Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమన ఊరు-మనబడి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

మన ఊరు-మనబడి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

- Advertisement -

మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మన ఊరు – మన బడి కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ హరీశ్‌రావును పలువురు కాంట్రాక్టర్లు సోమవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు స్పందిస్తూ పెండింగ్‌ బిల్లులు రాక, అప్పుల పాలై ఆ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బిల్లులు చెల్లించకపోగా న్యాయంగా అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని ఖండించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించామని గుర్తు చేశారు.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోందని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం పెయింటింగ్‌, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే రూ.వందల కోట్లు ఎలా విడుదల చేసిందని ప్రశ్నించారు. కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్ల బిల్లును గాలికి వదిలేశారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని అడిగారు.

బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదని తెలిపారు. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేడుకున్నా స్పందన లేదని తెలిపారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్‌ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంపై శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కనీసం ఇప్పుడైనా మన ఊరు-మన బడి కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా సివిల్‌ కాంట్రాక్టర్లకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -