భారీగా పెరిగిన అంచనా వ్యయం…
ఇంజిన్ తయారీ-అసెంబ్లింగ్ యూనిట్నకు
భారత్ ఏర్పాటు చేయాలని జీఈ సంస్థ డిమాండ్
చండీగఢ్ : భారత్-అమెరికా మధ్య జరిగిన అత్యంత కీలకమైన రక్షణ సాంకేతిక ఒప్పందాలలో ఒక దానికి ఇప్పుడు గ్రహణం పట్టేలా కన్పిస్తోంది. జీఈ-ఎఫ్ 414 యుద్ధ విమానాల ఇంజిన్ల స్థానిక తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ఉద్దేశించిందే ఈ ఒప్పందం. సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి అమెరికా ఏరోస్పేస్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థతో జరుగుతున్న చర్చలలో ప్రతిష్టంభన తీవ్రం కావడమే ఈ సంక్షోభానికి కారణం. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై జీఈ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) మధ్య ఇటీవల వాణిజ్య చర్చలు జరిగాయి. ఒక్కో జీఈ-ఎఫ్414 విమాన ఇంజిన్ అంచనా వ్యయం సుమారు మూడు రెట్లు పెరిగి రూ.70-80 కోట్ల నుంచి రూ.200 కోట్లు దాటిన విషయం ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. సుమారు రూ.7,576 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకమైన దేశీయ ఎఫ్414 ఇంజిన్ తయారీ-అసెంబ్లింగ్ యూనిట్‌ను భారత్ ఏర్పాటు చేయాలని జీఈ సంస్థ డిమాండ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజిన్ ధరలు భారీగా పెరగడంతో పాటు ఈ డిమాండ్ కూడా తోడవడంతో ఒప్పంద ప్రక్రియ బాగా మందగించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసే విషయంపై జరిగిన చర్చలలో కొంత పురోగతి కన్పించినప్పటికీ అత్యంత కీలకమైన సాంకేతికత-మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), అమెరికా ఎగుమతి నియంత్రణ ఆంక్షలు తదితర అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఈ ఒప్పందం కుదరని పక్షంలో మన దేశం ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తేజాస్ ఎంకే-2, ఎఎంసీఏ, టీఈడీబీఎఫ్ వేదికల డిజైన్లను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎఫ్414 ఇంజిన్ల వ్యయం గణనీయంగా పెరగడం భారత్‌ను వ్యూహాత్మక ఇబ్బందులలోకి నెట్టిందని రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ సవరించిన ఆర్థిక నిబంధనలను అంగీకరిస్తే నిర్ణీత కాలపరిమితి లోగా అభివృద్ధిని సాధించవచ్చునని, అయితే పరిమిత ఆధునిక వనరుల కోసం సాయుధ దళాలు పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో వేల కోట్ల అదనపు వ్యయాన్ని భరించడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోందని ఆయన తెలిపారు.
అమెరికాతో రక్షణ సాంకేతి కఒప్పందానికి గ్రహణం
- Advertisement -
- Advertisement -



