Thursday, May 29, 2025
Homeఎడిట్ పేజిఅమెరికా ప్రతికూల సుంకాలపై చర్చలకు శ్రీకారం!

అమెరికా ప్రతికూల సుంకాలపై చర్చలకు శ్రీకారం!

- Advertisement -

మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, ఒప్పందమూ లేదు, నేను చెప్పిందే వేదమంటూ ట్రంప్‌ చిందులు వేశాడు. ఐరోపా సమాఖ్య దేశాల వస్తు దిగుమతులపై జూన్‌ ఒకటవ తేదీ నుంచి యాభై శాతం ప్రతికూల సుంకాలు విధిస్తానని బెదిరించిన ఆ పెద్దమనిషి ఒక అడుగు వెనక్కు వేసి జూలై 9వ తేదీ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడిన తర్వాత గడువు పొడిగించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ చెప్పాడు. ఫోన్‌ చేసింది నిజమే అని ఆమె కూడా నిర్ధారించారు. ఏప్రిల్‌ రెండవ తేదీన అమెరికా విముక్త దినంగా ప్రకటించిన ట్రంప్‌ అన్ని దేశాల మీద పదిశాతం చొప్పున ప్రతిసుంకాలు వేస్తాననటమే గాక కొన్ని దేశాల మీద అదనంగా కూడా వేయనున్నట్లు చెప్పాడు. ఐరోపా సమాఖ్య మీద ఇరవై శాతం అన్నాడు.ట్రంప్‌ బెదిరింపుల మీద దేశాలు చర్చలకు ముందుకు రాకపోవటంతో 90రోజుల పాటు అమలు నిలిపివేస్తున్నట్లు చెప్పాడు. ఆ గడువు జూలై 9వరకు ఉంది. చైనాతో రాజీకి వచ్చి 145ను 30శాతానికి తగ్గించాడు. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో జూన్‌ ఒకటి నుంచి 50 శాతం పన్ను విధిస్తానని, చర్చలేమీ లేవంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ఒప్పందం కోసం ఎదురు చూడటం లేదు, 50శాతం పన్నుల అమలే తరువాయి, అమెరికాలో వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్నాడు. వాణిజ్య మిగులు ఉన్న ఐరోపా తమ నుంచి ఇంథనం, ఆయుధాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ట్రంప్‌ ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికా బెదిరింపుల పూర్వరంగంలో మరోసారి చైనాతో వాణిజ్య చర్చలు జరపాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించటం ట్రంప్‌కు పరోక్ష హెచ్చరికగా కనిపిస్తున్నది.అది ట్రంప్‌తో బేరమాడేందుకు కూడా కావచ్చు,చైనా మార్కెట్‌ అవకాశాల కోసమూ చూడవచ్చు.
ట్రంప్‌ దూకుడు వ్యవహారాన్ని ఐరోపా సమాఖ్య ఇప్పటి వరకు తాపీగా ప్రతిఘటిస్తున్నది. వేగంగా చర్చలు జరప నున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. దౌత్యంలో అమెరికాకు ధీటుగా ఐరోపా ధనికదేశాలు ఉన్నాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు.ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నాయి. మొత్తం మీద ఐరోపా 2024లో 236 బిలియన్‌ డాలర్ల మేర మిగులులో ఉంది. ఈ పూర్వరంగంలో తమ వస్తువులను భారీగా కొనుగోలు చేయాలని, ఉన్న ఆటంకాలు, వ్యాట్‌, అమెరికన్‌ కంపెనీల మీద వివక్ష, అపరాధ రుసుముల వంటి వాటిని నామమాత్రం లేదా తొలగించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నది. అసలు ఐరోపా సమాఖ్య ఏర్పాటే అమెరికా, జపాన్‌నుంచి తలెత్తిన పోటీని ఉమ్మడిగా తట్టుకొనేందుకు అన్నది తెలిసిందే. అందువల్లనే అది ఆచితూచి వ్యవహరిస్తున్నది. పూర్తిగా తెగతెంపులు చేసుకొనేందుకు, అలాగని లొంగిపోయేందుకు సిద్ధం కాదు. అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా 2024లో ఐరోపా యూనియన్‌ 600 బిలియన్‌ డాలర్ల మేరకు సరకులు ఎగుమతి చేసి 370 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది.
తాజా పరిణామాలను చూస్తుంటే అమెరికా బెదిరింపులకు పూనుకుందన్నది స్పష్టం. తమ అధ్యక్షుడి పన్నుల బెదిరింపు ఐరోపా సమాఖ్య కింద మంటపెట్టింది, ఇతరులతో పోలిస్తే మెల్లగా నడుస్తున్న సంప్రదింపులు దీంతో వేగం పుంజుకుంటాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ బహిరంగంగానే చెప్పాడు. జూలై తొమ్మిది వరకు గడువు ఉంది గనుక ఏం జరుగుతుందో చూడాలి. ఇరు పక్షాలకూ ఇది ప్రతిష్టాత్మకమే. ”ఈ విషయంలో మేమంతా ఒకటిగా ఉన్నాం, మీరు మాలో ఒకరిని దూరం చేస్తే మా అందరినీ చేసుకున్నట్లే, మా వాణి జ్యం, మా కార్మికులు మొత్తం ఐరోపా వాసులకోసం ఐరోపా ఐక్యంగా ఉంటుంది. మీ చర్య ప్రపంచ ఆర్థికా నికే దెబ్బ ” అని గతంలో స్పందించిన ఉర్సులా వాండెర్‌ యూరోపియన్లకు ఇప్పుడేమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశం. కొన్ని వస్తువులపై ట్రంప్‌ను దెబ్బకు దెబ్బతీయాలని ఐరోపా సమాఖ్య ఇప్పటికే తీర్మానిం చింది, అయితే ట్రంప్‌ 90రోజుల విరామం ప్రకటించటంతో ప్రతి చర్యలను ప్రకటించటం వాయిదా వేసుకుంది. శుక్రవారం నాడు 50శాతం పన్నుల ప్రకటన చేయగానే పరస్పర గౌరవంతో పరిష్కరించు కోవాలేగానీ బెదిరిం పులతో కాదు, మా ప్రయోజనాలను రక్షించు కొనేందుకు కట్టుబడి ఉన్నామని సమాఖ్య వాణిజ్య, ఆర్థిక భద్రతా కమిషనర్‌ మారోస్‌ సెఫ్‌కోవిక్‌ గట్టిగా స్పందించాడు. సంప్రదింపులకు తాము సిద్దమే అన్నాడు. ఐరోపాకు మద్దతుగా తాము నిలుస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి జాన్‌ వాడేపుల్‌ అన్నాడు. సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో అదనపు పన్నుల గురించి ట్రంప్‌ ప్రకటన వాటికి దోహదం చేయదని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుకోవటంతో పాటు దేనికైనా సిద్దమే అని ఫ్రెంచి మంత్రి సెయింట్‌ మార్టిన్‌ అన్నాడు.
గత చరిత్రను చూసినపుడు ట్రంప్‌తో ఐరోపా సమాఖ్య సంబంధాలు సజావుగా లేవు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఐరోపా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో పన్నులు విధించాడు. ఐరోపా సమాఖ్య అంత అధ్వాన్నంగా మరొకరెవరూ అమెరికా పట్ల వ్యవహరించలేదని అప్పుడు ఆరోపించాడు. అసలు అమెరికా నుంచి లబ్ది పొందేందుకే కూటమి ఏర్పడిందన్నాడు. సమాఖ్య నుంచి విడిపోయిన బ్రిటన్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మే ఎనిమిదిన కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను 5.1 నుంచి 1.8శాతానికి తగ్గిస్తుంది. దీని వలన ఐదు బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతికి వీలు కలుగుతుందని అధ్యక్ష భవనం తెలిపింది. ఇదే మాదిరి ఇతర ఐరోపా దేశాల్లోకి తన వస్తువులను కుమ్మరించాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ పట్ల బహిరంగంగా ప్రకటించనప్పటికీ సమాఖ్య గుర్రుగా ఉంది. ఆ ఒప్పందాన్ని చూపి ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పదిశాతం పన్నులైతే సరే అంతకు మించి ఉంటే ఒప్పందం కుదరకపోవచ్చని చెబుతున్నారు. ఇరవై లేదా 30శాతమైతే తాము కూడా ప్రతి చర్యలు తీసుకోకతప్పదని ఇప్పటికే కొంత మంది సంకేతాలిచ్చారు. ఒక టవల్‌ను సీటు మీద ఆ సీటు నాదే అన్నంత మాత్రాన భయపడే ప్రాంతం ఐరోపా సమాఖ్య కాదని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఏకపక్షంగా తాను చెప్పిందానికి అంగీకరించాల్సిందే అంటున్న ట్రంప్‌ ఐరోపాను లొంగదీసుకోగలడా? చైనా మాదిరి సమాఖ్య గట్టిగా వ్యవహరించగలదా! అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతున్న వత్తిడి ట్రంప్‌కు ఊపిరి సలపనీయటం లేదు. పన్నులు లేకపోతే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని గృహస్తులలో 56శాతం మంది పెద్దలు భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ సర్వే పేర్కొన్నది. కలుగుతుందని చెబుతున్న ప్రయోజనం కంటే తమపై పడే భారమే ఎక్కువ అని 52శాతం చెప్పారట.కేవలం 37శాతం మంది మాత్రమే ట్రంప్‌ పన్నుల విధానాన్ని సమర్ధించినట్లు మరొక సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా రోజు గడిచే కొద్దీ ఎవరు ఎలా బిగదీసు కుంటారో అన్న అనుమానంతో అదిరించి బెదిరించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్‌ చూస్తున్నాడు. అమెరికా ప్రకటించిన పదిశాతం పన్నులు అలాగే ఉండగా బ్రిటన్‌ పన్నులు తగ్గించటం ఏమిటని మిగతా ఐరోపా దేశాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్‌ నేడు అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉన్నందున దానితో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరి ఐరోపా సమాఖ్య కుదుర్చుకొనేందుకు సిద్దపడే అవకాశాలు లేవు. ఒకవేళ లొంగిపోతే ఆయాదేశాల్లో తలెత్తే సమస్యలు నాయకత్వానికి మరింత తలనొప్పిగా మారతాయి. అమెరికా లేదా ఐరోపా ధనికదేశాల్లో వస్తూత్పత్తి ఖర్చు ఎక్కువ అందువలన పరస్పరం పన్నులు విధించుకుంటే వాటికే నష్టం అని గత అనుభవం వెల్లడించింది. ట్రంప్‌ 50శాతం పన్ను నిర్ణయం ప్రకటించగానే రెండు చోట్లా స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. చౌకగా వస్తు వులను సరఫరా చేసే చైనా, తూర్పు ఆసియా, భారత్‌ వంటి చోట్ల నుంచి దిగుమతులు చౌకగా మారితే రెండూ నష్ట పోతాయి. ఐరోపా నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 2024లో 20.6శాతం ఉంది.ప్రతికూల పన్ను లు విధింపు, వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌ను బలహీనం చేశాయని ఐరాస పేర్కొన్నది, ప్రపంచానికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బహుముఖ సవాళ్లు విసురుతున్నాయని కూడా తెలిపింది.
త్వరలో చైనా-ఐరోపా సమాఖ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు పారిస్‌లో జరగనున్నాయి. సహకారం పెంచుకోవాలని ఉభయపక్షాలూ ఇటీవలి కాలంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల మంత్రుల సమావేశాలు జూన్‌ మొదటి వారంలో పారిస్‌లో జరగనున్నాయి. ఆ సందర్భంగా చైనాతో ఐరోపా సమాఖ్య ప్రతినిధులు భేటీ కానున్నారు. ట్రంప్‌ విధించిన గడువు జూలై తొమ్మిది వరకు ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఐరోపా యూనియన్‌కు అమెరికాతో సమస్యలున్నట్లే చైనాతో కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక సహకారానికి సంబంధించి మే 13,14వ తేదీల్లో బ్రసెల్స్‌లో ఉభయ పక్షాలు సమావేశమయ్యాయి, మరుసటి రోజు ఫ్రాన్స్‌ ప్రతినిధులు చైనాతో చర్చించారు. చైనా ప్రతినిధివర్గ నేత వాంగ్‌, ఐరోపా నేత సెఫ్‌కోవిక్‌ మధ్య ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు కీలక చర్చలు జరిగాయి. పారిస్‌లో మూడవది జరగనుంది.సెఫ్‌కోవిక్‌ మార్చి 28న చైనా సందర్శించాడు, ఏప్రిల్‌ 18న వీడియో కాన్ఫరెన్సులో విద్యుత్‌ వాహనాల ధరలు, పెట్టుబడులు, ఆటో రంగంలో సహకారం గురించి ఉభయపక్షాలు చర్చలను ప్రారంభించాలని నిర్ణయించారు. పరస్పర లాభదాయకమైన సహకారం,కృత్రిమమేధ, నూతన ఇంథన రంగాలు ఇతర అంశాలు ఉన్నాయి.ఈ పరిణామాల పట్ల అమెరికా గుర్రుగా ఉంది. చైనా వస్తువుల మీద తమ మాదిరి ఐరోపా సమాఖ్య కూడా ప్రతికూల పన్నులు విధించాలని అది డిమాండ్‌ చేస్తున్నది, అయితే ఐరోపా నుంచి ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. అమెరికా తరువాత చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తమ మీద అమెరికా పన్నులను రద్దు చేస్తే ఇద్దరం కలసి చైనా నుంచి ఇద్దరికీ ముప్పు ఉందని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధ్యక్షుడు బెర్నెడ్‌ లాంగే ప్రకటించటం గమనించాల్సిన అంశం.ఇవన్నీ చూసినపుడు నిజంగా అమెరికాకు వ్యతిరేకంగా ఐరోపా కలసి వస్తే చైనా మరింత బలపడుతుంది.
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -