించి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లను బదిలీ చేశారంటూ ఏసీబీలో కేసు నమోదైన విషయం విదితమే. ఆ సమయంలో హెచ్‌ఎండీఏ ప్రత్యేక అధికారిగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తమ సంస్థ ఖాతా నుంచి ఈ డబ్బును విదేశీ కంపెనీకి పంపించడానికి అనుమతించారనే ఆరోపణ ఉంది. అయితే ఆ సమయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అనుమతి ఇవ్వడం వల్లే తాను ఆ డబ్బును ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించిన విదేశీ కంపెనీకి పంపించడానికి ఆమోదం తెలిపినట్టు అరవింద్ కుమార్ ప్రభుత్వ కార్యదర్శికి పంపిన లేఖతో పాటు ఏసీబీ జరిపిన విచారణలోనూ తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్, రెండో నిందితుడిగా అరవింద్ కుమార్, మూడో నిందితుడిగా హెచ్‌ఎండీఏ సీఈఓ బీఎల్‌ఎన్ రెడ్డి, నాలుగో నిందితుడిగా విదేశీ కంపెనీని చేరుస్తూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. అనంతరం ఈ కేసులో పైముగ్గురు నిందితులను ఏసీబీ క్షుణ్ణంగా విచారించింది. ఇక కోర్టులో చార్జిషీటు వేయడానికి ఇప్పటికే ప్రజా ప్రతినిధి అయిన కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి రాష్ట్ర గవర్నర్ అనుమతిని ఏసీబీ తీసుకుంది. ఇక కేంద్రంలోని డీఓపీటీ అధీనంలో ఉండే సివిల్ సర్వీసు అధికారి అయిన అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని ఇవ్వాలని గత మూడు నెలల క్రితం ఏసీబీ.. ఆ విభాగానికి లేఖ రాసింది. ఎట్టకేలకు అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి డీఓపీటీ నుంచి ఏసీబీకీ అనుమతి లభించింది. దీంతో ఈ కేసులో నిందితులపై చార్జిషీటు వేయడానికి డైరెక్టర్ జనరల్ చారు సిన్హా నేతృత్వంలోని ఏసీబీ దర్యాప్తు బృందం నడుం బిగించింది. ఈ వారంలోనే కోర్టులో చార్జిషీటు వేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు ఇతర నిందితులను ఏసీబీ అరెస్ట్ చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.
ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



