నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్నవారితో సమానంగా ప్రతిపక్ష నాయకునికి సమాన హోదా ఉంటుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. అయితే న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకున్ని ఆహ్వానించలేదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వైఖరిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఇందిరాగాంధీ ఆలోచనలను అమలు చేసిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించారనీ, దాని కొనసాగింపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన చేసిందని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అభినందించారు.
హరీశ్ రావు చిల్లర రాజకీయాలు మానుకో : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను హరీశ్ రావు తప్పుదోవ పట్టించారని తెలిపారు. అపార్ట్ మెంట్ వాసుల కష్టాలకు గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 2012 జీవో ప్రకారం 30 మీటర్ల బఫర్ ఉండాలని గుర్తుచేశారు.
9 మీటర్లు బఫర్ చూయించి బిల్డర్లు అనుమతి తీసుకున్నారని తెలిపారు. వారిపై కేసులు పెడతామనీ, అపార్ట్మెంట్ వాసులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చామల హామీ ఇచ్చారు. నాలాలపై నిర్మాణాలను అనుమతినిచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన విమర్శించారు. నాటి అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
న్యాయం చేస్తాం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ప్రభుత్వంతో చర్చించి గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల కుట్రలో బలి కావద్దని బాధితులకు విజ్ఞప్తి చేశారు. మూసీ పేరుతో కోట్లు మేసిన బీఆర్ఎస్ వల్లే అపార్ట్ మెంట్ వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం పోలీసులను పెట్టి బలవంతంగా గ్రామాల నుంచి నిర్వాసితులను పంపించిన దాంట్లో పాపం హరీశ్ రావుదేనని తెలిపారు.
బీజేపీకి ప్రజల తిరస్కారం తప్పదు:వీహెచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



