కారణం ఆయనకే బాగా తెలియాలి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గాంలోని బైసరన్ లోయలో సాగిన అమానుష హత్యాకాండపై పార్లమెంట్‌లో జరిగిన రెండు అఖిలపక్ష సమావేశాలకూ హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. దీనిపై భారతదేశం స్పందన ఎలా వుండాలో చర్చించేందుకు జరిగిన ఆ సమావేశాలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టు సంస్థగా నిర్ధారించిన లష్కరే తోయిబాతో ముడిపడిన టెర్రరిస్ట్‌లు సాగించిన హత్యలను వారు నిష్కర్షగా ఖండించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే సరైన ప్రతిచర్యలకు తమ మద్దతు ప్రకటిం చారు. కాల్పుల విరమణ ప్రకటన దాకా ఈ ఏకాభిప్రాయం చెక్కు చెదరకుండా వుంది. మిలిటరీ చర్య ముగిసే వరకూ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకుండా సంయమనం పాటించాయి.
ఏకపక్ష ప్రకటన
అయితే తాను, తమ ప్రభుత్వం కాల్పుల విరమణకు దోహదం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. వాణిజ్యపరమైన పర్యవసానాలు వుంటాయిని తాను హెచ్చరించాకనే భారత్-పాక్ దేశాలు ఒత్తిడికి దిగివచ్చాయని చెప్పారు. ఇది ఆశ్చర్యకరమేగాక సిమ్లా ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించేది కూడా. సంప్రదింపులతో పరిష్కారం కోసం ప్రయత్నాలు సాగిన ఫలితంగా కుదిరిన ఒప్పందం అది. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే అన్ని వివాదాలు పరిష్కరించుకోవడానికి కట్టుబడేలా చేసింది. అయినాసరే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది పూర్తిగా యథాతథంగా తీసుకునేట్టయితే దాని ప్రకారం అది అంతర్జాతీయీకరించబడింది. దీనివల్ల వ్యూహాత్మకంగానూ దౌత్యపరంగానూ తీవ్ర పర్యవసానాలు తప్పవు.భారతీయ అధికారులు, ప్రభుత్వం కూడా ద్వైపాక్షిక చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ జరిగిందని ప్రకటిస్తున్నా చెప్పుకోదగిన గందరగోళం ఏర్పడింది. ఈ ప్రకటనల విశ్వసనీయతపై నిజంగానే అనుమానాలు నెలకొన్నాయి.
అధికారిక వివరణ అవసరం
ఈ ప్రధాన సమస్యతో పాటు అధికారిక వివరణ రావాల్సిన ఇతర విషయాలు కూడా వున్నాయి. ఇవి ముఖ్య ంగా సైనిక చర్య చుట్టూ అల్లుకుని వున్నాయి. ప్రధాన మీడియా విడ్డూరమైన నిరా ధార కథనాలు ప్రచారం చేసిన ఫలితంగా ఇది మరి ంత అవసరంగా మారింది. వీటిలో కొన్ని వార్తా కథనాలు, మరీ ముఖ్యంగా మే ఎనిమిదిన రాత్రి ప్రసారమైనవి ఎంత దారు ణంగా నడిచాయంటే భారతీయ మీడియాను అంతర్జాతీయ సమాజం దోషిగా ఈసడించే పరిస్థితి. ఈ అవాస్తవ చిత్రీకరణలు అంతిమంగా దేశ ప్రయోజనాలకే చేటుగా పరిణమించాయి. అందువల్లనే కాల్పుల విరమణ తరువాత పార్లమెంటులో ప్రభుత్వ సాధికార ప్రకటన తప్పనిసరి అవసరంగా తయారైంది.ఐ.ఎం.ఎఫ్ యాజమాన్యం ఏ అభ్యంతరాలు లేకుండా పాకిస్తాన్‌కు లక్ష కోట్ల డాలర్ల రుణం మంజూరు చేసినప్పుడు స్పష్టంగా మన దౌత్యపర వైఫల్యం కనిపిస్తుంది.
ప్రత్యేక సమావేశాలకు నిరాకరణ
ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం సాధికారికంగా చేసే ప్రకటన, దానిపై సభలో క్రమబద్ధమైన చర్చను అనుమతించడం ద్వారా దేశంలో నిజమైన ఒక ఏకాభిప్రాయం రూపొందేది. అలాంటి ప్రక్రియ వల్ల పారదర్శకత వచ్చేది. రాజకీయ క్షేత్రంలో వివిధ రకాలుగా అల్లుకునిపోయిన భిన్న, బహుళ దృక్పథాలను సమ్మిళితం చేయడం సాధ్యమయ్యేది. జాతీయ ఏకాభిప్రాయం అనేది బలవంతంగా రుద్దిందో లేక కృత్రిమంగా వండిందో కాక నిజమైన రూపంలో ముందుకొచ్చేది. ఈ రూపకల్పనలో భిన్న దృక్పథాలు వ్యక్తం చేసే అవకాశ ముండటం ఒక కీలకమైన అంశం.అయినా సరే ప్రభుత్వం ప్రత్యేక సమావేశం జరపాలన్న కోర్కెకు సానుకూలంగా స్పందిం చడానికి నిరాకరించింది. కారణాలు వారికే బాగా తెలియాలి. అందుకు బదులుగా టెర్రరిజంను, దాని వెనక వున్న వారిని ఖండించడంలో రాజకీయ పార్టీలు చూపిన ఏకాభిప్రాయం విశాల జాతీయ ఏకాభిప్రాయంగా ప్రచారం చేసుకోవచ్చని భావించింది.
సైనిక చర్య సందర్భంలో భారతీయులు తమ ప్రభుత్వాన్ని తామే విమర్శించారని ఒక పాకిస్తాన్ విలేకరి అడిగితే విదేశాంగ శాఖ కార్యదర్శి సరిగ్గానే స్పందించారు. భారత దేశంలో సజీవమైన ప్రజాస్వామ్యం వుంది గనక ప్రభుత్వం ప్రజలకు జవాబుదారుగా వుంటుందన్నారు. నిజంగానే భారత రాజ్యాంగం దాని లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర లక్షణాలు దేశ విదేశీ సవాళ్ళను ఎదుర్కోవడంలో మన ప్రధాన శక్తిగా వున్నాయి.
ప్రజాస్వామిక చర్చతోనే
ఇది దేశం తనను తాను సందర్శించుకునే సమయం. సము చితమైన పారదర్శకమైన ప్రజాస్వామిక చర్చతో ఒక నిజమైన జాతీయ ఏకాభిప్రాయం రూపొందించుకోవడంలో నిమగం కావలసిన మరో సందర్భం. దాన్ని కృత్రిమంగా తయారు చేయడం కుదరదు.ఈ పూర్వ రంగంలో ప్రభుత్వం రాజకీయ ఐక్యతను దౌత్యపరమైన చొరవకు పెంచుకునే సాధనంగా చూపించుకోవడానికి ప్రయత్నాలు చేసింది. అయితే సరైన జాతీయ ఏకాభిప్రాయం పునాదిగా లేకపోతే ఈ దౌత్యపరమైన అనుకూలత స్థిరంగా నిలబడజాలదు. అయినా భారత దేశపు నికరమైన, నిలకడైన బలం దాని రాజ్యాంగ మౌలిక విలువలలో వుంది. సీమాంతర ఉగ్రవాద సవాలును ఎదుర్కొవడానికి ఈ విలువలనే ద్విగుణీకత శక్తితో ముందుకు తీసుకుపోవాలి.
అస్తిత్వ ఆధారిత పాక్షిక రాజకీయాలన్నిటినీ ఢకొీనడానికి ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగించడం తప్పనిసరి అవసరం. అలాంటి ప్రాతిపదికన సమీకరణలను రెచ్చగొడు తున్న నేపథ్యంలో అది మరింత అవసరమవుతుంది. అలాంటి ఆందోళన ఏమివున్నా టెర్రరిజం వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలోనూ భారత్, పాకిస్తాన్ మధ్య తేడా ఏంటో చూపించే ప్రయత్నం మనల్ని ఏ మాత్రం దారి తప్పించకూడదు. ఈ సంక్లిష్ట సందర్భంలో ఆ రెండింటిని మేళవించి నడపడమే మన లక్ష్యంగా వుండాలి.
(మే 21 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)