సీఎంతో భేటీలో మంత్రులు, పార్టీనేతల అంగీకారం
బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికలు
మార్చి నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి
‘హంగ్’ మున్సిపాల్టీలపై సుదీర్ఘ చర్చ
బీఆర్‌ఎస్, బీజేపీని నిలువరించేలా వ్యూహాలు
సీఎంని కలిసిన వడ్డేపల్లి మున్సిపల్ ఫార్వర్డ్‌బ్లాక్ విజేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మరో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులు ఆమోదం తెలిపారు. అయితే దీనిపై అధికారికంగా మరోసారి మంత్రివర్గం భేటీ అయ్యి చర్చించి, నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. శనివారం సీఎం ఏ రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇతర పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మున్సి పల్ ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేశారం టూ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు. హంగ్ మున్పిపాల్టీల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హంగ్ మున్సిపాల్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు దక్కకుండా చూడాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఎడ్జ్‌లో ఉన్న మున్సిపాల్టీల్లో అవసరమైతే ఓ అడుగు వెనక్కి తగ్గి, మిత్రపక్షం అభ్యర్థులకు చైర్మెన్లుగా అవకాశం ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. కలిసొచ్చే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపాల్టీలను చేజార్చుకోవద్దని సీఎం స్పష్టంగా మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే జెడ్పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నికల ప్రస్తావన కూడా వారి మధ్య జరిగినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను కూడా సాధ్యమై నంత త్వరగా పూర్తిచేస్తే, ఇకపై పూర్తిగా పాలనపై దృష్టి పెట్టొచ్చని పలువురు మంత్రులు అభిప్రాయాలు వ్యక్తంచేసినట్టు సమాచారం. దీనికి సీఎం కూడా అంగీకరిం చినట్టు తెలిసింది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పన, శాసనసభ సమావేశాలు ఉన్నందున ఆ ప్రక్రియ పూర్తి అయ్యాక జెడ్పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నికలకు వెళ్దామని చెప్పారు. అయితే బడ్జెట్ సమావేశాలపై కూడా సీఎం మంత్రులతో చర్చించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను 10 నుంచి 12 రోజులు నిర్వహించి, ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నికలకు వెళ్దామని చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ ప్రక్రియ అంతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపే పూర్తిచేసుకుంటే బాగుంటుందని పలువురు మంత్రులు సూచించారు. దీనికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. మార్చి నెలాఖరు లోపు ఎన్నికల పూర్తయ్యేలా అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి, మంచి ఫలితాలు సాధించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లకు సీఎం, మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వం పదేండ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేండ్లలో చేసి చూపించిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయని విశ్లేషించారు. వచ్చే జెడ్పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ, 5,773 ఎమ్‌పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
సీఎంను కలిసిన వడ్డేపల్లి ఫార్వర్డ్‌బ్లాక్ కౌన్సిలర్లు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్‌లు శనివారం సీఎం ఏ రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ మున్సిపాల్టీలో అనూహ్యంగా ఫార్వార్డ్‌బ్లాక్ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. వడ్డేపలి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన కౌన్సిలర్లలో కుర్వ పావని (1వ వార్డు), శారద (2వ వార్డు), మంజుల (4వ వార్డు), యుగేంధర్‌రెడ్డి (5వ వార్డు), దేవమ్మ (6వ వార్డు), విజరుభాస్కర్ (7వ వార్డు), జయశ్రీ (8వ వార్డు), ఎరుకల తిమ్మప్ప (10వ వార్డు) ఉన్నారు. అయితే తాము మున్సిపాల్టీ అభివృద్ధికోసం సహకారాన్ని కోరేందుకే సీఎంను కలిశామని కౌన్సిలర్లు చెప్పారు. అంతకుముందు శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఫార్వర్డ్‌బ్లాక్ కన్వీనర్ జాజిరెడ్డితో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. దానిలో తమ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీచేసి విజయం సాధించిన వార్డు సభ్యుల్ని కాంగ్రెస్‌పార్టీ ప్రలోభపెడుతున్నదని ఆరోపించారు. అయితే ఎన్నికల్లో గెలిచిన ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థులు ఫలితాలు వెలువడిన రోజే కల్వకుంట్ల కవితతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సీఎంను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సీఎంకు ప్రశంసల వెల్లువ
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఆపార్టీ జాతీయ నాయకత్వం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని అభినందించింది. కొందరు నేతలు ఫోన్‌లో అభినందనలు తెలుపగా, మరికొందరు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సంక్షేమం, అభివృద్ధి, సుస్థిర పరిపాలన, సామాజిక సాధికారత కోసం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని కాంగ్రెస్ జాతీయ నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (ఆర్గనైజేషన్స్) కేసీ వేణుగోపాల్, లోక్‌సభలో కాంగ్రెస్ విప్, ఎంపీ మాణిక్కం టాగూర్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి విజరువసంత్, జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు సీఎంను అభినందించారు.



