కుమ్మెరలో సమాజం తలదించుకునేలా పోలీసుల వ్యవహారం
బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)
ఉద్యమాల పురిటి గడ్డలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం : ప్రముఖ కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
ప్రపంచం నివ్వెర పోయేలా పెత్తందారుల ఆగడాలు : భూపాల్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
నాగర్‌కర్నూల్‌లో చిన్నారి కుటుంబాన్ని పరామర్శ, మద్దతు
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసిపాప మృతిచెందిన ఘటనపై నాగర్‌కర్నూల్‌లో జరుగుతున్న ధర్నా శిబిరానికి పలు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ తదితరులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో మాటలకందని మహా విషాదం చోటు చేసుకుందని, సభ్య సమాజం తలదించుకునేలా పెత్తందార్ల వ్యవహార శైలి ఉందని అన్నారు. గుండెలు అవిసిపోయేలా హృదయవిధారకమైన ఘటన జరిగినప్పటికీ పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం అప్రజాస్వామికమని తెలిపారు.
పేదలు దర్శనానికి వెళితే మరణ శాసనం లిక్కించిన పెత్తందారులను జైళ్లకు పంపాల్సిందేనన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించాల్సింది పోయి బాధితులు దరఖాస్తు పెట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పసిపాపకు పాలు పట్టాల్సిన తల్లి కన్నీరు పెట్టుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అడ్డుకుని దాడి చేయడమే కాకుండా, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో పాలకులు రాజ్యాంగాన్ని సైతం ఖననం చేశారని, పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ సామాన్యులకు న్యాయం దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసికందు మృతికి కారణమైన ఎనిమిది మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాల పురటి గడ్డలో ఇలాంటి ఘటన దారుణం : గోరటి వెంకన్న
ప్రముఖ నాయకులు, మాజీ మంత్రి మహేంద్రనాథ్‌తో పాటు అనేక ఉద్యమకారులకు పురుడు పోసుకున్న ఈ నేలలో పసికూనను పొట్టన పెట్టుకోవడం దారుణమని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. పాలకులు ఎవరైనా సామాజిక బాధ్యతను విస్మరించరాదన్నారు. దోషులను అరెస్టు చేసి సామాజిక న్యాయాన్ని కాపాడే విధానం ఇక్కడినుండే ప్రారంభం కావాలని తెలిపారు. ఉద్యమాల చిరునామాగా నిలిచే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పసికందు మరణంపై సీఎం స్పందించాలి : భూపాల్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ.. ప్రపంచం నివ్వెర పోయేలా పోలీసులు, అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ జిల్లా వాసిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పసిపాప మరణంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యా నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, అంతటి కాశన్న, బీఎస్పీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



