పరకాల సాయిబాబా ఆలయం సమీపంలో ఘోర ప్రమాదం
నవతెలంగాణ – పరకాల
పట్టణ కేంద్రంలో మంగళవారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. పరకాల పట్టణంలోని సాయిబాబా ఆలయ సమీపంలో హనుమకొండ వైపునుండి పరకాలకు వస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఇంజపెల్లి శ్రీరామ్ (17) తన ముందు వెళ్తున్న లారీని దాటబోయాడు.
అయితే అదే సమయంలో పరకాల నుండి హనుమకొండ వైపు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించక పోవడంతో నియంత్రణ కోల్పోయి నేరుగా బస్సు కిందకు దూసుకెళ్లాడు. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనం బస్సు వెనుక చక్రాల కిందకు వెళ్లినప్పటికీ, వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడటం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగం, అజాగ్రత్తగా ఓవర్‌టేక్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.



