న్యూఢిల్లీ : వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దేశంలోకి దిగుమతి అవుతున్న దాదాపు అన్ని వస్తువులపై ఆయన పది శాతం సుంకాలు వడ్డించారు. అరుదుగా ఉపయోగించే 122వ సెక్షన్ కింద ట్రంప్ ఈ చర్యకు పూనుకున్నారు. సుప్రీంకోర్టు తన ఆర్థిక విధానాన్ని తోసిపుచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ చట్టం…1974వ సంవత్సరపు వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 ద్వారా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై 10 శాతం తాత్కాలిక టారిఫ్‌ను విధించేందుకు ఈ సెక్షన్ దేశాధ్యక్షుడిని అనుమతిస్తోంది. కాగా ఈ పది శాతం సుంకాలను 15 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం నిర్ణయం తీసుకున్నారు.
సెక్షన్ 122 అంటే…
వాణిజ్య భాగస్వాములపై అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. గతంలో ఏ అధ్యక్షుడు ఈ చట్టాన్ని ఉపయోగించలేదు. సుంకాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రతినిధుల సభనేనని తాజాగా సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సుంకాలను ఆయుధాలుగా మలచుకొని వాణిజ్య భాగస్వాములపై పెత్తనం చెలాయించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు దీంతో బెడిసికొట్టాయి. దీంతో ట్రంప్ వాణిజ్య ఎజెండాను ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులు ఆలోచనలు చేశారు. వాటి రూపమే ఈ సెక్షన్ 122. దీని కింద… ప్రాధమికమైన అంతర్జాతీయ చెల్లింపుల సమస్యను అధిగమించడానికి దేశాధ్యక్షుడు పదిహేను శాతం వరకూ తాత్కాలికంగా సుంకాలు విధించవచ్చు. ఇవి గరిష్టంగా 150 రోజుల వరకూ అమలులో ఉంటాయి. వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232, వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ఇప్పటికే అమలులో ఉన్నాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా సెక్షన్ 232ను విధించవచ్చు. ఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్లు, ఇతర ఉత్పత్తులపై ఈ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పత్తుల సంఖ్యను పెంచాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభావం ఎంత?
ఇక ట్రంప్ విధించిన తాజా టారిఫ్ ప్రభావాన్ని పరిశీలిస్తే…ప్రస్తుతం వివిధ దేశాలపై వేర్వేరు సుంకాలు అమలులో ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇక అన్ని దేశాల ఉత్పత్తులపై ఒకే రకమైన టారిఫ్ పడుతుంది. బ్రిటన్, జపాన్, ఈయూ, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో అమెరికా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇకపై జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, భారత్‌లు 15శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. కాగా సెక్షన్ 122 కింద పది శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఈ నిబంధనను ఎన్నడూ వాడలేదు. కాబట్టి దానిని కూడా న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. పైగా 150 రోజుల గడువు తీరిన తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు ట్రంప్ ప్రభుత్వం ప్రతినిధుల సభను ఆశ్రయించాల్సి ఉంటుంది. అదీకాక సెక్షన్ 122 అనేది తాత్కాలికమే. అందువల్ల వాణిజ్య భాగస్వాములను బెదిరించడం, చర్చల కోసం బలవంతం చేయడం సాధ్యపడదు. ఏదేమైనా ట్రంప్ ఏదో ఒక రూపంలో తన టారిఫ్ విధానాన్ని తిరిగి తెర పైకి తెస్తారని విశ్లేషకుల అంచనా.
సుప్రీంకోర్టు తీర్పు కారణంగా అమెరికాకు వస్తున్న సుంకాల ఆదాయం సగానికి సగం పడిపోయే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 122, సెక్షన్ 232, సెక్షన్ 301…వీటన్నింటినీ అమలు చేయడం ద్వారా టారిఫ్ ఆదాయంలో మార్పు ఉండదని వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ ధీమా వ్యక్తం చేశారు. టారిఫ్ ఒత్తిడుల కారణంగా ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలు ఇప్పుడు వాటిని రద్దు చేసుకోవడమో లేదా పున్ణపరిశీలించడమో చేయవచ్చు. భారత్ నుంచి అమెరికాకు జరుగుతున్న ఎగుమతులలో యాభై ఐదు శాతం ఉత్పత్తులకు 18 శాతం సుంకం నుంచి విముక్తి లభించవచ్చునని ఆర్థికవేత్తలు తెలిపారు. అయితే సెక్షన్ 232 కింద విధించిన సుంకాలలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఉక్కు, అల్యూమినియంపై యాభై శాతం, కొన్ని ఆటో విడిభాగాలపై పాతిక శాతం సుంకాలు కొనసాగుతాయి. స్మార్ట్‌ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు సహా సుమారు 40 శాతం ఉత్పత్తులపై మినహాయింపు లభిస్తుంది.
తాజా సుంకాల ప్రభావం ఎంత?
- Advertisement -
- Advertisement -



