Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌, విత్తన చట్టాలు రైతాంగ మనుగడకు ముప్పు

విద్యుత్‌, విత్తన చట్టాలు రైతాంగ మనుగడకు ముప్పు

- Advertisement -

– భారత్‌ మార్కెట్‌ను కబళించేందుకు అమెరికా కుట్ర
– మోడీ, అమిత్‌ షా.. ట్రంప్‌ ఏజెంట్లుగా మారారు
– ఎర్రజెండా బలపడితేనే ప్రజాస్వామ్యానికి ఊపిరి : మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్‌
అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశానికి తీవ్ర హాని చేస్తోందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేతకానితనం వల్లే దేశ మార్కెట్‌ను కబళించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య అన్నారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పెరుమాళ్ళ జగన్నాధం భవన్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని విమర్శించారు.

విత్తన చట్టం విషయంలో అమెరికాతో లాలూచీ పడటం సిగ్గుచేటన్నారు. ప్రపంచాన్ని ట్రంప్‌ బెదిరిస్తున్నాడని, భారత్‌పై ఆంక్షలు విధిస్తున్నాడని, అమెరికా ఉత్పత్తులను ఇక్కడ అడ్డుకున్నందుకు 25శాతం జరిమానా వేశాడని, మనం అక్కడ వస్తువులు అమ్ముకోవాలంటే మరో 25శాతం సుంకాలు విధిస్తున్నాడని తెలిపారు. రష్యా వద్ద పెట్రోల్‌ కొనకుండా బెదిరిస్తున్నాడని, ఈ దుర్మార్గపు విధానాలకు మోడీ ప్రభుత్వం తలవంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అదానీ, అంబానీలకు మేలు చేయడం కోసమే కేంద్రం అమెరికాకు దాసోహమయిందని అన్నారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై మోడీ ప్రభుత్వం స్పందించకపోవడంతో అమెరికాలోని భారత సంతతి న్యాయవాదులే సుప్రీంకోర్టులో పోరాడి సుంకాలను రద్దు చేయించాలని కోరారని తెలిపారు. కోర్టు మొట్టికాయలు వేయడంతోనే ట్రంప్‌ సుంకాలను 18 శాతానికి తగ్గించారని, కానీ గతంలో ఇది కేవలం 3 శాతమే ఉండేదని అన్నారు. అమెరికా ధాన్యం, పాలు, కూరగాయలు భారత మార్కెట్లోకి వస్తే మన దేశ రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మోడీ, అమిత్‌ షాలు భారత్‌ భక్తులు కాదని, ట్రంప్‌ భక్తులని తెలిపారు.

ప్రజా ఉద్యమాలే పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానాలపై యువత తిరుగుబాటు చేస్తోందని వీరయ్య తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే బీజేపీ వంటి నిరంకుశ ఫాసిస్ట్‌ శక్తులు బలపడ్డాయని అన్నారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా మోడీ తనకు నచ్చిన బిల్లులు పాస్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ కూడా రేపు అధికారంలోకి వస్తే కార్పొరేట్‌ శక్తులకే సేవ చేస్తుందని అన్నారు. 150 ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చారని, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి పేద కూలీల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. రాముని పేరుతో ప్రజలను మభ్యపెడుతూ భజన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు ద్వారా ఉచిత విద్యుత్తును రద్దు చేసి రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారని, అణు విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటు పరం చేయడం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. జమిలి ఎన్నికల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఓటర్ల జాబితా నుంచి వ్యతిరేకులను తొలగిస్తూ పచ్చి నియంతృత్వానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ- బీఆర్‌ఎస్‌ పొత్తు ఆత్మహత్య సదృశ్యమని, బీఆర్‌ఎస్‌ను మింగేయాలని బీజేపీ చూస్తోందని అన్నారు. ప్రజలను సమీకరించి ఎర్రజెండా నీడన పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న, సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గుణగంటి రాజన్న, అల్వాల వీరయ్య, కుంట ఉపేందర్‌, కందునూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -