Wednesday, February 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం

- Advertisement -

– గాలివాన బీభత్సంతో నేలవాలిన పంటలు
– తడిసిన మిర్చిపసుపు… ఆందోళనలో రైతులు
– మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం
– ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన
నవతెలంగాణ- విలేకరులు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. గాలివాన బీభత్సానికి చేతికొచ్చిన పంట కండ్లముందే తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడ, కురవి, సీరోల్‌, డోర్నకల్‌ మండలాల్లో మిర్చి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మిర్చి కోతలు పూర్తి చేసి, ఆరబోత కోసం కల్లాల్లో పోసిన పంట తడిసిపోయింది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంట ఇలా నీటిపాలు కావడంతో రైతులు రోదిస్తున్నారు. తడిసిన మిర్చి రంగు మారి, నాణ్యత దెబ్బతినడం వల్ల మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కదని ఆందోళన చెందుతున్నారు. బయ్యారం, మహబూబాబాద్‌, గార్ల మండలాల్లో ఈదురు గాలుల ధాటికి మొక్కజొన్న పంట నేలవాలింది. కొంతమంది రైతులు ముందస్తు జాగ్రత్తగా పట్టాలు కప్పుకున్నా, గాలి ధాటికి అవి కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. ”పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు.. వ్యవసాయం చేయడమే భారంగా మారింది” అని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన మిర్చిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో మొక్కజొన్న రైతులకు అపారనష్టం సంభవించింది. కంకి వేసే దశలో మొక్కజొన్న పంట ఉంది. ఈ సంవత్సరం మొక్కజొన్న పంట ఎంతో ఆశాజనకంగా ఉందని అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వచ్చిన వర్షం దెబ్బకు మొక్కజొన్న పంట అనేక గ్రామాల్లో నేలమట్టమయింది. పంటనష్టం అంచనాల్లో వ్యవసాయాధికారులున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో 587 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రామాజిపేట్‌ గ్రామంలోనే 107 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగినట్టు తెలిపారు. మండలంలో సుమారు 7 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా అకాల వర్షానికి 482 ఎకరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్టు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. సారంగాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల కూలింది. ఆదిలాబాద జిల్లాలో మొక్కజొన్న, కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. విద్యుత్‌ స్తంబాలపై షాట్‌ సర్య్కూట్‌ కావడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలంలోని మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. మున్యాల్‌, రేవోజీపేట, గోడిసిర్యాల రైతుల మొక్కజొన్న పంట నేల వాలింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన వానతో పసుపు కొమ్ము తడిసిపోయింది. దాంతో రంగు మారిందని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి వేల రూపాయల పంట పెట్టుబడి పెట్టి పసుపు సాగుచేస్తే.. చెడగొట్టు వానతో తమకు నిరాశే మిగిలిందని వాపోయారు. ఈ సంవత్సరం పంట బాగా పడిందని, పసుపు రేటు కూడా ఆశాజనకంగా ఉందని, అప్పులన్నీ తీరిపోతాయని ఆశపడ్డామని, అకాల వర్షంతో తమ ఆశలు ఆవిర య్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తడిసిన, రంగు మారిన పసుపు పంటకు ధర తగ్గించకుండా కొనుగోలు చేయా లని కోరుతు న్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న పంట సైతం నేలకొరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -