Tuesday, February 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమెడికల్‌ 'స్టైఫండ్‌' దగా!

మెడికల్‌ ‘స్టైఫండ్‌’ దగా!

- Advertisement -

తెలంగాణలోని ప్రయివేటు మెడికల్‌ కళాశాలలు నేడు విద్యా సంస్థలుగా కాకుండా, విద్యార్థుల శ్రమను పిండుకునే కార్పొరేట్‌ కంపెనీలుగా మారిపోయాయి. ముఖ్యంగా హౌస్‌సర్జన్లు (ఎంబిబిఎస్‌ ఇంటర్న్స్‌), పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైఫండ్‌ విషయంలో యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు అత్యంత క్రూరంగా ఉంది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసి) నిబంధనల ప్రకారం, ప్రతి నెలా నిర్ణీత తేదీలోపు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్‌ జమకావాలి. కానీ, రాష్ట్రంలోని మెజారిటీ ప్రయివేటు కళాశాలల్లో ఆరు నెలల నుంచి ఏడాది వరకు బకాయిలు ఉంటున్నాయి. అసలు స్టైఫండ్‌ అనేది విద్యార్థులకు ఇచ్చే దానం కాదు, అది వారు ఆస్పత్రిలో చేసే అలుపెరగని సేవకు దక్కాల్సిన కనీస వేతనం. వీరు ఆస్పత్రిలో 24 గంటల ఆన్‌-కాల్‌ డ్యూటీలు, ఎమర్జెన్సీ వార్డుల్లో తీవ్రఒత్తిడి, ప్రసవాలు, ఆపరేషన్లలో సహాయం, ఇలా అన్నింట్లోనూ వీరే కీలకంగా ఉంటున్నారు. ఇంత శ్రమ చేస్తున్న వారిని శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. వారికి జీతాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆర్థిక కష్టాల సాకులు చెబుతున్నాయి.

ఈ స్టైఫండ్‌ దగా వెనుక అనేక దందాలు నడుస్తున్నాయి. అనేక కళాశాలలు ఎన్‌.ఎం.సి తనిఖీల సమయంలో మాత్రం రికార్డుల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో స్టైఫండ్‌ ఇస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థులతో బలవంతంగా ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకోవడం లేదా వారి ఏటీఎం కార్డులను యాజమాన్యాలే దగ్గర పెట్టుకోవడం వంటి విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ సెక్షన్‌ 13 కింద స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, కళాశాలలు విద్యార్థుల ఏటీఎం కార్డులను తమ వద్దే ఉంచుకోవడం లేదా బలవంతంగా సంతకాలు తీసుకోవడం వంటి క్రిమినల్‌ చర్యలకు పాల్పడుతున్నాయి. బ్యాంకు ఖాతాలోకి నగదు జమయిన వెంటనే, విద్యార్థులను వెంటబెట్టుకుని వెళ్లి బ్యాంకులో నగదు విత్‌డ్రా చేయించి, తిరిగి కళాశాల కౌంటర్‌లో కట్టించుకుంటున్నాయి. దీన్ని ప్రశ్నించిన విద్యార్థులపై ‘అకడమిక్‌ టెర్రరిజం’ ప్రయోగిస్తున్నాయి.

ఇంటర్నల్‌ మార్కులు తగ్గించడం, అటెండెన్స్‌ లేదని పరీక్షలకు కూర్చోనివ్వకపోవడం, చివరికి సర్టిఫికెట్లు ఆపేస్తామని బెదిరించడం వంటి చర్యల ద్వారా విద్యార్థుల గొంతు నొక్కుతున్నాయి. కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన నిరసన సమయంలో, గత 18 నెలలుగా స్టైఫండ్‌ ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. ఒక విద్యార్థికి నెలకు రూ.60 వేల చొప్పున లెక్కిస్తే, 18 నెలలకుగానూ ఒక్కో విద్యార్థికి రావాల్సిన రూ.10.8 లక్షల సొమ్మును కాలేజీ యాజమాన్యం అక్రమంగా వాడుకుంది. మరోవైపు, ప్రభుత్వం ప్రయివేటు కాలేజీల్లో ఫీజులను భారీగా పెంచడానికి అనుమతులు ఇస్తోంది. అదే స్థాయిలో విద్యార్థుల హక్కులను కాపాడటంలో విఫలమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం 2025 జూన్‌ 28న జిఓ 90ద్వారా వైద్యవిద్యార్థులు స్టైఫండ్‌ 15 శాతం పెంచుతూ విడుదల చేసింది. దీని ప్రకారం హాస్‌సర్జన్లుకు రూ.29,792, పి.జి.మొదటి సంవత్సరం విద్యార్థులకు 67,032 చెల్లించాలి. కానీ, ఉత్తర్వులు అమలు చేయడం లేదు. పైగా ఇచ్చే స్టైఫండ్‌లో పూర్తిగా ఇవ్వడం లేదు. ఈ మెడికల్‌ కళాశాలలపై ఎన్నో ఫిర్యాదులొచ్చినా, వైద్యారోగ్య శాఖ, కాళోజీ హెల్త్‌ యూనివర్శిటీ గానీ కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయం కూడా కేవలం నోటీసులతోనే సరిపెడుతోంది తప్ప, గుర్తింపు రద్దు వంటి గట్టి హెచ్చరికలు చేయడం లేదు.

తెలంగాణలో ప్రస్తుతం 27కు పైగా ప్రయివేటు మెడికల్‌ కళాశాలలు ఉండగా, అందులో దాదాపు 15 కళాశాలలపై స్టైఫండ్‌ ఎగవేత ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ 2024-25 నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 70శాతం ప్రయివేటు కాలేజీలు విద్యార్థులకు పూర్తిస్థాయి స్టైఫండ్‌ చెల్లించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్‌ సర్జన్లకు నెలవారీ రూ.29,792 చెల్లించాల్సి ఉండగా, చాలా కాలేజీలు కేవలం రూ.5వేల నుండి పదివేల వరకు మాత్రమే ఇస్తున్నాయి. అంటే, ప్రతి విద్యార్థి నుండి యాజమాన్యాలు నెలకు సగటున రూ.20వేల నుండి 25వేల వరకు అక్రమంగా మిగుల్చుకుంటున్నాయి. ఒక కాలేజీలో 150 మంది హౌస్‌సర్జన్లు ఉన్నారనుకుంటే, కేవలం వారి నుండే యాజమాన్యం నెలకు రూ.30 లక్షల నుంచి రూ.37
ఒక విద్యార్థి తన చదువు కోసం లక్షల రూపాయలు అప్పు చేసి, కనీసం తన ఖర్చులకైనా స్టైఫండ్‌ వస్తుందని ఆశిస్తే, ఆ ఆశను ఈ యాజమాన్యాలు చిదిమేస్తున్నాయి.

ఈ దోపిడీ కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, ఇది ఒక మానసిక వేధింపు. సమాజానికి ప్రాణదాతలుగా నిలవాల్సిన వైద్యులను, తమ వృత్తి జీవితం ప్రారంభంలోనే ఇలాంటి అవినీతి కూపంలోకి నెట్టడం దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని, ప్రతి ప్రయివేటు కళాశాల స్టైఫండ్‌ చెల్లింపులను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అథారిటీని నియమించాలి. చెల్లింపుల్లో జాప్యం జరిగితే ఆయా కాలేజీలపై భారీ జరిమానాలు విధించాలి. అలాగే ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్‌ హాజరుతో పాటు, వారి బ్యాంక్‌ ఖాతాలను నేరుగా ప్రభుత్వ పోర్టల్‌కు అనుసంధానించడం ద్వారానే ఈ శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

టి.నాగరాజు
9490098292

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -