తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గుంటి వేణు
నవతెలంగాణ – రాజన్నసిరిసిల్ల
పసిపాపన మరణానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గుంటి వేణు అన్నారు. సిరిసిల్లలోని సిపిఐ కార్మిక భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో పసిపాపను కాలుతో తన్ని చంపిన పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని హత్య కేసు నమోదు చేయాలని కేసును జాప్యం చేస్తున్న డీఎస్పీ సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామంలో ఆధిపత్య కులాలకు చెందిన కొందరు కులాహంకారం తో చాకలి కుటుంబాన్ని దేవాలయం ప్రవేశం నిరాకరణ కులహింస శిశు హత్య అత్యంత దీనమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. మల్లన్న జాతర సందర్భంగా ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వారిని దేవాలయంలో ప్రవేశించకుండా అడ్డుకోవడం వారిపై కులపరంగా దాడి చేయడం అన్యాయమని ఆ హింసలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన పేర్కొన్నారు.
చాకలి చంద్రకళ కుటుంబం పైన దాడి అమానుషం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం గౌరవం స్వేచ్ఛ మానవ హక్కుల పైన జరిగిన దాడిగా భావిస్తున్నామని ,చిన్నారిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నష్టం జరిగిన ఆ కుటుంబాన్ని ఆదుకోనటానికి రాష్ట్ర ప్రభుత్వమే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సోమ నాగరాజు, జిల్లా నాయకులు మంత్రి చంద్రయ్య పాల్గొన్నారు.



