ఎన్.కె.బాబు, విజయనగరం వారి సంపాదకత్వంలో వెలువడిన ”గోరుముద్దలు” బాలల కథల సంచిక అందమైన ముఖచిత్రంతో సహజత్వం ఉట్టిపడుతూ పిల్లలను తప్పక ఆకర్షిస్తుంది అని చెప్పాలి. పెద్దలు, పిల్లలు కలిపి రాసిన 23 కథలను ఇందులో పొందుపరిచారు. విజ్ఞానదాయకమైన విషయాలను ఈ కథలు తెలియజేశాయి. పిల్లలు రాసిన కథలు పర్వాలేదు అనిపించాయి. అసలు ప్రయత్నించటమే గొప్ప విషయం. మంచి, మానవత్వం, కులమత రహిత సమాజాన్ని కోరుకోవడం, అత్యాశ, చదువు గొప్పతనం గురించి చెప్పాలనుకోవడం పిల్లల మేధస్సును తెలియజేస్తుంది.
అందుకు వారి నందరిని మెచ్చుకోవాల్సిందే. వారికి కాస్త ప్రత్యేక శిక్షణ ఇస్తే మంచిగా అభివద్ధి చెందుతారు అని కూడా అనిపించింది. వారికి నా ప్రత్యేక అభినందనలు. ఇందులో రచయితలు, రచయిత్రులు రైలు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాక్టీరియా మంచి చెడులు, నీటి వినియోగం, ప్రకతి ఋణము, ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు, చదువుతో పాటు ఈతలాంటి విద్యలు నేర్చుకోవాలని, మనం చేసిన మంచే మనల్ని కాపాడుతుందని, సోలార్ ప్లాంట్, సహాయతత్వం, మానవత్వం గురించి వివరించిన కథలు బాగున్నాయి. ముఖ్యంగా ”జున్నుగడ్డ” కథలో జున్నుపాలను ఎలా దాచి ఉంచుకోవచ్చు, కావలసినప్పుడు ఎలా వాడుకోవచ్చు అన్న విషయాన్ని కథలో తెలియపరిచిన విధానం ప్రశంసనీయం.
పిల్లలకు కథలను చేరవేయాలని దక్పథంతో ఇలా సంచికలు వేయాలి అని కథలు సేకరించి ప్రచురించటం విషయంలో తీసుకున్న చొరవకు సంపాదక వర్గాన్ని అభినందించాలి. వారి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను.
యలమర్తి అనూరాధ, 9247260206



