‘పిట్ట కొంచెం.. కూత ఘనం..’ అనే సామెత వంశీ తివారికి సరిగ్గా సరిపోతుంది. చదువు, ఆటలతో పాటు జర్నలిజంలోనూ రాణిస్తుంది. 18 ఏండ్లకే యువ జర్నలిస్టుగా దేశ వ్యాప్తంగా ఓ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పట్టణాల నుంచి మహారాష్ట్ర గ్రామాల దాకా మైక్ చేతిలో పట్టి సూటిగా ప్రశ్నలు అడిగుతూ మీడియా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం పొందింది. ఇంత చిన్న వయసులోనే జర్నలిజంలో ఓ కొత్త దిశను చూపించిన ఈ యువ ప్రతిభావంతురాలి పరిచయం.
‘లిటిల్ జర్నలిస్టు’గా పేరుగాంచిన వంశీ.. సామాజిక అంశాలపై ప్రశ్నలు లేవదీస్తూ, యువతలో చైతన్యం కలిగించే ధోరణితో ముందుకు సాగుతోంది. తన తండ్రి, సీనియర్ జర్నలిస్టు సూర్యప్రకాశ్ తివారి నేర్పిన జర్నలిజం విలువలు, సామాజిక బాధ్యత ఆమెకు ముఖ్య ప్రేరణగా మారాయి. కేవలం 12 ఏండ్ల వయసు నుండే సామాజిక అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రూపొందించిన వీడియోనే జర్నలిజంలో ఆమె ప్రయాణానికి పునాది వేసింది.
చదువుతో పాటు జర్నలిస్టుగా…
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వంశీ ప్రస్తుతం సరూర్‌నగర్‌లో నివసిస్తుంది. తల్లి మమత గృహిణి, తండ్రి సూర్యప్రకాశ్ తివారి. ప్రస్తుతం సెయిట్ జోసఫ్ కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ మొదటి ఏడాది చదువుతుంది. తండ్రి జర్నలిస్టు కావడంతో ఇంట్లో ఎప్పుడూ అనేక అంశాలపై చర్చలు జరుగుతుండేవి. వీటిలో వంశీ ఎంతో ఆసక్తిగా పాల్గొనేది. అలా తన చిన్నతనం నుండే ఇటు చదువునూ అటూ జర్నలిజాన్ని సమతుల్యంగా కొనసాగిస్తుంది. సాధించాలనే తపన, కృషి, అంకిత భావం ఉంటే వయసుతో సంబంధం లేదనే విషయాన్ని నిరూపించింది. ఇంత చిన్న వయసులోనే విస్తృతమైన రాజకీయ అవగాహనను పెంచుకుంది. ఇప్పటి వరకు ఆమె శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్, సీనియర్ కాంగ్రెస్ నేత సి.పి.జోషి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్, సాంస్కృతిక శాఖ మంత్రి ఆషిష్ షెలార్, తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పి. ప్రభాకర్, వెంకటస్వామి, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్టులు రాజదీప్ సర్దేసాయి, రాజీవ్ రంజన్, చిత్ర నిర్మాత కె.సి.బోకాడియా, నటి మధుర వెలణ్కర్ వంటి రాజకీయ నాయకుల ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసింది.
విస్తృత చర్చలు…
ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, రాజస్థానీ వంటి భాషలు అలవోకగా మాట్లాడే వంశీ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికల సమయంలో వంశీ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో, అలాగే సాధారణ ఓటర్లతోనూ ప్రత్యక్ష సంభాషణలు చేపట్టింది. ‘జనతా కీ బాత్-వంశీ తివారి కే సాథ్’ అనే తన ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎన్నికల అంశాలు, ఓటింగ్‌పై అవగాహన, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం, సామాజిక సమస్యలపై విస్తృత చర్చలు జరిపింది. అలాగే కాలేజీలలో జాగృతి కార్యక్రమాలు నిర్వహించి. ఓటింగ్ ప్రాధాన్యతపై యువతలో అవగాహన కల్పించింది. రాజకీయ అంశాలతో పాటు యువతకు మోటివేషన్ కల్పించేందుకు కూడా ప్రత్యేకమైన వీడియోలు చేస్తుంది.
‘ప్రతిభా పురస్కారం
జర్నలిజం రంగంలో వంశీ చూపిన ప్రతిభకు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు అత్యంత పిన్న వయస్కురాలైన జర్నలిస్టుగా గుర్తింపు ఇచ్చారు. తెలంగాణలోని పలు సామాజిక సంస్థలు ‘ప్రతిభా పురస్కారం’తో సత్కరించాయి. అంతేకాదు ఆమె చదువుతున్న కాలేజీ కూడా ప్రత్యేక పతకంతో గౌరవించింది. అలాగే పలు ప్రముఖ టీవీ ఛానళ్లు, పత్రికలు, ఆన్లైన్ మీడియా వేదికలు ఆమె విజయాలను విస్తృతంగా కొనియాడాయి. ఆమె సాధించిన విజయాలపై జర్నలిజం విద్యార్థులు పరిశోధనాత్మక ప్రాజెక్టులు కూడా రూపొందించారు. వంశీని కలిసిన రాజకీయ ప్రముఖులు ఆమె ప్రతిభను ఎంతగానో అభినందించారు. తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ప్రేరణాత్మక కథనాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రజలకు అందిస్తోంది.
ప్రజా సమస్యలను వెలికితీస్తూ…
ఇక సామాజిక అవగాహన విషయానికివస్తే .. వంశీ లక్ష్యం కేవలం ప్రజలకు వార్తలు చేరవేయడం కాదు. యువతలో ప్రజాస్వామ్యం, ఓటింగ్, సామాజిక బాధ్యత పట్ల చైతన్యాన్ని పెంపొందించడం తన ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. ఆమె స్వయంగా ‘గుడ్ న్యూస్’ పేరుతో ప్రజా సమస్యలను వెలికితీసే ప్రత్యేక రిపోర్టులు రూపొందిస్తోంది. ఈ విధంగా వంశీ ప్రశ్నల లోతు, సామాజిక అవగాహనతో ఆమె దేశంలోని అత్యంత యువ, ధైర్యవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ‘లిటిల్ జర్నలిస్టు’గా వంశీ తివారి చూపించిన దిశ నేటి యువతకు ఒక స్ఫూర్తిదాయక మార్గాన్ని చూపుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. పరిమితులు మన ఆలోచనల్లోనే ఉంటాయి. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పులకు దారితీయ గలవని చెప్పడానికి ఈమె జీవితమే ఓ నిదర్శనం. వంశీ తివారి ఇప్పుడు భారత జర్నలిజం రంగంలో వెలుగొందుతున్న ఒక ప్రతిభావంతమైన నక్షత్రం.
– సలీమ
ఇది నా బాధ్యత
కరోనా కాలంలో నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అప్పుడు చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతుండేవాళ్లు. వాళ్లు రూల్స్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు అనే సందేహం వచ్చింది. అదే ప్రజలను అడగాలను కుని మా నాన్నను సలహా అడిగితే చేయమన్నారు. అప్పుడు నేను వెంటనే ప్రజల్లో అవగాహన పెంచేందుకు డైరెక్టుగా వాళ్లతోనే మాట్లాడి వీడియోలు చేయడం మొదలుపెట్టాను. మంచి స్పందన వచ్చింది. అలాగే యువతలో నెగిటివ్ ఆలోచనలు పెరుగుతున్నాయి. వాటిపై కూడా అవగాహన కల్పించాలని అనేక స్టోరీలు చేస్తున్నా ను. భవిష్యత్తులో ఓ జర్నలిస్టుగా నా సామాజిక బాధ్యతను నిర్వర్తించాలనుకుంటున్నాను.
– వంశీ తివారి



