Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాని పర్యటనెందుకు?

ప్రధాని పర్యటనెందుకు?

- Advertisement -

మోడీ ఇజ్రాయిల్‌ టూర్‌పై పార్లమెంటరీ ప్యానెల్‌
ఆయన వెళ్తున్న సమయంపై కమిటీలోని ఎంపీల ఆందోళన


న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై పార్లమెంటు విదేశాంగ వ్యవహారాల స్థాయి కమిటీ స్పందించింది. ఈ సమయంలో ప్రధాని ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లడంపై ప్రశ్నలు లేవనెత్తింది. భద్రతా పరిస్థితులు, ఇరాన్‌పై అమెరికా దాడి భయాలు, ప్రాంతీయ అస్థిరత నేపథ్యంలో ఈ సందర్శన సరైనదేనా అన్న చర్చ జరిగింది. 25న మోడీ ఇజ్రాయిల్‌కు చేరుకోనున్నారు. 2017 తర్వాత ఇది ఆయన తొలి ఇజ్రాయిల్‌ పర్యటన కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ పలు ప్రశ్నలు, సందేహాలు, ఆందోళనలను వెలిబుచ్చింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్‌ కమిటీ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)బడ్జెట్‌ కేటాయింపులపై చర్చించడానికి సమావేశమైంది. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. ఓ సభ్యుడు ప్రధాని పర్యటన వెనుక ఉన్న హేతుబద్దతను ప్రశ్నించాడు. భారత్‌ ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి పరిస్థితుల దృష్ట్యా దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించిందనీ, ఈ వివాదంలో ఇజ్రాయిల్‌ కూడా కలుగజేసుకోవచ్చనీ.. ఇలాంటి సమయంలో ప్రధాని ఇజ్రాయిల్‌ పర్యటన భద్రతా పరంగా సమంజసమేనా అనే ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ప్రధాని పర్యటనలన్నీ భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు జరిగాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి చెప్పారు. అయితే ఉద్రిక్తతలు మరింత పెరిగితే పర్యటన రద్దవుతుందా లేదా అన్నది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో చాబహార్‌ పోర్టుకు ఎలాంటి కేటాయింపులూ లేకపోవడంపై కూడా పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -