నవతెలంగాణ – కాటారం
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి మృతి కేవలం ప్రమాదం కాదని, అగ్రకులాల దౌర్జన్యం మరియు వ్యవస్థాపిత నిర్లక్ష్యమే కారణమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటన సామాజిక న్యాయంపై మచ్చగా నిలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై SC/ST (అత్యాచారాల నిరోధక) చట్టం కింద తక్షణమే కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని నేరస్థులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కనీసం రూ.25 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు, విధులలో నిర్లక్ష్యం వహించిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
ఈ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ ప్రకటించి, నిజానిజాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని KVPS హెచ్చరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వివక్షకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని, సామాజిక న్యాయం అమలు కావాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.



