Tuesday, February 24, 2026
E-PAPER
Homeఆటలుఎందుకిలా?

ఎందుకిలా?

- Advertisement -

సొంతగడ్డపై భారత్‌ తడబాటు
సవాళ్లను అధిగమించటంలో వెనుకంజ


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియా సూపర్‌8లో ఒక్క ఓటమితో రేసులో వెనుకంజ వేసింది. 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. ఆతిథ్య జట్టును దారుణంగా దెబ్బతీసింది. ఈ ఓటమి డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణంలో చిచ్చు రేపటంతో పాటు సెమీఫైనల్‌ రేసులో భారత్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. లోపం లేని జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన భారత్‌ ఇప్పటివరకు ఎందుకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు? ఈ ఓటమిని అధిగమించి సెమీఫైనల్‌కు చేరుకునేందుకు భారత్‌ ముందున్న మార్గాలేమిటి?

231/5, 238/7, 271/5. టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన మ్యాచ్‌ల్లో చేసిన స్కోర్లు ఇవి. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన చివరి మూడు మ్యాచ్‌ల్లో 209 లక్ష్యాన్ని 28 బంతులు ఉండగానే ఊదేయగా.. 154 పరుగుల టార్గెట్‌ను 10 ఓవర్లలోనే ముగించారు. తొలుత బ్యాటింగ్‌ చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌ పట్టినా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి మేటి జట్లపైనే సూర్యకుమార్‌సేన ఈ గణాంకాలు నమోదు చేసింది. ఆధునిక టీ20 క్రికెట్‌లో అసమాన వీరోచిత బ్యాటింగ్‌ విన్యాసాలు భారత్‌ను ఇతర జట్లకు అందనంత ఎత్తులో నిలిపాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ ఓవర్‌కు 12కు పైగా పరుగులు సాధించింది. టీమ్‌ ఇండియా జోరు చూశాక.. టీ20 ప్రపంచకప్‌లో 300 పరుగుల స్కోరు ఖాయమనే భావన కలిగింది. గ్రూప్‌ దశలో చిన్న జట్లు సైతం పోటీలో ఉండగా.. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటే 300 కొట్టవచ్చనే అంచనాలు బలంగా వినిపించాయి.

కానీ టీ20 ప్రపంచకప్‌లో అంచనాలు తలకిందులు అయ్యాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ అసలు సమరంలో పూర్తి భిన్నంగా ఆడుతోంది. వరల్డ్‌కప్‌కు ముందు చూపించిన విన్యాసాల్లో ఇప్పుడు సగమైనా కనిపించటం లేదు. అందుకు కారణాలు లేకపోలేదు!. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో గత రెండేండ్లుగా భారత్‌ ఎక్కువగా స్వదేశంలో టీ20 సిరీస్‌లు ఆడింది. కానీ భారత్‌ ఆడిన పిచ్‌ల్లో వైవిధ్యం లోపించింది. సహజంగా భారత్‌లో పిచ్‌లు తొలుత ఫ్లాట్‌గా ఉంటాయి. మంచు కురిసేకొద్ది బ్యాటింగ్‌కు మరింత అనువుగా మారుతుంది. దీంతో ఛేదన సులభతరం అవుతుంది. కానీ ప్రపంచకప్‌ పిచ్‌లు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనికి తోడు దక్షిణాఫ్రికా బౌలర్లు మెరుగైన సన్నద్థత ఆ జట్టుకు ఉపయోగపడింది. పేసర్లు స్లో బాల్స్‌ను తెలివిగా ప్రయోగించారు. భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ముంగిట ఆఫ్‌ స్పిన్‌పై భారత టాప్‌-3 బ్యాటర్ల ఆటతీరుపై ఎక్కువగా చర్చ నడిచింది.

పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ నెట్స్‌లో ఎక్కువగా బౌలింగ్‌ సాధన చేశాడు. కానీ ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు అభిషేక్‌, కిషన్‌, తిలక్‌ ఆశించిన స్థాయిలో సిద్ధం కాలేదు. పవర్‌ప్లే తర్వాత పరుగుల వేట కష్టమవుతుందనే భావనలో కిషన్‌, అభిషేక్‌, తిలక్‌ అనవసర దూకుడుకు వెళ్లారు. ఫలితంగా ఫటాఫట్‌గా వికెట్లు పతనం అయ్యాయి. భారత్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట తొలి ఓవర్లోనే ఆఫ్‌ స్పిన్‌కు ఓపెనర్‌ వికెట్‌ కోల్పోయింది. అయినా, ఈ బలహీనతను అధిగమించేందుకు తగినంత శ్రద్ద వహించలేదు. దక్షిణాఫ్రికా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్ల కోసం అక్షర్‌ పటేల్‌ను పక్కనపెట్టి ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ ఆఫ్‌ స్పిన్‌ సవాల్‌కు సఫారీ బ్యాటర్లు మెరుగ్గా సిద్ధమయ్యారు. సుందర్‌ మాయను సులువుగా తిప్పికొట్టారు. కానీ భారత టాప్‌ ఆర్డర్‌ ఇక్కడ విఫలమైంది. ఫలితంగా భారత్‌ దారుణ పరాజయం చవిచూసింది.

  • నవతెలంగాణ క్రీడావిభాగం
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -