సోషల్ మీడియా మత్తులో పడి.. భవిష్యత్‌ను ‘కటకటాల’పాలు చేసుకోవద్దు : హైదరాబాద్ సీపీ సజ్జనార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా?’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాత్రి వేళ గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ ఆలయం వద్ద శివునికి గంజాయిని ప్రసాదంగా సమర్పించబోయారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, సదరు వ్యక్తుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సీపీ మహాశివరాత్రి రోజు ఆ రిల్ చేసిన ఇద్దరిపౖౖె మండిపడ్డారు.
‘అది వికృతమైన ఉన్మాదం, వారేదో సాహసం చేశామని అనుకుంటున్నారు.. అస్సలు కాదు. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం” అని సీపీ తన ఎక్స్ ఖాతాలో హెచ్చరించారు. ఒక్కసారి ‘ఎన్‌డీపీఎస్’ చట్టం ప్రయోగిస్తే, జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుందన్నారు. ‘లైకుల కోసం – లోకాన్నే మరిచి, వ్యూస్ కోసం – విలువలనే వదిలి’ రీల్స్ కోసం – రోడ్డున పడి, మత్తులో మునిగి – జీవితాలను నాశనం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండని హితవు పలికారు. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాను సృజనాత్మకతకు వేదికగా మార్చుకోలన్నారు.
ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్సు పోలీసులు
సీపీ పోస్టుకు చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్సు పోలీసులు తక్షణమే స్పందించారు. రీల్స్‌చేసిన ఫలక్‌నుమా జంగమ్‌మెట్‌కు చెందిన సభావత్ శ్రీచరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.



