టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు
నవతెలంగాణ- కాటారం
కాటారం మండల కేంద్రంలో రాష్ట్రమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారగోని మహేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
ముందుగా కాటారం ప్రధాన కూడలిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలో సందడి చేశారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి మానవతా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నిరంతరం ప్రజాసేవ చేస్తున్న నాయకుడు శ్రీనుబాబు అని కొనియాడారు.
ఆపదలో ఉన్నవారికి అర్థరాత్రి ఫోన్ చేసినా స్పందించి సమస్య పరిష్కారం చేసే ఆపద్బంధవుడు శ్రీనుబాబు అని ప్రశంసించారు. యువతకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్న నిస్వార్థ సేవకుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
శ్రీనుబాబు ఇలాంటి జన్మదిన వేడుకలను నిండు నూరేళ్లు జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు,మహిళా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



