Tuesday, February 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువారం రోజులైనా స్పందనేది?

వారం రోజులైనా స్పందనేది?

- Advertisement -

నోరెత్తని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు
చిన్నారిని చిదిమిన నిందితులపై హత్య కేసు నమోదు చేయాలి
కుమ్మెర సర్పంచ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి
అభద్రతలో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ
నాగర్‌కర్నూల్‌లో సామాజిక సంఘాలతో సీపీఐ(ఎం) ధర్నా

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
కుమ్మెర జాతరలో పసిబిడ్డను చంపి వారం రోజులు అయినా పాలకవర్గాలు పట్టించుకోవడంలేదని, వారి వ్యవహార శైలి చూస్తుంటే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం కుమ్మెర గ్రామంలో ఐదు రోజుల క్రితం జాతరలో చిన్నారిని హత్య జరిగిన బాధిత కుటుంబాన్ని జాన్‌వెస్లీతోపాటు దళిత, సామాజిక, ప్రజా సంఘాల నాయకులు సోమవారం పరామర్శించారు. వారితో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెత్తందారులను వెంటనే అరెస్ట్‌ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై నాగర్‌కర్నూల్‌లో సీపీఐ(ఎం), దళిత, సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో జాన్‌వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర జాతరలో దాడి చేయడమే కాకుండా రజక, దళిత కుటుంబాల మహిళలపై దాడి చేయడంతోపాటు చంటి పిల్లను హత్య చేసిన భూస్వామ్య దొరలు, పెత్తందారులు శ్రీనివాస్‌రెడ్డి, మధురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, దాడి చేసిన ఆలయ నిర్వాహకులపై తక్షణమే హత్యానేరం కింద కేసు నమోదుచేయాలని అన్నారు. వారిని అరెస్టు చేయకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చిన్నారిని చంపిన ఘటన జరిగి వారం రోజులు దాటినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు. కుమ్మెర సర్పంచ్‌నూ అరెస్ట్‌ చేయాలని తెలిపారు. పోలీసులు బాధితుల ఫిర్యాదును పట్టించుకోకుండా నిందితులిచ్చిన దరఖాస్తు ఆధారంగా దళిత కుటుంబంపై కేసులు బనాయించడం దారుణమన్నారు.

దాడి చేసిన పెత్తందారులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో కేసును నీరు కార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. అభద్రతలో ఉన్న చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. బాధితులకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్‌, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మానాయక్‌, ఆర్‌. శ్రీరాం నాయక్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కార్యదర్శి పర్వతాలు, నాయకులు దేశ్యానాయక్‌, కందికొండ గీత, అంజనేయులు, రామయ్య, మధు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని రాజీవ్‌ రహదారిపై రజక సంఘం, ఎమ్మార్పీఎస్‌, మాదిగ హక్కుల దండోరా, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -