Monday, February 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలి

నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలి

- Advertisement -

నేడు కేవీపీఎస్‌ రాష్ట్రవ్యాప్త నిరసనలు : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు

నవ తెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా, అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ పెత్తందారులు శ్రీనివాస్‌ రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, సతీష్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, కన్నిరెడ్డి మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్‌కు పంపాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని కేవీపీఎస్‌ బృందం పరామర్శించింది. ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగర్‌ కర్నూల్‌ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీతో వివిధ సామాజిక, ప్రజా సంఘాలు బాధితులతో కలిసి చర్చలు జరిపారు. పోలీసుల నిర్లక్ష్యపాత్రను ఖండిస్తూ డీఎస్పీ కార్యా లయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి బైటాయించి నిరసన తెలిపారు. ఘటన జరిగి నాలుగు రోజులు కావ స్తున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు స్వీకరించ లేదని పోలీసులను ప్రశ్నించారు. పెత్తందారులు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. పండుగలు, ఉత్సవాల్లో కుల దురహంకారంతో ప్రజల మధ్య కులవిద్వేషాలు సృష్టించడం, దేవుడి దగ్గర అందరూ సమానం కాదని అహంకారం ప్రదర్శించడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. దేవుని దగ్గరికి వెళ్లడానికి 100 రూపాయలు ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన పాపానికి, చెల్లిస్తాం కానీ రసీదు ఇవ్వండని అడిగినందుకు సుమారు మూడున్నర గంటలపాటు గణేష్‌ అనే యువకుడిని చితకబాదడం దారుణమన్నారు. తన తమ్ముడిని కొట్టొద్దని గణేష్‌ అక్క కీర్తి, ఆయన భార్య మౌనిక ఎంతగా బతిమిలాడినా, కాళ్లు మొక్కడానికి ప్రయత్నించినా కనికరించలేదని తెలిపారు. చివరకు రెండు నెలల చిన్నారిని వారి కాండ్ల వద్ద ఉంచి పాపను చూసి కనికరించమని వేడుకున్నా ఏ మాత్రం జాలిచూపకపోగా.. చిన్నారిని కాలితో తన్ని కాలితోనే విసిరేయడం వారి కులదురహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందన్నారు.

సంఘటన ఈ నెల 18న జరిగితే ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు.. బాధితులే పెత్తందారుల పైన దాడి చేసినట్టుగా కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. బాధితులను వెంటబడి వెంబడించి, దాడి చేసి, చెప్పరాని బూతులు తిట్టి కాలుతో తన్ని పసిబిడ్డను హత్య చేసిన హంతకులను పోలీసులు కాపాడుతున్నా రని ఆరోపించారు. డీఎస్పీ శ్రీనివాస్‌.. హంతకు లపై కేసు నమోదు చేయాల్సి ఉండగా బాధితులపై కేసు పెట్టారని చెప్పారు. 8 మందిపై ఫిర్యాదు చేస్తే నలుగురిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా వాళ్లను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయ న్నారు. తక్షణమే హత్యా నేరం కింద 103 సెక్షన్‌ కింద కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా నేడు (ఫిబ్రవరి 23న) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు మాట్లాడుతూ.. కుమ్మెర గ్రామంలో అట్టడుగు పేదలపై అగ్రకుల దురహంకారంతో దౌర్జన్యం హత్య చేసిన ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఆందోళన సందర్భంగా 24 గంటల్లో 8 మందిని అరెస్టు చేస్తామని, హత్యా నేరం కింద కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్య నాయక్‌, కమిటీ సభ్యులు ఏపీ మల్లయ్య, కేవీపీిఎస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంతటి కాశన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు పులిజాల పరశురాములు, ఎన్‌. బాలపీరు, జిల్లా నాయకులు గుంపెల్లి అశోక్‌, బత్తిని రాజు, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జూపల్లి జంగయ్య, సలేశ్వరం గోపాల్‌, కృష్ణయ్య, బీసీడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోజరాజు శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు పి.నరసింహ, బి.బాలస్వామి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పి రామయ్య, శివవర్మ, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షకార్యదర్శులు దశరథం, అశోక్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మధు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారా సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పలువురు పరామర్శ
కుమ్మెర జాతరలో పసిబిడ్డ మరణానికి దారి తీసిన ఘటన పై పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. ప్రధానంగా బీసీ సంఘం నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి.. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. బీఎస్పీ నాయకులు, ప్రజా సంఘాలు బాధ్యత కుటుంబాలకు అండగా నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -