Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న కాలేశ్వరం కాల్వ సర్వేపై రైతుల ఆందోళన

చిన్న కాలేశ్వరం కాల్వ సర్వేపై రైతుల ఆందోళన

- Advertisement -

– అధికారుల పనులు నిలిపివేత
నవతెలంగాణ – కాటారం 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిపాదిత చిన్న కాలేశ్వరం కాల్వ నిర్మాణానికి సంబంధించి అధికారులు చేపట్టిన సర్వే గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. కాల్వ పనుల కోసం సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను రైతులు, గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమకు ఉన్న కొద్దిపాటి సాగు భూమే తమ కుటుంబాల జీవనాధారమని, అదే భూముల మీదుగా కాలువ నిర్మిస్తే సాగు పూర్తిగా దెబ్బతిని బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేస్తున్న సారవంతమైన భూములను కోల్పోతే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

కాలువ నిర్మాణానికి ముందు రైతుల అభిప్రాయాలను తెలుసుకోకుండా, సరైన సమాచారం ఇవ్వకుండా సర్వేలు నిర్వహించడం సరికాదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. భూముల స్వాధీనం, పరిహారం, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు సర్వే పనులు కొనసాగించనివ్వమని హెచ్చరించారు.

రైతుల నిరసనతో సర్వే పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం అధికారులు గ్రామస్తులతో చర్చించి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సమస్యపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -