Tuesday, February 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయి!

ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయి!

- Advertisement -

పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, జెండాలు వేరైనా…ఎజెండా మాత్రం ఒక్కటే. ఎలా చేసైనా సరే. కుర్చీలో కూర్చో వాలి. పవర్‌ కోసం ఎంతకైనా తెగించాలి. పదవులను కొనుక్కోవడం లేదంటే అమ్ముకోవడం, పవర్‌ ఉంటే చాలు, అన్నీ సెట్‌ అవుతాయి అన్న భావన ఇప్పుడు రాజకీయ నాయకుల్లో, పార్టీల్లోనూ బలంగా పెరుగుతున్నది. దీనికి మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే రుజువు. డ్రెస్సులు మార్చినంత సులువుగా నాయకులు పార్టీలు మారు మారుస్తున్నారు.

ఒకపార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీతో అంట కాగుతున్నారు. ప్రస్తుత రాజకీయాలను చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గు పడుతున్నాయి. పార్టీల ఓట్ల వేటలో ఓటర్లేం తక్కువ కాదు. మా వాడలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మా కుటుంబంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మా కులపోల్లం ఇంతమందిమి ఉన్నాం.. మాకేం ఇస్తారు మీకోటేస్తే.. అంటూ బహిరంగంగానే డిమాండ్‌ చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ లెక్కలు వేసుకునే పొలిటిషన్లుగా డబ్బున్న వాళ్లు అవతారం ఎత్తుతున్నారు. బీఫాం అందుకోవడానికి పార్టీ పెద్దలకు ఎంతో కొంత ముట్టచెప్పడం, ఆ తర్వాత ఓటర్లకు మందు పోయడం, డబ్బు పంచడం, రిజల్ట్‌లో తేడా వస్తే అవతలి వాడిని కొనేయడం, ఎలక్షన్లలో ఇది కామన్‌ అయిపోయింది.

వామపక్ష పార్టీలు మినహా వ్యక్తుల నుంచి పార్టీ పెద్దల వరకు పార్టీల సిద్ధాంతాలను పక్కనపెట్టి అవసరాల రీత్యా అనే పేరుతో స్థానికంగా సర్దుబాటు చేసేసుకుంటున్నారు. అటు వాళ్ల నాయకత్వానికి ఏం ఢోకా ఉండట్లేదు.. ఇటు గెలిచినవారు వారి మర్యాదకు ఏం తక్కువ చేయట్లేదు. ఇన్నాళ్లు తెలంగాణలో ‘బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే, బీజేపీకీ బీఆర్‌ఎస్‌ బీ టీం’ అంటూ కాంగ్రెస్‌ ఊదరగొడుతూ వచ్చింది. దీనికి కౌంటర్‌గా ‘కాంగ్రెస్‌-బీజేపీ ఒకటే, చోటే బాయ్ బడే భాయ్’ ఇద్దరు ఒకటే అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు కౌంటర్‌ ఇస్తూ వస్తున్నారు కదా. సీన్‌ కట్‌ చేస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా కలిసిపోయి పదవులను దక్కించుకున్నారు. ఇక్కడ గెలుపోటములతో సంబంధం లేకుండా పోయింది. మరి ఎందుకు ఎన్నికలు నిర్వహించారన్న విషయాన్ని ఇప్పుడు ఆ పార్టీలే చెప్పాలి. ఎక్కడ ఏయే పార్టీలు కలిశాయో కొన్ని ఉదాహరణలు చూడండి.

అధికార కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్‌ పీఠాలను దక్కించుకుంది. 86 మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లను హస్తం పార్టీ చేజిక్కించుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 17 మున్సిపాలిటీలు, బీజేపీ మూడు మున్సిపాలిటీలను గెలుచుకున్నాయి. కోరం లేక వాయిదా పడిన పదకొండు మున్సిపాలిటీలలోనూ మెజార్టీ పీఠాలను అధికారపక్ష పరమయ్యాయి. 30 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్న బీజేపీ కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో చేతులెత్తేసింది. కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరస్పరం సహకరించుకున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో బీఆర్‌ఎస్‌-బిజెపి, అమనగల్‌లో బీఆర్‌ఎస్‌-అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరి చైర్మన్‌ అయ్యారు. నిజామాబాదులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయ కాంగ్రెస్‌కి సహకరించారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతుందని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్‌ చైర్మన్‌ పోస్టును ఎగరేసుకుపోయింది. ఇక అదిలాబాదులో మున్సిపల్‌ చైర్మన్‌ కాంగ్రెస్‌ గెలుచుకుంది. అక్కడ ఇద్దరూ బీజేపీకి ఇద్దరు ఎక్స్‌ ఆఫీషియో సభ్యుల బలం కలిగినప్పటికీ బీజేపీ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. అక్కడ బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ఇండిపెండెంట్‌ సహకారంతో కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ పదవిని దక్కించుకుంది. అంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అదిలాబాదులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి బండారి అనూషకు అన్ని పార్టీలు మద్దతిచ్చి చైర్‌పర్సన్‌ను చేయగా, తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరారు.

ఇక రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాలలో మూడు చోట్ల హంగు వచ్చింది. వాటిని అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా హైడ్రామా జరిగింది. కాగ్రెస్‌కు సభ్యులు తక్కువైనా.. ముగ్గురు బీఆర్‌ఎస్‌ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్‌ సభ్యులు కలిసి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. పటాన్‌ చెరువులోని ఐదు మున్సిపాలిటీలను బీజేపీ-కాంగ్రెస్‌ సహకా రంతో బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇక మెట్‌ పల్లిలో పదిమంది అభ్యర్థులు గెలిచినా.. బీజేపీకి చైర్మన్‌ పీఠం దక్కలేదు. విప్‌ జారీ చేయక పోవడంతో బీజేపీ అభ్యర్థులు కొందరు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు ఇంటిపై బీజేపీ కౌన్సిలర్లు దాడి కూడా చేశారు.

మొత్తంగా చూస్తే పవర్‌ పాలిటిక్స్‌ చేసిన వాళ్లకి పవర్‌ చేతికొచ్చిందన్న చందంగా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కనిపించాయి. ఈ పరిస్థితి మారదా? అని సామాన్యులు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. అసలు షెడ్యూల్‌ ప్రకటించిన దగ్గర నుంచి డబ్బు, మద్యం ప్రవాహం వరదలా సాగింది. పరిమితికి మించి అభ్యర్థులు ఖర్చు చేస్తున్నా… రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈసీ సీరియస్‌గా పని చేస్తుంటుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. కిడ్నాపులు, క్యాంప్‌ రాజకీయాలు జోరుగా సాగినా అటు పోలీస్‌ యంత్రాంగం కానీ, ఇటు ఎన్నికల సంఘం గానీ పట్టించు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. పోలిటీషియన్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనే చెప్పాలి.

అంతకుముందు జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరీ ఇంత దారుణంగా ఏమీలేదు. మున్సిపల్‌ ఎన్నికలే ఇలా ఉంటే, తర్వాత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌, మిగిలిన కార్పొరేషన్ల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయాల్సి ఉంది. ప్రజాస్వామిక సంప్రదాయాలు, విలువలను రాజకీయ పార్టీలు పాటించాలి. అలాగే రాజ్యాంగ సంస్థలుపై అధికార పార్టీల పెత్తనం తగ్గించుకోవాలి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఎన్నికల సంఘానికి సవాలుగా మారిన ఈ నేపథ్యంలో ఓటర్లు, ప్రజలు చైతన్యవంతులవ్వాలి. ఓటు విలువను గుర్తించి బాధ్యతగా ఓటు వేయాలి. అప్పుడే విలువలు లేని రాజకీయ పార్టీలు దారిలోకి వస్తాయి.

వంగ మహేందర్‌ రెడ్డి
9963155523

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -