– రక్తపాతంలేని రాజకీయ నరమేధం
– ఇండియన్ సిటిజన్‌షిప్‌ను చంపేస్తున్నారు
– కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేకుండానే ‘సర్’
– సెలెక్ట్‌డ్ ఓటర్లతోనే ప్రభుత్వాలు రాబోతున్నాయి
– పాలకవర్గాల పట్ల ఉదాసీనత అక్కర్లేదు…హక్కుల కోసం పోరాటమే
– ప్రేక్షకపాత్ర వహిస్తే తీవ్ర నష్టమే : ‘రాజ్యాంగం-సార్వత్రిక ఓటింగ్ హక్కు’ సదస్సులో డాక్టర్ పరకాల ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా తీసుకొచ్చిన ‘సర్’ దేశానికి పెద్ద ప్రమాదమని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పై నుంచి ఒత్తిడిమేరకే ‘సర్’ అమలవుతున్నదంటూ ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రెటరీ రాతపూర్వకంగా లేఖ రాశారని గుర్తు చేశారు. క్రమంగా ఇండియన్ సిటిజన్‌షిప్‌ను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తపాతం లేని రాజకీయ నరమేధమని తెలిపారు. పూర్వకాలంలో రాజ్యానికి సంబంధం లేని వారిని దేశం నుంచి తరిమేయడం లేదా చంపేయడం చేసేవారని గుర్తు చేశారు. ఆధునిక భారతదేశంలో ఆ మనిషి ఉనికి లేకుండా చేస్తున్నరని విమర్శించారు. ‘సర్’ లక్ష్యం మంచిదైతే పర్వాలేదనీ, కానీ అందులో దురుద్దేశం కనిపిస్తున్నదని చెప్పారు. ఓటర్ల జాబితాలో ముందుగా ముస్లింలు, ఆ తర్వాత ఎస్సీ,ఎస్టీ, నిరుపేదల ఓట్ల తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. సెలెక్టెడ్ ఓటర్లతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషించకుండా హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ క్వార్టర్స్‌లో డిఫెన్స్ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘రాజ్యాంగం- సార్వజనీన ఓటు హక్కు’ అనే అంశంపై సదస్సు జరిగింది.
దీనికి డిఫెన్స్ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ నాయకులు తిరుపతి అధ్యక్షత వహించారు. వేదిక నాయకులు డీఏఎస్‌వీ ప్రసాద్ రాజ్యాంగంలోని పీఠికను చదివి వినిపించారు. అనంతరం పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని విమర్శంచారు. అగ్నికీలల్లో మణిపూర్, ఐదేండ్లుగా ఉమర్‌ఖాలీద్ జైల్లో ఉన్నా, సోహాన్ వాంగ్‌చుగ్ అరెస్టు, పార్లమెంట్ నుంచి 140 మంది ఎంపీల బహిష్కరణ ఇలా అనేక పరిణామాలు జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. వీటితోపాటు ఓటర్ల జాబితాల్లో ఓట్లను తొలగించే ప్రక్రియను చేపట్టిందన్నారు. ఇప్పటికే 6.5కోట్ల ఓట్లను తొలగించారని గుర్తు చేశారు. చనిపోయిన, షిప్టింగ్, చొరబాటుదారులు, డూబ్లికేట్ ఓట్లను తొలగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. బీహార్‌లో 3.75 లక్షల ఓట్ల తొలగించిందనీ, అందులో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇద్దరు విదేశీయుల పేర్లను కనిపెట్టారని ఎద్దేవా చేశారు. కానీ సర్ పేరుతో భారతదేశం సిటిజన్షిప్నే తొలగిస్తున్నారని విమర్శించారు.
చనిపోయిన వారిని యోగేంద్రయాదవ్ కోర్టు ముందుకు నిలబెట్టారని తెలిపారు. ఒకే ఇంట్లో 509 మంది ఉన్నట్టు సర్ పేర్కొందనీ, కానీ ఆ ఇల్లే లేదని చెప్పారు. సర్ విషయంలో పైకి చెప్పేది ఒకటి, జరుగుతున్నది మరొకటి అన్నారు. ఓట్లను తొలగించాలంటూ రాజస్థాన్‌లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగిపై ప్రభుత్వం ఒత్తిడి చేసిందనీ, సదరు ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారని గుర్తు చేశారు. రాజ్యాంగం విశిష్ట మైందనీ, ఎవర్నైనా తనలో ఇముడ్చుకుం టుందని చెప్పారు. పాలకవర్గాల పట్ల ఉదాసీనంగా ఉండకుం డా మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్య క్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు డీజీ నరసింహరావు, కామేష్‌బాబు, కె ఉమామహేశ్వర రావు, బీడీఎల్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి సత్తయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రవణ్‌కుమార్, నాయకులు మీనా, సోమయ్య, రామచంద్రుడు, కృష్ణమోహన్, ఐద్వా నాయకులు ఇందిరా, లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.
‘సర్’ దేశానికి ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



