Wednesday, February 25, 2026
E-PAPER
Homeబీజినెస్రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి..

రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి..

- Advertisement -

సెన్సెక్స్‌ 1069 పాయింట్ల పతనం
ముంబయి :
దలాల్‌ స్ట్రీట్‌పై బేర్‌ పంజా కొనసాగుతోంది. మంగళవారం అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కుప్పలకూడంతో ఇన్వెస్టర్ల సందప దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,069 పాయింట్లు లేదా 1.28 శాతం పతనమై 82,226కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 25,425 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.85 లక్షల కోట్లు హరించుకుపోయి.. రూ.466 లక్షల కోట్లకు పడిపోయింది. ఐటీ రంగంలో అంథ్రోపిక్‌ ఏఐ ప్రకంపనలు ఐటి షేర్లను కుదేలు చేశాయి. పాత కాలపు సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థ కోబల్‌ను ఈ ఏఐ సులభంగా ఆధునీకరించగలదని ప్రకటించడంతో.. భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీని ప్రభావంతో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి షేర్లు 6 శాతం వరకు పతనమయ్యాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై 15 శాతం టారిఫ్‌లను విధిస్తామని ప్రకటించడం ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ఈ వాణిజ్య యుద్ధ భయాలు గ్లోబల్‌ మార్కెట్లను కుదిపేశాయి. అమెరికా టెక్‌ షేర్లలో మొదలైన అమ్మకాల ఒత్తిడి ఆసియా మార్కెట్లపై కూడా పడింది. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90.95కు పడిపోవడం మరో ప్రతికూల అంశం. అమెరికా, ఇరాన్‌ మధ్య జరగబోయే చర్చలకు ముందే ట్రంప్‌ ఇరాన్‌పై దాడులు చేసే ఆలోచనలో ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచాయి. ఇరాన్‌ కూడా దీనికి దీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించడంతో ముడి చమురు ధరలు పెరగవచ్చనే భయం మార్కెట్లను తాకింది. ప్రస్తుత ప్రతికూల సమయంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -