- ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం బయటపడిన విషయం తెలిసిందే. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. నిన్న సాయంత్రం అడ్మిట్ కార్డు చూసిన విద్యార్థి, తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ ఘటనపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
“అతని దగ్గర పాస్పోర్ట్ లేదు, విదేశాలకు పంపే ఆర్థిక స్తోమత కుటుంబానికి లేదు, పైగా ఇప్పుడు సమయం కూడా లేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, పరీక్ష రాయనని మొండికేస్తున్నాడు… ఇది ఎలాంటి ఒత్తిడో మీరు ఊహించగలరా?” అని ఆయన అన్నారు. పరీక్షకు హాజరయ్యే ఏ విద్యార్థీ తమ పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయామని ఫిర్యాదు చేసే పరిస్థితి ఉండకూడదని గాంధీ నొక్కి చెప్పారు.
“ఇది అసలు ఎలా జరిగింది? వాస్తవానికి NTA దేశంలోని విద్యార్థుల,వారి తల్లిదండ్రుల సహనాన్ని పరీక్షిస్తోంది,” అని ఆయన అన్నారు. “ఒక విద్యార్థికి వారి సొంత నగరంలోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయలేక, విదేశాలకు వెళ్లేలా చేసే వ్యవస్థకు పరీక్షలు నిర్వహించే అర్హత లేదు. దేశంలోని విద్యా వ్యవస్థ.. డబ్బు-సమయాన్ని దోచుకునేలా మారిపోయిందని ఆయన ఆరోపించారు.



