బ్యాంకాక్ (థాయ్ లాండ్) : మహిళల ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో సారి భారత్-ఏ అమ్మాయిలు విజేతలుగా నిలిచారు. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన టైటిల్ పోరులో బంగ్లాదేశ్-ఏపై మన అమ్మాయిలు 46 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించారు. తేజల్ (51 నాటౌట్, 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో మెరువగా, రాధ యాదవ్ (36, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ వృంద (19, 17 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. బంగ్లా-ఏ బౌలర్లలో ఫహిమా (4/25) నాలుగు వికెట్లు పడగొట్టింది. బారత-ఏ బౌలర్లు ప్రేమ రావత్ (3/12), తనూజ కన్వార్ (2/11), సోనియా (2/21) విజృంభించటంతో ఛేదనలో బంగ్లాదేశ్-ఏ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సుల్తానా (20), సదియ (10), సర్మిన్ (8), ఫహిమ (14) చెప్పుకోదగిన ప్రదర్శన చేశారు. అజేయ అర్థ సెంచరీతో కదంతొక్కిన భారత బ్యాటర్ తేజల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.



