Thursday, February 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉగ్రవాద పోరులో అండగా ఉంటాం

ఉగ్రవాద పోరులో అండగా ఉంటాం

- Advertisement -

హమాస్‌ దాడిని ఖండిస్తున్నాం

ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలుస్తాం
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం :
ఆ దేశ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం
బహిష్కరించిన ప్రతిపక్షాలు

జెరూసలేం : ఉగ్రవాద పోరులో అండగా ఉంటామనీ, ఇజ్రాయిల్‌పై 2023 అక్టోబర్‌లో హమాస్‌ చేసిన దాడిని ప్రధాని మోడీ ఖండించారు. హమాస్‌ దాడిని అనాగరిక చర్యగా విమర్శించారు. ఇజ్రాయిల్‌కు అండగా ఉంటామని చెప్పారు. రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ పార్లమెంట్‌లో మోడీ ప్రసంగించారు. హమాస్‌ దాడి గురించి మాట్లాడుతూ… ”మీ బాధను మేం అనుభవిస్తున్నాం. మీ బాధను పంచుకుంటాం. ప్రస్తుతం, భవిష్యత్‌లో కూడా ఇజ్రాయిల్‌పై పూర్తి నమ్మకంతో ధృఢంగా భారత్‌ నిలుస్తుంది” అని మోడీ చెప్పారు. ప్రజలను చంపడాన్ని, ఉగ్రవాదాన్ని ఏ కారణమూ సమర్థించదని అన్నారు. ”భారత్‌ కూడా ఉగ్రవాద బాధను భరించింది. 26/11 ముంబయి దాడుల్లో ఇజ్రాయిల్‌ పౌరులతో సహా అనేక మంది అమాయక ప్రజల ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మేం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం. ఉగ్రవాదంపై సహనం లేని, రాజీలేని విధానాన్ని మేం కలిగి ఉన్నాం. ఇందులో ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలూ లేవు” అని మోడీ తెలిపారు. శాంతి మార్గం ఎల్లప్పుడూ సులభం కాదని, కానీ ఈ ప్రాంతంలో చర్చలు, శాంతి, స్థిరత్వం కోసం ఇజ్రాయిల్‌తో ప్రపంచంతో పాటు భారత్‌ కలిసి ఉంటుందని మోడీ చెప్పారు.

ఈ ప్రాంతంలో శాంతికి యూఎన్‌ భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి ఒప్పందం ఒక మార్గాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. భారత్‌లో యూదు ప్రజలు ఎలాంటి హింస, వివక్ష లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. ”భారత్‌లో యూదులు తమ విశ్వాసాలను కాపాడుకు న్నారు. సమాజంలో పూర్తిగా కలిసిపోయారు” అని మోడీ తెలిపారు. ప్రస్తుత అనిశ్చిత ప్రపంచంలో భారత్‌, ఇజ్రాయిల్‌ వంటి విశ్వసనీయ భాగస్వాముల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం చాలా ముఖ్యమని కూడా మోడీ తెలిపారు. త్వరలోనే భారత్‌ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనీ, మరోవైపు ఇజ్రాయిల్‌ ఆవిష్కరణ, సాంకేతిక రంగాలల్లో శక్తివంతమైన దేశమని చెప్పారు. భారత్‌, ఇజ్రాయిల్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యమని మోడీ అన్నారు. మోడీకి ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ‘స్పీకర్‌ ఆఫ్‌ ది నెన్సెట్‌ పతకం’ను ప్రదానం చేసింది. నెన్సెట్‌ అత్యున్నత గౌరవంగా భావించే ఈ పతకాన్ని భారత్‌-ఇజ్రాయిల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన అసాధరణ కృషికి గుర్తింపుగా ప్రదానం చేస్తున్నట్టు పార్లమెంట్‌ తెలిపింది.

మోడీ ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు
భారత ప్రధాని మోడీ పర్యటనకు ముందు ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌లో గందరగోళం చెలరేగింది. ఇజ్రాయిల్‌లోని ప్రతిపక్ష పార్టీలు నెస్సెట్‌ (ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌)లో మోడీ ప్రసంగాన్ని బహిష్కరించాయి. నెస్సెట్‌ స్పీకర్‌ అమీర్‌ ఒహానా నిర్ణయంతో వివాదం ప్రారంభమైంది. నెతన్యాహు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరిస్తోందని, దీనితో భారత ప్రధాని ప్రసంగానికి హాజరు కాకూడదని నిర్ణయించాయి. ప్రతిపక్షాల బహిష్కరణతో భారత ప్రధాని పర్యటన చుట్టూ అసౌకర్య వాతావరణాన్ని ఏర్పర్చింది. మోడీ ప్రసంగించే సమయంలో పార్లమెంటులో సగం సీట్లు ఖాళీగా ఉండటం ప్రతికూల సందేశాన్ని పంపినట్టయ్యింది. ఈ పరిస్థితిని నివారించడానికి ఉన్న సభ్యులను నిలబెట్టి మోడీ..మోడీ అంటూ నినాదాలు చేయించటం గమనార్హం.

ఇజ్రాయిల్‌లో రెండోసారి పర్యటించిన మోడీ
ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం ”ఇజ్రాయిల్‌ , భారత్‌ మధ్య అద్భుతమైన పొత్తు ఉన్నది. మేం అన్ని రకాల సహకారాన్ని చర్చించబోతున్నాం” అని వివరించింది. గతేడాది ఇజ్రాయిల్‌ ఆర్థిక మంత్రి బెజలెల్‌ స్మోట్రిచ్‌ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఇజ్రాయిల్‌ , భారత్‌ పరస్పర వాణిజ్యాన్ని విస్తరించడానికి పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశాయి. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి అనాగరికమంటూ తీవ్రంగా ఖండించారు. గాజాలో ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణహోమంలో చిన్నారులు మహిళలుసహా 75 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయినా, దాని గురించి తన ప్రసంగంలో మోడీ ప్రస్తావించకపోవడం గమనార్హం.

ప్రధాని మోడీ అండగా నిలిచారు
ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌లో సభ్యులు లేచి నిలబడి ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందు పార్లమెంట్‌లోని అతిథుల పుస్తకంలో మోడీ సంతకం చేశారు. మోడీని పొగడ్తలో ముంచెత్తిన నెతన్యాహు, ‘ప్రధాని మోడీ మనకు అండగా నిలిచారు.’ ఇజ్రాయిల్‌కు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించారు. దాదాపు 150కోట్ల మంది ప్రజా శక్తి కలిగిన భారత్‌ మహత్తరమైన శక్తి కలిగిన దేశం. దానితో పోలిస్తే ఇజ్రాయిల్‌ చాలా చిన్నది, అయినా శక్తివంతమైనదే, మన రెండు దేశాల మధ్య పొత్తు మన వ్యక్తిగత శక్తుల కన్నా అనేక రెట్లు ఎక్కువ. మీరు మాతో నిలిచారు.” అని నెతన్యాహు పార్లమెంట్‌ నుద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -