1,495 కేంద్రాల్లో ఏర్పాట్లు
హాజరు కానున్న 9,97,075 మంది విద్యార్థులు : ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాసేందుకు మూడు గంటల పాటు సమయం ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ప్రారంభమయ్యాక 5 నిమిషాల కంటే ఆలస్యంగా వస్తే అనుమతించబోరు. అదే విధంగా ఏ విద్యార్థిని కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా హాలు నుంచి బయటికి పంపించరు. ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్రంలో 9,97,075 మంది హాజరుకానుండగా వారి కోసం 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సోమవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
మొత్తం 1,495 కేంద్రాలకు గానూ 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, 221 ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీల్లో, 863 ప్రయివేటు కాలేజీల్లో, 7 స్కూల్స్, ఇతర కాలేజీల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం (రెగ్యులర్) విద్యార్థులు 4,53,932 మంది, ద్వితీయ సంవత్సరం (ప్రయివేటు) విద్యార్థులు 54,017 మంది ఉన్నారు. రెండో సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. మొదటి సంవత్సరంలో 2,17,428 మంది బాలురు, 2,24,437 మంది బాలికలు, వొకేషనల్ పరీక్షలకు 22,586 మంది బాలురు, 24,675 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో 2,31,471 మంది బాలురు, 2,30,850 మంది బాలికలు, వొకేషనల్‌లో 22,429 మంది బాలురు, 23,199 మంది బాలికలు పరీక్షలను రాయనున్నారు.
పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ), జిల్లా స్థాయి హై పవర్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్‌లను నియమించారు. జిల్లా సమన్వయ కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన రవాణా సదుపాయాల ఏర్పాట్లు, పరీక్షల సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ ఎయిడ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా పోలీస్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దాదాపు 7,500 సీసీ కెమెరాల ద్వారా పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.
కంట్రోల్ రూం నెంబర్లను సంప్రదించాలి
పరీక్షల నిర్వహణలో భాగంగా స్టేట్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. టెలిఫోన్ నెంబర్ 040-2465 5027 లేదా 9402 05555లలో సంప్రదించవచ్చు. అదే విధంగా పరీక్షల్లో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు నిరంతరాయంగా నిపుణులైన కౌన్సిలర్లు, ఉచిత మానసిక ఆరోగ్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 14416, లేదా 80693 91416లో సంప్రదించొచ్చు.
అరగంట ముందు వెళితే మంచిది
పరీక్షా సమయం ప్రారంభం కావడానికి అరగంట ముందే వెళ్లేలా విద్యార్థులు సిద్ధపడితే మంచిదని కృష్ణ ఆదిత్య సూచించారు. తద్వారా పరీక్షలను మరింత ఫోకస్‌గా రాసేందుకు వీలుంటుందన్నారు. ట్రాఫిక్ జాంలు, ఇతర సమస్యల బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జోన్ ఆధారంగా జంబ్లింగ్ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఐదు సెంటర్లకు సంబంధించిన విషయం మాల్ ప్రాక్టీస్ కమిటీ వద్ద విచారణలో ఉందని చెప్పారు.



