Monday, February 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమెక్సికో డ్రగ్ కింగ్‌పిన్ 'ఎల్ మెంచో' ఖతం..దేశవ్యాప్తంగా హింసాకాండ

మెక్సికో డ్రగ్ కింగ్‌పిన్ ‘ఎల్ మెంచో’ ఖతం..దేశవ్యాప్తంగా హింసాకాండ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కింగ్‌పిన్‌లలో ఒకడైన ‘ఎల్ మెంచో’ (నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్) హతమయ్యాడు. మెక్సికో సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త తెలియగానే అతడి అనుచరులు దేశవ్యాప్తంగా హింసాకాండకు దిగడంతో పలు నగరాలు అల్లకల్లోలంగా మారాయి.

ఎల్ మెంచో నాయకత్వం వహిస్తున్న జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సభ్యులు జాలిస్కో, గ్వాడలజారా వంటి ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. హైవేలపై వాహనాలకు నిప్పుపెడుతూ, రోడ్లను దిగ్బంధిస్తూ భయాందోళనలు కలిగిస్తున్నారు. దీంతో అధికారులు ‘కోడ్ రెడ్’ ప్రకటించి, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అమెరికాలోకి టన్నుల కొద్దీ ఫెంటానిల్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఎల్ మెంచో అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారాడు. అందుకే, అతడి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 కోట్లు) భారీ రివార్డును ప్రకటించింది.

మెక్సికోలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అమెరికా, కెనడా తమ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించాయి. ఎయిర్ కెనడా వంటి సంస్థలు ప్యూర్టో వల్లార్టాకు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఎల్ మెంచో మరణంతో డ్రగ్ వార్ మరింత తీవ్రం కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మెక్సికో ప్రభుత్వం హింస ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -