Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవందేమాతరం వివాదంతో లబ్దిపొందే పనిలో బీజేపీ

వందేమాతరం వివాదంతో లబ్దిపొందే పనిలో బీజేపీ

- Advertisement -

మొదటి రెండు చరణాలపై అభ్యంతరం లేదు
సెక్యులర్‌ విలువలకు భిన్నంగా తర్వాతి చరణాలు
రెండు చరణాలకే పరిమితం కావాలని ఆనాడే రాజ్యాంగం నిర్ణయం : రచయిత, ప్రొఫెసర్‌ రాంపూనియా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వందేమాతరం గేయాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ది పొందే పనిలో బీజేపీ ఉందని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ రాంపూనియా విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘వందేమాతరం-వివాదం-చరిత్ర’ అనే అంశంపై వెబినార్‌ను నిర్వహించారు. ఎస్వీకే మేనేజింగ్‌ ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాంపూనియా మాట్లాడుతూ…వందేమాతరంలోని మొదటి రెండు చరణాల పట్ల ఎవ్వరికీ అభ్యంతరం లేదన్నారు. 1882లో చేర్చిన మరో నాలుగు చరణాల పట్ల జిన్నాతోపాటు పలువురు ముస్లిం సంఘాల నేతలు అభ్యంతరాలు లేవనెత్తారని గుర్తుచేశారు. ఆ చరణాల్లో హిందూ దేవుళ్లను, దుర్గామాతను కీర్తించేలా ఉన్నాయని తెలిపారు.

సెక్యులర్‌ విలువలకు భిన్నంగా ఆ నాలుగు చరణాలున్న నేపథ్యంలో రెండు చరణాలకే పరిమితం కావాలని రాజ్యాంగ పరిషత్‌ ఆనాడే నిర్ణయించిందని తెలిపారు. ఆనాడు సుభాష్‌ చంద్రబోస్‌ మొత్తం చరణాలు పాడేలా చూడాలని నెహ్రూకు లేఖ రాయగా…ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ అందులో మతపరమైన అంశాలున్నందునే రెండు చరణాలకే పరిమితం చేస్తున్నామని చెబుతూ నెహ్రూ తిరిగి లేఖ రాశారని గుర్తుచేశారు. కోల్‌కతా వెళ్లి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కూడా రెండు చరణాలు మాత్రమే పాడాలనీ, మిగతా చరణాలను సెక్యులరిజానికి అనుకూలంగా లేవని ఎత్తిచూపిన విషయాన్ని ప్రస్తావించారు. వందేమాతరం సాంగ్‌కు మ్యూజిక్‌ను కంపోజ్‌ చేసింది కూడా రవీంద్రనాథ్‌ఠాగూరే అని చెప్పారు.

రాజ్యాంగ పరిషత్‌ ముందుకు దేన్ని జాతీయ గీతంగా నిర్ణయించాలనే చర్చ వచ్చినప్పుడు జనగనమన, వందేమాతరం, సారేజహాసే అచ్చా ముందుకొచ్చాయనీ, ఈ నేపథ్యంలోనే జాతీయ గీతాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగ సభ ఒక కమిటీని కూడా వేసిందని తెలిపారు. దాని ద్వారా జాతీయ గీతంగా జనగనమన గీతాన్ని ఆమోదించారన్నారు. ఆ గీతంతో పాటు వందేమాతరానికి సమాన గౌరవం ఉంటుందని రాజ్యాంగ సభ కమిటీ తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక్బాల్‌ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారనే సారేజహాసే అచ్చాను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో జనగనమన, వందేమాతరం గీతాలకు సమ ప్రాధాన్యం ఉంటున్నదనీ, అయితే అంతర్జాతీయ వేదికల్లో జనగనమనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆనాడే రాజ్యాంగం నిర్ణయించిందన్నారు. సైనిక కార్యకలాపాల్లో జనగనమన, వందేమాతరం, సారేజహాసేఅచ్చా పాటలను ఆర్మీ బ్యాండ్‌లో ఉంటాయని తెలిపారు.

బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలను చైతన్యపర్చడంలో బకింద్‌ చంద్రచటర్జీ ఇచ్చిన వందేమాతరం, భగత్‌సింగ్‌ ఇచ్చిన ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన జైహింద్‌ నినాదాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీషర్ల వ్యతిరేకంగా ఏనాడూ పోరాడని వాళ్ళు, వందేమాతరం నినాదాన్ని ఇవ్వని వాళ్లు ఇప్పుడు వందేమాతరం గేయాన్ని వివాదాస్పదం చేయడం సరిగాదని హితవు పలికారు. తాజాగా హోంమంత్రిత్వ శాఖ వందేమాతరం మొత్తం పాటను పాడాలని హోంశాఖ ఆదేశాలు చేయడంపై అభ్యంతరాలున్నాయని తెలిపారు. మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చాలని బలంగా కోరుకున్న సావర్కర్‌ను కీర్తించేవాళ్లు పదేండ్లుగా అధికారంలో ఉన్నారన్నారు. ఇప్పుడు ఆ పాలకులు రాజ్యాంగ విలువలకు పాతరేస్తున్న తీరును దునిమాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -