పసికందును నేలకేసి కొట్టి హత్య చేసిన అగ్రకులస్తుడు : డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై దాడి చేసి, రెండేండ్ల పసికందును కాళ్ళతో తన్ని, నేలకేసి కొట్టి హత్య చేసిన అగ్రకుల పెత్తందారులను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటా రమేశ్, ఆనగంటి వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలనీ, పెత్తం దార్లపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతరలో దైవదర్శనానికి వెళుతుండగా టికెట్ లేదన్న కారణంతో బాలికతో పాటు వారిని పైకి వెళ్లకుండా నిరాకరించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ, అవమానపరచడం తగదని పేర్కొన్నారు.
రూ. వంద చెల్లిస్తేనే అనుమతిస్తామంటూ పెత్తందారులు బెదిరించారని తెలిపారు. రసీదు ఇవ్వకుండా రూ. వంద ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన కుటుంబాన్ని సహించలేని అగ్రకుల పెత్తందారులు కుల దురహంకారంతో తక్కువ కులం వాళ్లు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ కుటుంబంపై దాడి చేసి రెండేళ్ల పసి పాపను బలి తీసుకున్న పెత్తం దారులందరిపై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, కుటుంబ సభ్యులు కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించకుండా, రెండేండ్ల పసికందును కాళ్ల ముందు పెట్టి ప్రాధేయపడ్డ ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించి చిన్నారి హత్యకు కారణమయ్యారని తెలిపారు.
తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన బాధిత కుటుంబం పైనే పోలీసులు కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు, పోలీస్‌ల సమక్షంలో రజక కుటుంబంపై భౌతిక దాడి చేయడం, గణేష్ అనే వ్యక్తిని గదిలో బంధించి చిత్రహింసలు చేసి, తీవ్రంగా హింసించడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుల దురహంకార దాడులు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, కింది కులాల వారికి రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కింది కులాల వారిపై నిత్యం దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, లైంగిక దాడులు, కుల వివక్ష పాటించడం, పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బాధిత రజక కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిం చాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.



