న్యూఢిల్లీ: పాలస్తీనా ప్రజలపై యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ బుదవారం ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లడాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన దేశ చరిత్రపై చెరగని మచ్చ అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్‌లో మంగళవారం పోస్టు చేశారు. భారత్‌కు దశాబ్దాల స్వాతంత్య్రోద్యమ వారసత్వాన్ని, పాలస్తీనా విముక్తి పోరాటంలో చారిత్రక మద్దతును మోడీ ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. యుద్ధ నేరస్తుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చేతులు కలపడం సరికాదన్నారు. భారతదేశం భద్రతా విషయాల్లో సహకరిస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. మోడీ ఎవరి స్వరాలకు డాన్స్ చేయడానికి, పాడటానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి విరుద్దంగా ఆయన వ్యవహారం ఉందని బేబీ విమర్శించారు. పార్లమెంటుకు సమానమైన క్నెస్సెట్‌లో మోదీ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 2023 తర్వాత గ్లోబల్ సౌత్ దేశాల నాయకులు ఇజ్రాయిల్‌ను సందర్శించిన సంఖ్య చాలా తక్కువ. ఇది అపవిత్ర కూటమని, జాతి విధ్వంసం చేస్తున్న నెతన్యాహును ఆలింగనం చేసుకోవడం సిగ్గుచేటని ఎక్స్ పోస్టులో విమర్శించారు.



