Sunday, February 22, 2026
E-PAPER

సమరమే!

- Advertisement -

దారికి రాకపోతే యుద్ధం తప్పదు
ఇరాన్‌కు అమెరికా హెచ్చరికలు
దేనికైనా సిద్ధమేనంటున్న ఇరాన్‌
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు

వాషింగ్టన్‌, టెహ్రాన్‌ : అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌కు అమెరికా గట్టి బెదిరింపులు పంపుతున్నది. పదిహేను రోజుల్లో దారికి రాకపోతే యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు పంపారు. ఇక యూఎస్‌ రక్షణ శాఖ కూడా అటువైపుగా చర్యలు తీసుకుంటున్నది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ, ఆయన కుమారుడు ఇద్దర్నీ చంపడమే లక్ష్యంగా దాడులకు వ్యూహాలు పన్నుతున్నది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్‌ ముందు పలు ప్రత్యామ్నాయాలను పెట్టింది. ఇక తమ అధ్యక్షుడి నిర్ణయమే తరువాయి అని అమెరికా పెంటగాన్‌ వర్గాలు చెప్తున్నాయి.

హెచ్చరికలకు బెదరని ఇరాన్‌
అయితే అమెరికా బెదిరింపులకు ఇరాన్‌ మాత్రం లొంగటం లేదు. అమెరికాకు దీటుగానే బదులిస్తోంది. యుద్ధం తప్పదనుకుంటే దానిని ఎదుర్కోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్‌ ప్రతిస్పందిస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ ఇరు దేశాలు ఇప్పటికే యుద్ధానికి దాదాపు సిద్ధమైనట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా యుద్ధ సామాగ్రిని మోహరిస్తుండగా.. యూఎస్‌ ఆయుధాలకు గట్టి జవాబిస్తామని ఖమేనీ చెప్పారు. అయితే వెనిజులా విషయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇరాన్‌ విషయంలోనూ అమలు చేయాలని అమెరికా భావిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

అమెరికా మోహరింపులు
ఒకపక్క టెహ్రాన్‌తో చర్చలు జరుపుతున్న అమెరికా.. పలు కీలక రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియాలో మోహరించింది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక నౌక ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉంది. దీన్ని దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు ట్రంప్‌ తరలించారు. ఇందులో ఎనిమిది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉంటాయి. యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక. కరీబియన్‌ సముద్రం నుంచి ఇది పశ్చిమాసియాకు బయల్దేరింది. తొమహాక్‌ క్షిపణులతో కూడిన ఐదు రక్షణ నౌకలు కూడా ఈ విమాన వాహక నౌకతో పాటు వస్తున్నాయి. ఇక గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్లు, జలాంతర్గాములను ఇప్పటికే అమెరికా మోహరించింది. అలాగే 50కి పైగా అదనపు ఎఫ్‌-35, ఎఫ్‌-22, ఎఫ్‌-16 జెట్‌లు పశ్చిమాసియాలోని వివిధ సైనిక స్థావరాల్లో అమెరికా మోహరించింది. డజన్ల సంఖ్యలో కేసీ-35, కేసీ-46 రీఫ్యూయలింగ్‌ ట్యాంకర్లనూ, బీ-2 స్టెల్త్‌ బాంబర్లు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా రంగంలోకి దింపింది.

గట్టిగా బదులిస్తున్న ఇరాన్‌
ఇరాన్‌ కూడా అమెరికాకు దీటుగా బదులిస్తున్నది. అమెరికా తమపై దాడి చేయడం అనివార్యమని అది భావిస్తోంది. అమెరికా షరతులకు అంగీకరించి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే యురేనియం శుద్ధిని ఆపేయాలి. బాలిస్టిక్‌ క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి. వీటికి అంగీకరించడం కంటే స్వల్పకాలిక యుద్ధమే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని టెహ్రాన్‌ భావిస్తోంది. అందుకు తగ్గట్టే తన రక్షణ వ్యవస్థలను ఇరాన్‌ పటిష్టం చేసుకుంటోందని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -