– దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలు లొంగిపోయారు
– పక్క రాష్ట్ర సీఎం విష్టుదేవ్ సారు వెల్లడి
– లొంగుబాటుకు ససేమిరా అంటున్న బడే చొక్కారావు!
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుల్లో మిగిలిన ముగ్గురు అగ్రనేతల కోసం రాష్ట్ర యాంటీ నక్సలైట్ నిఘా విభాగం ఎస్‌ఐబీ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నది. కేంద్ర కమిటీలోని 25 మంది సభ్యుల్లో 22 మంది లొంగిపోవడమో, ఎన్‌కౌంటర్‌లో మరణించటమో జరిగింది. కాగా మిగిలినవారిలో మావోయిస్టు పార్టీ ప్రథమ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సినం బెస్ర, తెలంగాణకు చెందిన నరహరిలు ఉన్నారు. 2016లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల నుంచి తప్పుకున్న గణపతి తర్వాత కొంతకాలానికి విదేశాలకు వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చాయి. నేపాల్ మీదుగా గణపతి విదేశాలకు వెళ్లినట్టు ఐబీ వర్గాలకు సైతం సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా సినం బెస్ర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండగా.. నరహరి పశ్చిమబెంగాల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. తాజాగా పార్టీకి సారథ్యం వహిస్తున్న తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ, మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, మరోనాయకుడు నరసింహరెడ్డిలతో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. కాగా వీరు లొంగిపోయినట్టు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అంతర్గతంగా ధ్రువీకరిస్తూ, బహిరంగంగా మాత్రం ఎలాంటి ప్రకటననూ విడుదల చేయలేదు. అయితే దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారనీ, దీంతో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా దేశంలో తగ్గిపోయినట్టేనని పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సారు.. రారుపూర్‌లో తాజాగా ప్రకటించి ధృవీకరించారు. కాగా ఈ అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్టు రాష్ట్ర మీడియానేగాక జాతీయ పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి. కానీ ఏ కారణం చేతనో రాష్ట్ర పోలీసు అధికారులు ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా జాప్యం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే, గణపతి, సినం బెస్ర, నరహరిల కోసం రాష్ట్ర ఎస్‌ఐబీ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో గణపతి విదేశాల్లో ఉన్నారనే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా ఆయన ఆచూకీ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక బెస్ర, నరహరిలను లొంగిపోయేలా చేయడానికి ఇప్పటికే బయటకు వచ్చిన ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రయత్నాలను సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు లొంగిపోతే దాదాపుగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయినట్టేనని ఒక సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే, మావోయిస్టు పార్టీ మరో సీనియర్ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ కోసం కూడా ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్‌లో ఎస్‌ఐబీ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే దామోదర్ మాత్రం లొంగిపోవడానికి ఇష్టపడటం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. మావోయిస్టు సారథి లొంగిపోవడంతో పార్టీలో మిగిలి ఉన్న శ్రేణులకు దిశానిర్దేశం కరువైనట్టు తెలుస్తోంది. మరోవైపు దేవ్‌జీ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఆ ముగ్గురి కోసం ఎస్‌ఐబీ వేట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



