మునుగోడు మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో నిరసన..
నవతెలంగాణ – మునుగోడు
తిరుమలగిరి మండలంలో ఓ శుభకార్యానికి ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ పై మద్యం మత్తులో దాడి చేసి, కెమెరాలను ద్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మునుగోడు మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మాధగోని సైదులు గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో ఫోటోగ్రాఫర్ పై దాడికి నిరసనగా ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ హాని చేయకుండా తన వృత్తిలో నైపుణ్యతను చాటుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాటం వెంకన్న, ఉపాధ్యక్షుడు నిమ్మల నాగర్జున, కోశాధికారి నూకల లింగస్వామి, కుటుంబ భరోసా ఇంచార్జ్ సద్దల శ్రీశైలం, కమిటీ సభ్యులు తవిటి సురేష్, పున్న శంకర్, రావుల స్వామి, శిర్గమల్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.


