Tuesday, February 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేటి నుంచి టారిఫ్‌ హాల్ట్‌

నేటి నుంచి టారిఫ్‌ హాల్ట్‌

- Advertisement -

అమల్లోకి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు
15 శాతం సుంకాన్ని వసూలు చేయనున్న యూఎస్‌
అమెరికా కస్టమ్స్‌, సరిహద్దు భద్రతా విభాగం వెల్లడి
ఐఈఈపీఏ ప్రకారం విధించిన సుంకాలకే ఈ సడలింపు

వాషింగ్టన్‌ : ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల బాదుడు చట్టవ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో ట్రంప్‌ విధించిన అధిక సుంకాల వసూలు ఈనెల 24న ఉదయం 10.30 గంటల నుంచి ఆగిపోనుంది. ఈమేరకు అమెరికా కస్టమ్స్‌, సరిహద్దు భద్రతా విభాగం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్‌ పవర్స్‌ యాక్ట్‌ (ఐఈఈపీఏ)- 1977 ప్రకారం ట్రంప్‌ పెంచిన సుంకాల వసూలును ఇక ఆపేస్తామని తెలిపింది. దిగుమతి సుంకాలను పెంచుతూ గతంలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జారీచేసిన మార్గదర్శకాలన్నీ డియాక్టివేట్‌ అవుతాయని వెల్లడించింది.

సడలింపు కేవలం ఈ సుంకాలకే
సుంకాల బాదుడును ఆపాలంటూ గత శుక్రవారమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలు వెలువడిన మూడు రోజుల తర్వాత తీర్పు అమలు దిశగా ట్రంప్‌ సర్కారు ప్రకటన చేసింది. ఈ వ్యవధిలో (ఫిబ్రవరి 20 – 23 వరకు) అమెరికాకు వస్తు, సేవలను ఎగుమతి చేసిన ప్రపంచ దేశాల నుంచి పాత లెక్క ప్రకారమే అధిక సుంకాలను వసూలు చేశారు. ఈ మూడు రోజుల్లో అదనంగా వసూలు చేసిన సుంకాన్ని ఆయా దేశాలకు రీఫండ్‌ చేస్తారా? చేయరా అనే దానిపై అమెరికా కస్టమ్స్‌ విభాగం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఐఈఈపీఏ-1977 ప్రకారం ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన సుంకాలకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సెక్షన్‌ 232 జాతీయ భద్రతా అధికారాలు, సెక్షన్‌ 301 అన్‌ ఫెయిర్‌ ట్రేడ్‌ స్టాచ్యూట్స్‌ ప్రకారం ట్రంప్‌ పెంచిన సుంకాలకు ఈ సడలింపు వర్తించదని తేల్చి చెప్పింది.

15 శాతం సుంకం .. చట్టపరమైన సవాళ్లు
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను జారీ చేశారు. ప్రపంచ దేశాలపై విధించే దిగుమతి సుంకాన్ని 10 శాతం చేస్తానని అందులో వెల్లడించారు. అయితే శనివారం ఉదయం ట్రంప్‌ మళ్లీ మాట మార్చారు. దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతానని తెలిపారు. ట్రేడ్‌ యాక్ట్‌ – 1974లోని సెక్షన్‌ 122 ప్రకారం అమెరికా వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు ఈ సుంకం వసూలును అమలు చేస్తానన్నారు. 150 రోజుల పాటు ఈ కొత్త సుంకం రేటు అమల్లో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈవిధంగా సుంకాలను ఎడాపెడా పెంచితే చట్టపరమైన సవాళ్లు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్‌నకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం సంకోచించకుండా సుంకాన్ని 15 శాతానికి పెంచడం గమనార్హం.

రూ.15.88 లక్షల కోట్ల రీఫండ్‌ గండం
సుప్రీం తీర్పు ఎఫెక్ట్‌ అమెరికా ఖజానాపైనా పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలపై అధిక సుంకాల బాదుడుతో ట్రంప్‌ సర్కారు ఆర్జించిన ఆదాయంలో రూ.15.88 లక్షల కోట్లను రీఫండ్‌ చేయాల్సి రావచ్చని పలువురు నిపుణులు అంటున్నారు. అధిక దిగుమతి సుంకాల విధింపు వల్ల ప్రస్తుతానికి ప్రతిరోజు రూ.4,538 కోట్లు చొప్పున అమెరికా ఖజానాలోకి చేరుతున్నాయని వారు తెలిపారు. 15 శాతం సుంకాల కొత్త లెక్క అమల్లోకి వస్తే, ప్రతిరోజూ అమెరికాకు వస్తున్న ఆదాయం చాలావరకు తగ్గిపోతుందని చెబుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించిన ఏ ఒక్కరు కూడా సెక్షన్‌ 122ను ప్రయోగించలేదు. చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయనే ఆందోళన వల్లే ఆ సెక్షన్‌ను అమలు చేసేందుకు గత దేశాధ్యక్షులు సంకోచించి ఉంటారనే అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వల్ల చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌ లాంటి కీలకమైన ఆసియా దేశాలకు భారీ ఊరట లభించింది. వాటిపై ట్రంప్‌ పెంచిన సుంకాలు చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -